తారస్థాయికి చేరిన బీజేపీ-శివసేన మధ్య కీచులాట..శివసేనకు మద్దతిచ్చే యోచనలో కాంగ్రెస్

తారస్థాయికి చేరిన బీజేపీ-శివసేన మధ్య కీచులాట..శివసేనకు మద్దతిచ్చే యోచనలో కాంగ్రెస్
x
Highlights

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం పదవిని చెరిసగం పంచాల్సిందేనని, అధికారం విషయంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ...

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం పదవిని చెరిసగం పంచాల్సిందేనని, అధికారం విషయంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను పాటించాలని శివసేన గట్టిగా కోరుతున్నప్పటికీ అందుకు బీజేపీ ఏమాత్రం అంగీకరించడం లేదు. మరోవైపు బీజేపీ-శివసేన మధ్య ప్రతిష్టంభనను సానుకూలంగా మల్చుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోంది. శివసేన నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకొస్తే మద్దతిచ్చే విషయం పరిశీలిస్తామని ప్రకటించింది.

ముంబైలో జరిగిన సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీజ్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫడ్నవీజ్ తో సహా ఎమ్మెల్యేలంతా కాషాయం రంగు తలపాగాలతో ఆకట్టుకున్నారు. శివసేనతో కలిసి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఫడ్నవీజ్ స్పష్టం చేశారు. తమకు మద్దతిచ్చేందుకు కొందరు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

రెండున్నర ఏళ్లు సీఎం పదవిపై రాజీ పడే ప్రసక్తేలేదని శివసేన స్పష్టం చేసింది. అధికారం విషయంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను పాటించాలని గట్టిగా కోరుతోంది. శివసేన డిమాండ్లను ఒప్పుకోని బీజేపీ శివసేనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు 13 మంత్రి పదవులు ఇస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి, హోంమంత్రితో పాటు 26 మంత్రి పదవులను తమ వద్ద ఉంచుకుంటామని టాప్ 4 మంత్రిపదవుల విషయంలో సేనతో ఎలాంటి చర్చలకు, బేరసారాలకు తావులేదని తేల్చిచెప్పింది.

బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న శివసేన అవసరమైతే పక్క చూపులు కూడా చూస్తామని ఇదివరకే బెదిరిచింది. బీజేపీ-శివసేన మధ్య ప్రతిష్టంభనను సానుకూలంగా మల్చుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోంది. శివసేన నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకొస్తే పరిశీలించడానికి సిద్ధం ఉన్నామని, పార్టీ హై కమాండ్, మిత్రపక్షమైన ఎన్సీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ ప్రకటించారు.

సుమారు 17 మంది రెబల్స్ మద్దతు తమకే ఉంటుందనుకున్న బీజేపీ శివసేన డిమాండ్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రెండు కాషాయపార్టీల మధ్య ఎలాంటి డీల్ కుదురుతుంది..? ఎవరు రాజీపడతారనేదే ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories