Top
logo

డౌన్ టు ఎర్త్..వన్ అండ్ ఓన్లీ శివన్!

డౌన్ టు ఎర్త్..వన్ అండ్ ఓన్లీ శివన్!
Highlights

శివన్... ఇప్పుడు భారత దేశం మొత్తం పలవరిస్తున్న పేరు. అది పేరు మాత్రమే కాదు ఆ పేరు ఇస్రోకి పర్యాయపదంగా మారింది....

శివన్... ఇప్పుడు భారత దేశం మొత్తం పలవరిస్తున్న పేరు. అది పేరు మాత్రమే కాదు ఆ పేరు ఇస్రోకి పర్యాయపదంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్-2 ప్రయోగానికి ఎంత పేరు వచ్చిందో అంతగా శివన్ పేరు మారు మోగుతోంది. శివన్ ఇప్పుడు కేవలం ఇస్రో చైర్మన్ మాత్రమే కాదు. ఇండియన్ ఐకాన్ కూడా.

ఇస్రో చైర్మన్ కె.శివన్ పూర్తి పేరు కైలాస వాడివూ శివన్. 1957 ఏప్రిల్ 14న అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున జన్మించారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ సమీపంలోని మేల సరక్కల్ విలైలో పుట్టారు. ఆయన తండ్రి కైలాస వాడివు తల్లి చెల్లం. అతి సామాన్యమైన రైతు కుటుంబం. శివన్ కుటుంబంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఒకరకంగా ఉన్నత చదువులు చదివిన ఘనత శివన్ కే చెందుతుంది. కుటుంబం మొత్తంలో ఈయనే మొట్టమొదటి గ్యాడ్యుయేట్.

ఆంగ్ల భాషలో చదివితేనే అద్భుతాలు సాధించగలరని, ఉన్నత స్థాయికి ఎదగగలరని అనుకోవడంలో పూర్తి నిజం లేదనడానికి శివనే ఉదాహరణ. సొంతూరిలోనే తన మాతృభాష తమిళంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభాసం పూర్తి చేసిన శివన్, తను మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేశారు. 1982లో ఐఐఎస్సీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. అప్పటి నుంచే ఇస్రోతో పని చేయడం ప్రారంభించారు. 2006లో ముంబై ఐఐటి నుంచి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పొందారు. పలు ఎరోనాటికల్ సోసీటీలకు ఫెలోగా ఉన్నారు. సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలోనూ ఆయన సభ్యుడు.

ఇస్రో లో ఓ సామాన్య జూనియర్ సైంటిస్టుగా జీవితం ప్రారంభించారు శివన్. క్రమంగా శివన్, ఇస్రో రాకెట్ లాంచ్ వెహికిల్స్ డిజైనర్ గా ఎదిగారు. పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికిల్ -పిఎస్ఎల్ వి- ప్రాజెక్టులో కీలక భాగస్వామి. అనేక పరిశోధనలు చేస్తూ తన మేధా శక్తితో అత్యున్నత స్థాయిలు అందుకున్నారు. ఆయన ఇస్రోలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రయోగాల్లోనూ శివన్ కీలక శాస్త్రవేత్త. క్రయోజెనిక్ ఇంజన్ ల రూపకల్పన, ప్రయోగాల్లో శివన్ పాత్ర అమోఘం.

2014 జులై 2న లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్ కి డైరెక్టర్ అయ్యారు. 2015 జూన్ 1న విఎస్ఎస్ సి కి డైరెక్టర్ అయ్యారు. ఇలా అప్పగించిన అన్ని బాధ్యతల్లోనూ విజయం సాధించడంతో 2108 జనవరి 15న శివన్ ఇస్రో చైర్మన్ గా అవకాశం దక్కింది. శివన్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే చంద్రయాన్-2 రూపుదిద్దుకుంది. శివన్ చైర్మన్ షిప్ లోనే చంద్రయాన్-2 అనేక అవరోధాలను అదిగమించి అంతరిక్షంలోకి 2019 జులై 22న చంద్రుడి మీదకు ప్రయోగించబడింది.

అత్యంత విజయవంతంగా నడిచిన చంద్రయాన్-2 సెప్టెంబర్ 7న ఆఖరు నిమిషంలో కమ్యూనికేషన్ అందకుండా పోయింది. 1.2 కిలోమీటర్ల ఎత్తులోంచి ల్యాండవడానికి ముందు ఈ ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో శివన్ స్వయంగా ల్యాండర్ పై ప్రకటన చేశారు. ఆ సమయంలో ఆయన మొహంలో కనిపించిన ఆవేదన, ఆందోళన ఆయన గొంతులోంచి గద్గదంగా వినిపించింది.

ఓ జీవిత సాఫల్యాన్ని పూర్తిగా సాధించలేకపోయామనే ఆ బాధని దిగమింగుకున్న శివన్ ప్రధానిని తిరిగి పంపించే సమయంలో ఆపుకోలేకపోయారు. అందుకే ఆయన ఒక్కసారిగా బేలగా మారారు. బావురుమన్నారు. ఎన్నో స్పేస్ రిసెర్చ్ లలో పాల్గొన్న అనుభవం, అన్నింట్లోనూ సాధించిన సక్సెస్ చంద్రయాన్-2లోనూ ఆఖరు నిమిషం దాకా కక్ష్య తగ్గింపు వంటి అనేక విన్యాసాలను అలవోకగా చేయించిన శివన్ ఉద్వేగంగా మారారు.

ఓ శాస్త్రవేత్తగా, ఇస్రో చైర్మన్ గా ఇలాంటి అవకాశాలు చాలా అరదుగా వస్తుంటాయి. అందునా అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-2 ప్రయోగం ఓ సాహసం. ఇంతటి స్థాయికి రావడానికి శివన్ రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వ్యక్తిగత జీవితాన్ని, తన కలలను వదులుకుని, కుటుంబానికంటే కూడా తన పరిశోధనలకే ఎక్కువ టైం కేటాయించేవారు. అందుకే ఆయన అంత ఉద్వేగానికి గురయ్యారు. అది సరే శివన్ ని ఓదార్చడం ద్వారా ఎంతో పరిణతిని, ఔదార్యాన్ని ప్రదర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. సైన్స్ ప్రయోగాల్లో ప్రయత్నమే తప్ప ఓటమే ఉండదని, అధైర్య పడొద్దు నేనే కాదు. దేశం మొత్తం మీ వెంటే ఉందని అటు శివన్ ని ఓదార్చిన ప్రధాని, మొత్తం సైంటిస్టులకు వెన్ను తట్టి భరోసా ఇచ్చారు. దేశం మొత్తాన్ని ఇస్రోకి ఇరుసుగా మారే విధంగా మాట్లాడారు. దేశం మొత్తాన్ని ఇస్రో వెనుక నడిచేట్లుగా మార్చేశారు.

నిజానికి శివన్ కన్నీటి వెనుక కేవలం ఆయన ఒక్కడి ఆవేదనే లేదు. తన ప్రాజెక్టుపై నమ్మకం ఉంది. పనితీరులో బాధ్యత ఉంది. నిజాయితీ ఉంది. లక్ష్యాల సాధన పట్ల చిత్తశుద్ధి, నిబద్ధతా ఉంది. అన్నింటికంటే దేశంపై అపారమైన ప్రేమ ఉంది. అందుకే శివన్ అంతగా భావోద్వేగానికి గురయ్యారు. దాన్ని గుర్తించిన మోడీ శివన్ ని వెన్ను తట్టి ఓదార్చారు.

అందుకే ఇవ్వాళ ఇస్రో చైర్మన్ శివన్ ఇండియాకి ఓ ఐకాన్ గా మారారు. ఆ కన్నీళ్ళల్లోని బాధ్యతని, నిబద్ధతని ప్రధాని మాత్రమే కాదు, ప్రపంచమంతా గుర్తించింది. శివన్ మిమ్మల్ని చూసి మొత్తం భారత జాతే గర్విస్తున్నది. హ్యాట్సాఫ్!


లైవ్ టీవి


Share it
Top