శివసేనకే సీఎం పదవి

శివసేనకే సీఎం పదవి
x
Highlights

అంతా ఊహించినట్టుగానే మహారాష్ట్రలో మూడు పక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. శివసేన అలు పెరుగని ప్రయత్నాలకు శరద్ పవర్ కృషి తోడు కావడంతో సంకీర్ణ ప్రభుత్వానికి...

అంతా ఊహించినట్టుగానే మహారాష్ట్రలో మూడు పక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. శివసేన అలు పెరుగని ప్రయత్నాలకు శరద్ పవర్ కృషి తోడు కావడంతో సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ కూడా సై అంది. మూడు పక్షాలు కామన్ మినిమం ప్రోగ్రాంతో ముందుకు పోవాలంటూ నిర్ణయించుకున్నాయి. ఇదే సమయంలో పదవుల పందేరంపై కూడా దాదాపు క్లారిటీ వచ్చింది.

సీఎం పదవే లక్ష్యంగా మహారాష్ట్రలో పావులు కదిపిన శివసేన ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించేందుకు చేరువైంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌, ఎన్సీపీలు అంగీకరించారు. మూడు వారాల ప్రతిష్టంభనకు తెర దింపుతూ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. సీఎం పదవిని శివసేనకు అప్పగించేందుకు అటు కాంగ్రెస్, ఇటు ఎన్‌సీపీ అంగీకరించడంతో త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరో వైపు కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి, ఎన్సీపీకి మండలి చైర్మన్‌ పదవి దక్కేలా ఒప్పందం కుదిర్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరాఠ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకే తాము సీఎం పదవి కోరామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. రాబోయే 25 ఏళ్లు ముఖ్యమంత్రి పీఠం తమదేనని ఆయన అన్నారు. ఇక రాజకీయంగా బద్ధశత్రువుగా భావించే కాంగ్రెస్‌ పార్టీతో మైత్రి గురించి మాట్లాడుతూ కురువృద్ధ పార్టీగా చరిత్రకెక్కిన కాంగ్రెస్‌ పార్టీలోని నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

మొత్తం 288 స్దానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా 105 మంది సభ్యులు ఉండగా శివసేనకు 56 మంది,ఎన్‌సీపీకి 54 మంది, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో పాటు మరో 23 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు,వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు సభ్యులున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌,ఎన్సీపీ, శివసేనకు కలిపి 154 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఈజీగా మేజిక్ ఫిగర్ చేరుకుంటారని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు.

పదవుల పందేరంపై కూడా క్లారిటి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శివసేనకు సీఎంతో పాటు 14 మంత్రి పదవులు, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, 14 మంత్రి పదవులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎంతో పాటు 12 మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. దీనికి మూడు పార్టీల అధినేతలు ఉద్దవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, సోనియా గాంధీ అంగీకారం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నందున గవర్నర్ దగ్గరకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే యోచనలో శివసేన నేతలు ఉన్నారు. అయితే శివసేన ప్రతిపాదనకు గవర్నర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

Keywords: Maharashtra, Congress, NCP, shiv sena

Show Full Article
Print Article
More On
Next Story
More Stories