యడియూరప్పను టెన్షన్‌ పెట్టిన ఊరేది?

యడియూరప్పను టెన్షన్‌ పెట్టిన ఊరేది?
x
Highlights

ఆయనకు పదవీ ప్రీతి, బంధుప్రీతే కాదు, దైవభక్తి కూడా చాలా ఎక్కువ. సెంటిమెంట్లంటే మక్కువ మరీ ఎక్కువ. అదీ కూడా తన సీటుకే ఎసరు వస్తుందంటే చాలు, నీడను కూడా...

ఆయనకు పదవీ ప్రీతి, బంధుప్రీతే కాదు, దైవభక్తి కూడా చాలా ఎక్కువ. సెంటిమెంట్లంటే మక్కువ మరీ ఎక్కువ. అదీ కూడా తన సీటుకే ఎసరు వస్తుందంటే చాలు, నీడను కూడా దూరం చేయాలని కంగారు పడిపోతారాయన. బోటాబోటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, ఎప్పుడు ఎక్కడి నుంచి ముప్పు పొంచి వుందోనన్న పీడకలలతో, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట ఆ ముఖ్యమంత్రి. తాజాగా ఓ వరద ప్రభావిత ప్రాంతానికి వెళ్లాల్సి వున్నా, సెంటిమెంట్‌ భయంతో, ఏకంగా ఆ టూర్‌నే రద్దు చేసుకున్నారట. ఇంతకీ అంతగా వణికిపోతున్న సీఎం ఎవరు ఆ ఊరికి, సీఎం పదవికి లింకేంటి?

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ సర్కారు తిరిగి అధికారం ఎలా చేజిక్కించుకుందో, దేశమంతా చూసింది. కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేల ముంబై క్యాంపు రాజకీయాలు, బోటాబోటి మెజారిటీ మార్కుతో, బీజేపీ గట్టెక్కడం, యడియూరప్ప తిరిగి సీఎం పీఠంపై ఆశీనుడు కావడం, అంతా ఒక మాయలా గడిచిపోయింది. ఇప్పుడు కూడా యడియూరప్ప సర్కారుది, టెక్నికల్‌గా తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమే. ఇలాంటి పరిస్థితుల్లో, సీఎం యడియూరప్పకు పీడకలలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వానికి ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న టెన్షన్‌‌ వెంటాడుతూనే వుంది. తన నీడను చూసి కూడా భయపడే పరస్థితికి వచ్చారు యడియూరప్ప. తాజాగా ఓ సెంటిమెంట్‌తో యడియూరప్ప తన పర్యటనే రద్దు చేసుకోవడం ఇందుకు నిదర్శనం.

యడియూరప్పకు పదవీ ప్రీతి, బంధుప్రీతే కాదు, దైవభక్తి, నమ్మకాలు కూడా చాలా ఎక్కువని కర్ణాటక నేతలే చెబుతుంటారు. ముహూర్తాలు పక్కాగా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈమధ్య జరిగిన ఒక ఘటన, కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటకలో పలు ప్రాంతాలపై కొన్ని సెంటిమెంట్లు ప్రచారంలో ఉన్నాయి. చామరాజనగర జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే, సీఎంలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే, అక్కడికెళ్తే సీఎం పీఠం జారిపోతుందని భయం. ఆరునెలల్లో పదవీ గండం తప్పదన్న ప్రచారం. ఇలాంటి ప్రచారమే అరేబియా తీర నగరం కార్వార మీద కూడా జరుగుతోంది. తాజాగా యడియూరప్పను కాస్త భయపెట్టిన ప్రాంతమిది.

ఉత్తర కన్నడ జిల్లా కేంద్రం కార్వారలో ఏ ముఖ్యమంత్రైనా పర్యటిస్తే ఆ తరువాత పదవి ఊడిపోయడం ఖాయమని చెబుతారు. అందుకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఉదాహరిస్తున్నారు. 2005 నవంబరులో అప్పటి సీఎం ధరంసింగ్‌ కార్వారలో టూర్ చేశారు. తరువాత రెండు నెలలకు సంకీర్ణ జేడీఎస్‌తో మైత్రి తెగిపోవడంతో సీఎం పీఠం చేజారింది. 2010 నవంబరు 19న అప్పటి సీఎం యడియూరప్ప కార్వారలో కాలుమోపారు. 2011 ఆగస్టులో అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడంతో పదవీచ్యుతులయ్యారు. 2012 ఫిబ్రవరిలో సీఎం సదానందగౌడ కార్వార పర్యటన తర్వాత, అదే ఏడాది జూలైలో సీఎం పదవి కోల్పోయి, ఇంటిదారి పట్టారు. పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగా జగదీశ్‌ శెట్టర్‌ సీఎం అయ్యారు. 2013 జనవరిలో అప్పటి సీఎం జగదీశ్‌ శెట్టర్‌ కార్వారలో పర్యటించి, అదే ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఎక్స్‌ సీఎంగా మిగిలిపోయారు. 2018 ఫిబ్రవరిలో సీఎంగా సిద్ధరామయ్య కార్వార వెళ్లారు. మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడంతో, పీఠం దిగాల్సి వచ్చింది. 2019 ఏప్రిల్‌ 4న సీఎం కుమారస్వామి కార్వారను సందర్శించారు. జూలైలో అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో బలపరీక్షలో ఫెయిలై ఇంటి దారి పట్టారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలు, అనుభవాలు గుర్తొచ్చి, కార్వార అంటేనే కంగారుపడిపోతున్నారట యడియూరప్ప.

కొన్ని రోజుల క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం యడియూరప్ప. యెడ్డీ షెడ్యూల్‌లో కార్వార కూడా వుంది. కానీ హఠాత్తుగా కార్వార పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. అయితే వాతావరణం అనుకూలంగా లేదని పర్యటన రద్దు చేసుకున్నారు. అదే ఇప్పుడు కర్ణాటకలో చర్చనీయాంశమైంది. అయితే, పదవీ గండం భయంతో వెనకడుగు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సీఎం వస్తారని జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. కార్వారతో పాటు శిరసి, సిద్ధాపుర, కుమటె, అంకోలా, భట్కళ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే హెలికాప్టర్‌ వెళ్లేందుకు వాతావరణం సరిగా లేదని రద్దు చేసుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్పారు. దీంతో సీఎం షెడ్యూల్‌ మార్చుకుని హెలికాప్టర్‌లో శివమొగ్గకు తరలివెళ్లారు. అక్కడి నుంచి హావేరికి వెళ్లారు. బోటాబోటి మెజారిటీతో సర్కారును నడుపుతున్న యడియూరప్ప, కేవలం పదవీ భయంతోనే పర్యటన రద్దు చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే కోణంలో విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది కాంగ్రెస్‌. దీనిని బట్టి చూస్తుంటే, ప్రజల కన్నా పదవే ముఖ్యమని యడియూరప్ప భావిస్తున్నారని, అధికారం కోసం పాకులాడుతున్నట్లు స్పష్టం అవుతోందని కార్వార కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తానికి సీఎం పీఠం పట్ల, యడియూరప్ప ఎంతగా భయపడుతున్నారో, కార్వార పర్యటన రద్దును బట్టి అర్థమవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories