తండ్రి లేని ఆడ పిల్లలకు చేయూత: సామూహిక వివాహాలు జరిపించిన మహేష్

తండ్రి లేని ఆడ పిల్లలకు చేయూత: సామూహిక వివాహాలు జరిపించిన మహేష్
x
Representational image
Highlights

ఏడు అడుగులు, మూడు ముళ్లతో రెండు జీవితాను ఒకటి చేసేదే పెళ్లి.

ఏడు అడుగులు, మూడు ముళ్లతో రెండు జీవితాను ఒకటి చేసేదే పెళ్లి. ఇటీవలి కాలంలో పెళ్లి అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న శుభకార్యం. అందులోనూ ఆడపిల్ల పెళ్లంటే చెప్పనక్కరలేదు. కట్నాలు, కానుకలు, లాంఛనాలు ఇవన్నీ ఇవ్వవలసి ఉంటుంది. ధన వంతుల కుటుంబాల్లోనైతే వారికి ఇది చాలా చిన్న విషయమే కానీ నిరుపేద యువతి కుటుంబ సభ్యులకు ఇది చాలా పెద్ద సమస్య. అందులోనూ తండ్రిలేని అమ్మాయిలకు ఈ కాలంలో పెళ్లి చేయడమంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఇలాంటి ఆడపిల్లల పెళ్లిలు చేయడానికే కొంత మంది దయాహృదయులు ముందుకొస్తుంటారు. పెళ్లి ఖర్చంతా వారే పెట్టుకుని ఆడపిల్లల పెళ్లిలు చేస్తుంటారు. ఇదే కోణంలో గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఆడపిల్లల పెళ్లిలు చేసారు. ఏంటి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే సతమతమవుతున్న ఈ రోజుల్లో వేల సంఖ్యలో ఆడపిల్లల పెళ్లి చేయడమంటే మాటలు కాదు మరీ..

ఇక పూర్తి వివరాల్లోకెళితే గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి మహేష్ సవానీ తండ్రిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమ్మాయిలకు పెళ్లి చేసే బాధ్యతను తన భుజాలను ఎత్తుకున్నారు. సూరత్‌లో నిర్వహించిన ఈ సామూహిక వివాహాల్లో జాతి, కులం, మతం అనే తేడా లేకుండా ముస్లిం అమ్మాయిల నుంచి నేపాల్ అమ్మాయిల వరకు ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వరుడిని వివాహం చేసుకున్నారు. ఇలా ఏకంగా ఒకే మండపంలో 271 మంది అమ్మాయిలకు పెళ్లి చేశారు.

మహేష్ గత ఎనిమిదేళ్లుగా ఇలా సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నారు. 2010లో మొదలుపెట్టిన ఈ పవిత్ర కార్యాన్ని ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సమయంలో 20 నుంచి 30 మంది అమ్మాయిలకు మాత్రమే ఈ వేదిక ద్వారా పెళ్లి చేసారు. ఇటీవల ఈ సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని తెలిపారు. మహేష్ ఇప్పటివరకు 3,172 మంది అమ్మాయిలకు పెళ్లి చేశారని తెలిపారు. అమ్మాయిలకు పెళ్లిల్లు చేస్తే దేవుడి ఆశీర్వాదం లభిస్తుందని, కన్యాదానం చేయడం దైవ కార్యమని మహేష్ గాఢంగా నమ్ముతారని తెలిపారు. సూరత్‌లో తండ్రి లేక సమస్యలు ఎదుర్కొంటున్న అమ్మాయిలు తమను సంప్రదించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత వారు కోరారని తెలిపారు. ఈ ప్రకటనకు ప్రజలు స్పందించడంతో ఏటేటా సామూహిక వివాహాల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories