మిగిలింది మరో వారమే.. సమష్టిగా కృషి చేస్తే, కరోనాపై పోరులో మంచి ఫలితాలను..

మిగిలింది మరో వారమే.. సమష్టిగా కృషి చేస్తే, కరోనాపై పోరులో మంచి ఫలితాలను..
x
Highlights

కరోనాను కట్టడికి విధించిన 21 రోజుల లాక్ డౌన్ లో రెండు వారాలు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో డెడ్ లైన్ ముగియనుంది. అయితే ఇప్పటివరకు పాటించిన లాక్ డౌన్...

కరోనాను కట్టడికి విధించిన 21 రోజుల లాక్ డౌన్ లో రెండు వారాలు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో డెడ్ లైన్ ముగియనుంది. అయితే ఇప్పటివరకు పాటించిన లాక్ డౌన్ ఒక ఎత్తైతే ఈ వారం రోజులు మరో ఎత్తు అంటున్నారు నిపుణులు. కరోనాను అదుపులో ఉంచాలంటే ఈ వారం రోజులే కీలకమని చెబుతున్నారు. జాతి భవిష్యత్తు ఈ వారం రోజుల్లో తీసుకునే జాగ్రత్తల్లోనే ఉందంటూ వచ్చే ఏడు రోజుల పాటు పకడ్బందీగా లాక్ డౌన్ ను పాటించాలని సూచిస్తున్నారు.

వైరస్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు బయట పడటానికి 2 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. అంటే పరిస్థితులన్నీ సాధారణంగా ఉంటే ఇప్పటికే కరోనా తీవ్రతపై ఒక అంచనాకు వచ్చే సమయం పూర్తయింది. కానీ మర్కజ్ మత ప్రార్థనలతో దేశంలో కరోనా కేసులు అమాంతం పెరిగాయి. వారం రోజుల్లో వేల కొద్దీ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే మర్కజ్ కు వెళ్లొచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లలో చాలా వరకు మార్చి 17 నుంచి 20 మధ్య తమ ప్రాంతాలకు చేరుకోవటంతో వీరు స్వస్థలాలకు వచ్చి ఈనెల 6 నాటికి 14 రోజులు పూర్తయింది. అంటే మర్కజ్ యాత్రికుల్లో ఎవరికైనా కరోనా సోకివుంటే, ఈ పాటికి బయటపడాల్సి ఉంది. వీరిద్వారా వైరస్ మరెవరికైనా సోకివుంటే, వారిలో లక్షణాలు కనిపించడానికి మరో 10 రోజుల సమయం పడుతుంది. అయితే మర్కజ్ వెళ్లొచ్చిన వారిని వారితో సన్నిహితంగా ఉన్న వాళ్లని గుర్తించి ఈ నెల 2 నాటికి క్వారంటైన్ చేశారు అధికారులు.

ఇక మర్కజ్ కు వెళ్లొచ్చిన వారికి సన్నిహితంగా ఉన్న ఎవరికైనా కరోనా సోకి ఉంటే ఈ నెల 15 వరకూ బయటపడే అవకాశాలున్నాయి. దీంతో ఈ నెల14 వరకూ ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి, లాక్‌డౌన్‌ను పాటిస్తే, వైరస్ అదుపులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ వారం రోజులూ అనుసరించాల్సిన విధానాలపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు, పోలీస్‌ అధికారులతో ఓరియెంటేషన్ సెషన్ ను నిర్వహిస్తోంది ఆరోగ్య శాఖ. ప్రజలకు ఆహారంతో పాటు నిత్యావసర వస్తువులు, మందులకు ఇబ్బందులు లేకుండా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచిస్తోంది. వారం రోజులు సమష్టిగా కృషి చేస్తే, కరోనాపై పోరులో మంచి ఫలితాలను చూడవచ్చని సూచిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories