ఉత్తర భారతాన్ని వణికిస్తోన్న చలి పులి

ఉత్తర భారతాన్ని వణికిస్తోన్న చలి పులి
x
Highlights

ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి శీతల గాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్నమైనా కూడా చాలా ప్రాంతాల్లో సూర్యుడు కనిపించడం లేదు. విపరీతంగా మంచు కురియడంతో పాటు, పొగ మంచు కప్పేస్తుండడంతో రవాణా సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. రైలు, విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి.

ఉత్తరాదితో పాటు వాయవ్య భారతదేశంలోనూ శీతల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉత్తరాదిలో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్‌ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా లంబసింగిలోను 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కోస్తాంధ్రలో గరిష్ట ఉష్ణోగ్రతలు 27–30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 11–21 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అయితే రాయలసీమలో మాత్రం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం వల్ల కోస్తా, తెలంగాణ కంటే చలి ప్రభావం అక్కడ తక్కువగా ఉంటోంది. మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగడమే కాక చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories