వైద్య సిబ్బందిని తబ్లీగ్ లు వేధించడంపై యోగి సీరియస్..

వైద్య సిబ్బందిని తబ్లీగ్ లు వేధించడంపై యోగి సీరియస్..
x
Highlights

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు...

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిజాముద్దీన్‌ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిని ఆస్పత్రిలో ఉంచగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నర్సులు, లేడీ కానిస్టేబుళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో యూపీలో పలువురిపై కేసులు నమోదయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ ఆస్పత్రిలో నర్సింగ్‌ సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించిన తబ్లిగీ జమాతే సభ్యులపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు చేపట్టాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. నిందితులు చట్టాన్ని గౌరవించకపోవడమే కాకుండా సమాజ కట్టుబాట్లనూ అంగీకరించలేదని వారు మానవత్వానికే శత్రువులని వ్యాఖ్యానించారు.

ఐసోలేషన్‌ వార్డుల్లో చేరిన తబ్లిగి జమాతే సభ్యుల సేవల కోసం పురుష సిబ్బందిని నియమించాలని అక్కడ మహిళా కానిస్టేబుళ్లు, నర్సులకు విధులు కేటాయించరాదని యూపీ సర్కార్‌ ఆదేశించింది. కరోనా వైరస్‌ అనుమానితులుగా ఐసోలేషన్‌ వార్డుల్లో ఉన్న కొందరు తబ్లిగీ జమాతే సభ్యులు తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఘజియాబాద్‌ ఎంఎంజీ జిల్లా ఆస్పత్రి నర్సులు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో అర్ధనగ్నంగా తిరుగుతూ నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. సిగరెట్లు డిమాండ్‌ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు.

మరో పక్క కరోనా అనుమానితులను గుర్తించడానికి వెళ్లిన హెల్త్‌ వర్కర్స్‌, డాక్టర్ల బృందంపై కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కర్రలు, రాళ్లు పట్టుకుని వచ్చి, ఇరుకుగా ఉన్న వీధిలో హెల్త్ వర్కర్ల వెంట పడ్డారు. ఇండోర్ పరిధిలోని రాణీపురా ప్రాంతంలోని కొందరు న్యూఢిల్లీలోని ప్రార్థనలకు వెళ్లి వచ్చారని తెలుసుకున్న అధికారులు, ఆ ప్రాంతానికి వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది. డాక్టర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.


ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు హాజరైన వారిలో సుమారు 9వేల మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకుగా తబ్లిగీ సమావేశాల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరిగాయని హోంశాఖ జాయింట్‌ సెక్రెటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ చెప్పారు. తబ్లిగీ సమావేశాలకు హాజరైన 9వేల మందిని, వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామన్నారు. నిజాముద్దీన్‌ ప్రాంతాన్ని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సిబ్బంది పరిశీలించారు. విదేశీయులు భారత్‌లో ఎక్కడున్నా ఫారినర్స్‌ యాక్ట్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర పోలీసు శాఖలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories