ప్రభుత్వ నినాదం సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌

ప్రభుత్వ నినాదం సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌
x
Highlights

'సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌' అనేది తమ ప్రభుత్వం నినాదమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ప్రజల జీవన స్థితిగతులను...

'సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌' అనేది తమ ప్రభుత్వం నినాదమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన ఆయన లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను రాష్ట్రపతి అభినందించారు.

ప్రభుత్వం సుపరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రసంగం కొనసాగింది. గురువారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలకు చెందిన సభ్యులను ఉద్దేశించి సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతి ప్రసంగం చేశారు. ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపిలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ దేశ ప్రజలు విజ్ఞతతో ఓటువేశారని రాష్ట్రపతి కితాబిచ్చారు.

ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు కోవింద్. శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. రైతుల గౌరవాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్‌ అందిస్తామని చెప్పారు. వీర్‌జవన్‌ స్కాలర్‌షిప్‌ రాష్ట్రాల పోలీసుల పిల్లలకూ అందచేస్తామన్నారు. నదులు, కాల్వలు ఆక్రమణల వల్ల జల వనరులు తగ్గిపోతున్నాయని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. స్వచ్ఛ భారత్‌ తరహాలో జల సంరక్షణ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన ప్రకటించారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు రాష్ట్రపతి. ఆక్వా కల్చర్‌ ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశముందని, దీనికోసం నీలి విప్లవం తీసుకొస్తామని తెలిపారు. జన్‌ధన్‌ యోజన్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవల్ని ప్రతి ఇంటికి చేర్చామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులో తీసుకొస్తున్నామని, మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద 20 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కోవింద్ తెలిపారు.

2024 నాటికి దేశంలో 50 లక్షల స్టార్టప్స్‌ ఏర్పాటవుతాయని చెప్పారు రామ్‌నాథ్ కోవింద్. ఉన్నత విద్యా సంస్థల్లో 2 కోట్ల సీట్లు అదనంగా వస్తాయన్నారు. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, క్రీడాకారులకు అత్యాధునిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ బలపడుతోందన్న రాష్ట్రపతి మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. దేశంలో బ్రూణ హత్యలు తగ్గాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్రిపుల్‌ తలాఖ్‌ ను అరికట్టాలని కోరిన రాష్ట్రపతి జిఎస్‌టి రాకతో పన్నుల వ్యవస్థ సులభతరమైందని తెలిపారు. జిఎస్‌టి చెల్లించే వ్యాపారులకు 10 లక్షల జీవిత బీమా అమలు చేస్తున్నామన్నారు. అవినీతి అంతానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వివరించారు రామ్‌నాథ్ కోవింద్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories