విక్రమ్ పై ఆశలు ఆవిరి..ఎంత ప్రయత్నించినా లేని ఫలితం

విక్రమ్ పై ఆశలు ఆవిరి..ఎంత ప్రయత్నించినా లేని ఫలితం
x
Highlights

చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ అచేతనంగా పడివుంది. ఇస్రోతో అనుసంధానం పునరుద్ధరించుకునే అవకాశాలు అంతకంతకూ ఆవిరవుతున్నాయి. సిగ్నల్స్‌ అందకపోవడం,...

చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ అచేతనంగా పడివుంది. ఇస్రోతో అనుసంధానం పునరుద్ధరించుకునే అవకాశాలు అంతకంతకూ ఆవిరవుతున్నాయి. సిగ్నల్స్‌ అందకపోవడం, బ్యాటరీ చార్జ్‌ తగ్గిపోవడంతో శీతల పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయడంలేదు. చివరికి శాస్త్రవేత్తలు నాసా సహాయం తీసుకున్నా ఫలితం శూన్యంగా ఉంది.

మరో 2-3 రోజుల్లో చంద్రుడిపై రాత్రి ప్రారంభం కానుంది. 14 రోజుల పాటు అక్కడ రాత్రి కొనసాగుతుంది. ఆ సమయంలో చందమామ దక్షిణ ధృవంపై ఉష్ణోగ్రతలు మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోతాయి. విక్రమ్‌లోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు అలాంటి శీతల పరిస్థితుల్లో పనిచేయలేవు. ల్యాండర్‌ లోపలే ఉన్న ప్రజ్ఞాన్‌ రోవర్‌ వ్యవస్థలు కూడా పూర్తిగా స్తంభిస్తాయి. ఇలాంటప్పుడు విక్రమ్‌తో అనుసంధానమవ్వడం అసాధ్యం.

చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా చందమామ దక్షిణ ధృవంపై దిగిన విక్రమ్ ల్యాండర్ ఎంతకీ స్పందించట్లేదు. చివరకు నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ల్యాండర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్‌ రాలేదు. ఇప్పటికే ల్యాండర్ దిగి దాదాపు వారం అవ్వడంతో దానిపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నట్లే కనిపిస్తోంది. గంటలు గడిచే కొద్దీ ల్యాండర్ నుంచీ సిగ్నల్స్ రాబట్టే ప్రక్రియ మరింత కష్టం అవుతూ ఉంటుంది. ఇందుకు కారణం ల్యాండర్‌లో ఉన్న బ్యాటరీల పవర్ అంతకంతకూ తగ్గిపోతూ ఉండటమే.

విక్రమ్ ల్యాండర్‌కి అమర్చిన బ్యాటరీల్లో పవర్ కూడా అంతకంతకూ తగ్గిపోతూ ఉంటుంది. తిరిగి వాటిని రీఛార్జ్ చెయ్యాలంటే, అందుకు సోలార్ పవర్ అవసరం. సోలార్ పవర్‌ను విక్రమ్ ల్యాండర్ ఉపయోగించుకోవాలంటే దానికి ఇస్రో శాస్త్రవేత్తలు పంపుతున్న సిగ్నల్స్ అందాలి. ఆ సిగ్నల్స్‌కి అంది స్పందించాలి. అప్పుడు మాత్రమే సోలార్ పవర్ వాడుకునేందుకు వీలవుతుంది. కానీ సిగ్నల్స్ అందుకోకపోవడంతో ఆశలు ఆవిరవుతున్నాయి. ఇస్రోలో ఉన్న టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ టీమ్ ప్రతీ నిమిషం ల్యాండర్‌ నుంచీ సిగ్నల్స్ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించట్లేదు.

చంద్రునిపై గాలి ఉండదు కాబట్టి, అక్కడ ఏ వస్తువు దిగినా అది అలాగే ఉంటుంది. దాని సోలార్ ప్యానెళ్లు, కెమెరాలు, అన్నీ ఎలా దిగితే అలాగే ఉంటాయి. ఏమాత్రం కదలవు. విక్రమ్ ల్యాండర్ పరిస్థితీ అంతే. సిగ్నల్స్ అందుకోవట్లేదు కాబట్టి వారం కిందట అది దిగినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. విక్రమ్ ల్యాండర్‌తో ఎలాగైనా పని చేయించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇస్రో శాస్త్రవేత్తలకు, దేశ ప్రజలకూ ఇది విచారకర విషయమే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories