కార్గిల్ కొదమ సింహాలకు నివాళి..శత్రు సైన్యాన్ని చిత్తు చేసిన భారత సైన్యం

కార్గిల్ కొదమ సింహాలకు నివాళి..శత్రు సైన్యాన్ని చిత్తు చేసిన భారత సైన్యం
x
Highlights

డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ములేదు. దొడ్డిదారిలో దురాక్రమణకు పాల్పడింది. ఉగ్రవాదులతో కలిసి సైన్యం మాటు వేసింది. మంచుకొండలపై మాటు వేసి భారత్ ను...

డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ములేదు. దొడ్డిదారిలో దురాక్రమణకు పాల్పడింది. ఉగ్రవాదులతో కలిసి సైన్యం మాటు వేసింది. మంచుకొండలపై మాటు వేసి భారత్ ను లొంగదీసుకోవాలని చూసింది. పాకిస్థాన్ పన్నిన దుష్ట పన్నగాన్ని మన వీర సైనికులు తిప్పికొట్టారు. ప్రత్యర్థులను చిత్తు చేశారు. 1999 లో పాకిస్థాన్‌పై విజయాన్ని గుర్తుచేసుకుంటూ మనదేశంలో ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ

నియంత్రణ రేఖ వెంబడి పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను భారత, పాకిస్థాన్ సైనికులు ఏటా శీతాకాలానికి ముందు ఖాళీ చేసేవారు. 14వేల నుంచి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ శిబిరాల్లో అత్యంత శీతల వాతావరణం, మానవ మనుగడకు దుర్లభమైన పరిస్థితులు ఉండటంతో రెండు దేశాల మధ్య ఈమేరకు అవగాహన కుదిరింది.

1999లో శీతాకాలంలో భారత బలగాలు వైదొలగడంతో పాక్ సైనికులు ముష్కో, ద్రాస్‌, కార్గిల్‌, బతాలిక్‌, తుర్‌తుక్‌ సబ్‌సెక్టార్లలోకి చొరబడ్డారు. నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో 4-10 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చారు. దాదాపు 130 భారత శిబిరాలను ఆక్రమించారు.

లద్దాఖ్‌, సియాచిన్‌కు భారత సైన్యం చేరలేని పరిస్థితిని కల్పించి, కశ్మీర్‌లో వేర్పాటువాద ఉద్యమానికి ఆజ్యం పోయాలని పాక్‌ సైనికాధికారులు వ్యూహారచన చేశారు. ఎత్తయిన పర్వత ప్రాంతం నుంచి తమ సైనికులను భారత్‌ తరిమేయలేదని అతివిశ్వాసంతో నాటి పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ ఈ కుట్ర పన్నారు. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని వాజ్‌పేయీ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు రెండు దేశాల మధ్య శాంతి కోసం 'లాహోర్‌ ప్రకటన' చేసిన సమయంలోనే ముషారఫ్‌ ఈ కుట్రను అమలుపరిచారు.

భారత సైన్యానికి చెందిన కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా నేతృత్వంలోని గస్తీ బృందం ద్రాస్‌ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా తొలి పోరాటం జరిగింది. పాక్‌ చొరబాటుదారులకు, భారత బృందానికి మధ్య కాల్పులు జరిగాయి. కాలియా బృందం వద్ద మందుగుండు సామగ్రి అయిపోయింది. దీంతో వారిని పాక్‌ సైనికులు నిర్బంధంలోకి తీసుకుని చంపేశారు. పాక్‌ చొరబాట్లపై స్థానికులు నుంచి భారత సైన్యానికి సమాచారం అందింది. తొలుత చొరబాటుదారులను ఉగ్రవాదులుగా మన సైనికాధికారులు భావించారు.

చొరబాటుదారులను తరిమికొట్టడానికి భారత సైన్యం 1999 మే 3న 'ఆపరేషన్‌ విజయ్‌' పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. . శత్రువుతో ముఖాముఖీ తలపడ్డాకే ఉగ్రవాదులతో పాటు, భారీగా ఆయుధాలు ధరించిన పాకిస్థాన్‌ సైనికులూ ఉన్నారని మన సైన్యానికి తెలిసింది. పటిష్ట బంకర్లలో ఉంటూ మన సైనికులు శత్రు సైన్యంపై కాల్పులు జరిపారు.

ఈ పోరాటంలో మే 25న భారత వాయుసేన రంగంలోకి దిగింది. 'ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌' పేరుతో చొరబాటుదారులపై వైమానిక దాడులకు ఉపక్రమించింది. 32వేల అడుగుల ఎత్తు నుంచి పోరాటం చేయాల్సి రావడంతో తొలుత వాయుసేనకు ఎదురుదెబ్బలు తప్పలేదు. చొరబాటుదారులు ప్రయోగించిన చిన్నపాటి క్షిపణులకు తొలి రెండు రోజుల్లోనే మూడు యుద్ధవిమానాలు కూలాయి. దీంతో వైమానిక దళం తన వ్యూహాలను మార్చింది. మిరాజ్‌-2000 యుద్ధవిమానాల్లో మార్పులు చేర్పులు చేపట్టి పర్వత ప్రాంతంలో నక్కిన శత్రు సైనికులపై బాంబుల వర్షం కురిపించింది.

మరోపక్క బోఫోర్స్‌ శతఘ్నులు గుళ్ల వర్షం కురిపించడంతో చొరబాటుదారులు కకావికలమయ్యారు. ఒకటి తర్వాత ఒకటిగా శిబిరాలు భారత వశమయ్యాయి. అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో పాక్‌ ప్రభుత్వం దారికొచ్చింది. మిగిలిన ఆక్రమణదారులను ఉపసంహరించుకుంది. ఈ పోరు 1999 జులై 26న అధికారికంగా ముగిసింది. ఈ పోరులో భారత్‌కు చెందిన 559 మంది సైనికులు వీర మరణం పొందారు. 1536 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 3వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. 1999 లో పాకిస్థాన్‌పై విజయాన్ని గుర్తుచేసుకుంటూ మనదేశంలో ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories