నాన్ స్టాప్ వానలతో ముంబై నగరవాసులు నరకం...

నాన్ స్టాప్ వానలతో  ముంబై నగరవాసులు నరకం...
x
Highlights

భారీ వర్షాలు ముంబై వాసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయ్. పట్టపగలే ముంబై రోడ్లన్నీ చీకటి కమ్మేసింది. ఏ రోడ్డు చూసినా చెరువునే తలపిస్తోంది. నాన్ స్టాప్...

భారీ వర్షాలు ముంబై వాసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయ్. పట్టపగలే ముంబై రోడ్లన్నీ చీకటి కమ్మేసింది. ఏ రోడ్డు చూసినా చెరువునే తలపిస్తోంది. నాన్ స్టాప్ వానతో నగరవాసులు నరకం చూస్తున్నారు. భారీ వర్షాలకు ముగ్గురు చనిపోయారు, ఐదుగురు గాయపడ్డారు . అటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పలు చోట్ల వర్షాలు కుమ్మేస్తున్నాయి.

చిన్న చినుకు పడితేనే చిత్తడయ్యే ముంబై మహానగరం.. భారీ వర్షాలకు వణికిపోతోంది. వరదనీరు వచ్చి భారీగా చేరడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లోకి కూడా నీళ్లు చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మోకాలి లోతుకు పైగా నీరు రోడ్లపై నిలిచిపోవడంతో జనాలుపడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పైగా ఏది రోడ్డో, ఏది కాలువో తెలియట్లేదు. ఎటు వెళ్దామన్నా నీరే కనిపిస్తోంది చాలా చోట్ల.

మొన్నటి వరకు ఎండలతో ఉక్కపోత అనుభవించిన ముంబై వాసులు... ఇప్పుడు వానలతో నరకం చూస్తున్నారు. కుండపోత వర్షానికి థానే దగ్గర్లోని జుహు, ములుంద్, విలె పార్లె, వసాయ్, విరార్ తదితర ప్రాంతాలన్నీ జలదిగ్బంధం అయ్యాయి. దాదర్, వదాలా, వర్లీ, కుర్లా, చెంబూర్, బాంద్రా, అంధేరీ, కండీవిలీ, విఖ్రోలీ, కంజుర్మార్గ్, భాందూప్ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అపార్టుమెంట్ సెల్లార్లు నీటితో నిండిపోవడంతో కనీస అవసరాలు తీర్చులేక ఇబ్బందులు పడుతున్నారు.

పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవటంతో ముంబైలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవటంతో చాలామంది రోడ్లపైనే గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఆఫీస్ లు, స్కూళ్లు, కాలేజ్ లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక లోకల్ ట్రైన్లు, సబ్ అర్బన్ ట్రైన్లు సైతం చాలా వాటిని నిలిపివేశారు. పట్టాలపై పెద్ద ఎత్తున నీరు చేరటంతో మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. ఇతర రైలు సర్వీసులు, విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మొత్తానికి ముంబై మహానగరాన్ని వరుణ గండం వెంటాడుతోంది. నగరంపై పగబట్టినట్లుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాడు. అయితే.. వరదనీరు ముంబైను ముంచెత్తిన నేపథ్యంలో తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రజలు మ్యాన్ హోళ్లను తెరవరాదని హెచ్చరించడంతో పాటు వరద పీడిత ప్రాంతాల్లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్ .డి.ఆర్ .ఎఫ్ సిబ్బంది రెడీగా ఉన్నారు.

ముంబైతో పాటు గుజరాత్ , ఒడిశా,హిమాచల్ ప్రదేశ్ , సిమ్లా, ఉత్తరాఖండ్ లో వానలు దంచికొడుతున్నాయ్. నైరుతి ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జనజీవనం సంభించిపోయింది. నదులు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో టూరిస్టులు భయాందోళన చెందుతున్నారు. నదులు ఉగ్రరూపం చూపడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తోందని భయపడుతున్నారు.

ముంబై తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. సముద్రపు అలలు ఎగిసిపడుతుండటంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు మరో 24 గంటల పాటు ఇలాగే కురిసే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories