మనోహర్ పారికర్ ప్రస్థానం..

మనోహర్ పారికర్ ప్రస్థానం..
x
Highlights

కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఐదుగురు వైద్యుల బృందం చికిత్స...

కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఐదుగురు వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పారికర్ మృతితో బీజేపీ నేతలు విషాదంలో మునిగిపోయారు. బీజేపీలో అత్యంత కీలకమైన నేతల్లో పారికర్ కూడా ఒకరు. ఒకానొక దశలో ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థి. 2018 నుంచి మనోహర్ పారికర్ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఒకసారి అమెరికాలో కూడా ఆయనకు చికిత్స తీసుకున్నారు. అయినా ఆరోగ్యం మెరుగుపడలేదు. రోజు రోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాలని అనుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానం సూచన మేరకు పదవిలో కొనసాగారు. ఆదివారం ఆయన మృతిచెందారు. దాంతో ముఖ్యమంత్రి పదవిలో ఉండి మృతిచెందిన వారిలో పారికర్ కూడా చేరిపోయారు. కాగా నీతి, నిజాయితీకి మారుపేరైన పారికర్ గోవా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. గోవా ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం ఆయన కేంద్ర మంత్రి పదవిని సైతం వదులుకున్నారు.

1955, డిసెంబరు 13న గోవాలోని మపూసాలీ జన్మించిన పారికర్. ఐఐటి విద్యను పూర్తి చేశారు. ఐఐటి చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రాజకీయనాయకుల్లో పారికర్ మొదటి స్థానంలో నిలిచారు. విద్యాబ్యాసం అనంతరం ఉద్యోగంలో స్థిరపడిన ఆయన స్వాతంత్రసమరయోధుల ప్రభావంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. దాంతో మొదట1994లో తొలిసారిగా గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత మరోసారి 1999లో గెలిచి గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2002 ఫిబ్రవరి 27 వరకు సీఎం పదవిలో ఉన్నారు. మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా ఆయన నెట్టుకొచ్చారు. ఇక 2007 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో దిగంబర్ కామత్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తిరిగి 2012 శాసనసభ ఎన్నికలలో బీజేపీ మెజారిటీ సీట్లను సాధించడంతో మరోసారి పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2017 గోవాకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించడంతో మళ్ళీ గోవాకు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే దురదృష్టవశాత్తు 2018 నుంచి ఆయన క్యాన్సర్ భారిన పడి ఆదివారం తుదిశ్వాస విడిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories