కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా గాంధీ
x
Highlights

ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ సోనియా గాంధీకే అప్పగించారు. సీడబ్ల్యూసీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ ససేమిరా అనడంతో సోనియాను ఎంచుకున్నారు.

ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ సోనియా గాంధీకే అప్పగించారు. సీడబ్ల్యూసీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ ససేమిరా అనడంతో సోనియాను ఎంచుకున్నారు. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా ఉండనున్నారు. గాంధీ కుటుంబేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ సీడబ్ల్యూసీలో పార్టీ సీనియర్ నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ తాత్కాలికంగానే కొనసాగే అవశాకాలు ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. త్వరలో మరోసారి సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎన్నుకున్నట్లు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ గాంధీ అంగీకరించకపోవడంతో సోనియాకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి ముందు సోనియా గాంధీ సుమారు 19 ఏళ్లు కాంగ్రెస్ సారథిగా కొనసాగి రికార్డు సృష్టించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆపద్భాందవుడి పాత్ర పోషించారు. 2017లో అనారోగ్యం తదితర కారణాలతో ఆ బాధ్యతలను తన కుమారుడు రాహుల్‌కు అప్పగించారు. అయితే.. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఢిల్లీలోని కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ కొత్త సారథి అంశంపై తీవ్ర కసరత్తు చేశారు. రాహుల్ గాంధీ తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని నేతలంతా కోరారు. కానీ, పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో పార్టీ బాధ్యతలను మరో వ్యక్తికి అప్పగిస్తే చీలిపోయే ప్రమాదం ఉందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీని ఆ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఆమె ఓకే చెప్పడంతో నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories