పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఆకలి కష్టాలు..పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తానంటోన్న..

పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఆకలి కష్టాలు..పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తానంటోన్న..
x
Highlights

ఆయన ఓ నిరుపేద గిరిజన రైతు. తన ఊరి రైతులు పడుతున్న నీటి కష్టాలను తీర్చేందుకు భగీరథ ప్రయత్నం చేశారు. దీనికి మెచ్చి కేంద్రం పద్మశ్రీ అవార్డు కూడా...

ఆయన ఓ నిరుపేద గిరిజన రైతు. తన ఊరి రైతులు పడుతున్న నీటి కష్టాలను తీర్చేందుకు భగీరథ ప్రయత్నం చేశారు. దీనికి మెచ్చి కేంద్రం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. అయితే ఆ అవార్డే ఆయనకు ఇప్పుడు కష్టం తెచ్చింది. దీంతో ఆ అవార్డు తిరిగి ఇచ్చేస్తా అంటున్నారు. ఇంతకీ ఎవరా రైతు..? ఆయనకు వచ్చిన కష్టం ఏమిటి..?

ఈయన పేరు దైతరీ నాయక్. వయస్సు 75 ఏళ్లు. ఒడిసాలోని కియోంఝర్‌ జిల్లా తాళబైతరణి గ్రామానికి చెందిన నిరుపేద, గిరిజన రైతు. సాగునీరు లేక తన ఊరి రైతులు పడుతున్న కష్టాలను తీర్చేందుకు పలుగు, పార పట్టారు దైతరీ నాయక్. ఒంటిచేత్తో గోనాసిక పర్వతాల మధ్య 3 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు. బైతరణీ నదీ జలాలను ఊరివైపు మళ్లించారు. దీంతో గ్రామంలో అదనంగా మరో 100 ఎకరాలకు సాగుజలాలు అందాయి. ఈ చొరవచూపినందుకే పద్మశ్రీ అవార్డు దైతరీ నాయక్‌ను వరించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా అందుకున్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా అవార్డు అందుకున్నాక దైతరీ నాయక్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. తనకు అందించిన పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని నాయక్‌ అంటున్నారు. ఆ అవార్డు అందుకున్న తర్వాతే తన కష్టాలు మొదలైయాయని ఆయన చెబుతున్నారు. కడుపు నింపుకునేందుకు ప్రస్తుతం చీమగుడ్డు తినాల్సి వస్తోందని ఆవేదన వెళ్లగక్కుతున్నారు దైతరీ నాయక్‌. తునికాకు ఏరుతూ, మామిడి తాండ్ర అమ్ముతూ వచ్చే కొద్దిపాటి డబ్బులతో కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు చెబుతున్నారు. అంతకుముందు వరకు ఊళ్లో అందరితో కలిసి వ్యవసాయ కూలీ పనులు చేసిన ఆయనకు పద్మశ్రీ అందిందన్న గౌరవంతో పనులు ఇవ్వడం మానేశారు. దీంతో గౌరవం దక్కుతున్నందుకు సంతోషపడాలో పని దొరకనందుకు బాధపడాలో తెలియక నాయక్‌ మనోవేదన అనుభవిస్తున్నారు. తన కష్టాలకు కారణమైన పద్మశ్రీ అవార్డును సర్కారుకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు దైతరీ నాయక్‌. అయితే అధికారులు మాత్రం నాయక్‌కు నచ్చచెప్పి ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories