పాక్‌ చెరలో ఉన్న భారత యువకులపై కేంద్ర హోంశాఖ ఆరా

పాక్‌ చెరలో ఉన్న భారత యువకులపై కేంద్ర హోంశాఖ ఆరా
x
Highlights

పాకిస్తాన్ అదుపులో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ను తిరిగి భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాస్ పోర్ట్‌, వీసా లేకుండా కొలిస్తాన్‌‌లోకి...

పాకిస్తాన్ అదుపులో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్‌ను తిరిగి భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాస్ పోర్ట్‌, వీసా లేకుండా కొలిస్తాన్‌‌లోకి ప్రవేశించారంటూ ప్రశాంత్‌ను పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రశాంత్‌తోపాటు మధ్యప్రదేశ్ వాసి వారిలాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. ప్రశాంత్‌పై పాక్ చట్టం 334/4 కింద అభియోగాలు నమోదు చేశారు. అలాగే, విశాఖ గాజువాకలో ప్రశాంత్ అదృశ్యమైనట్లు పాకిస్తాన్ తన ఎఫ్‌ఐఆర్‌తో పేర్కొంది.

పాకిస్తాన్ మీడియా ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేసింది. తెలుగులో మాట్లాడిన ప్రశాంత్‌ తాను బాగానే ఉన్నానని, త్వరలోనే విడుదల అవుతానంటూ చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ ఇంటర్వ్యూను పాక్ మీడియా ట్విట్టర్‌లో పెట్టింది. అయితే, అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటోన్న పాక్ మీడియా అధునాతన పద్ధతిలో ఉగ్రదాడి చేయడానికి పాక్‌‌లోకి పంపారేమోనన్న అనుమానాలను వ్యక్తంచేసింది.

పాకిస్తాన్‌లో పట్టుబడ్డ ప్రశాంత్ గురించి కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ప్రశాంత్ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ప్రశాంత్‌తోపాటు పట్టుబడిన యువకుల వివరాలు అందజేయాలని విదేశీ వ్యవహారాలశా‌‌ఖ ద్వారా పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. దాంతో, పాకిస్తాన్ నుంచి వచ్చే సమాధానం తర్వాత తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.

అయితే, ప్రశాంత్ అసలు పాకిస్తాన్ సరిహద్దులకు ఎందుకు వెళ్లాడో తెలియదంటున్నారు ఆయన తండ్రి బాబూరావు. బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు స్వప్నికతో ప్రేమలో పడ్డాడని, ఆమె కోసం కుటుంబంతో విభేదించి వెళ్లిపోయాడని అన్నారు. అయితే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి మాత్రం కాదన్నారు. ప్రశాంత్ రెండేళ్ల నుంచి కనిపించడం లేదంటోన్న బాబూరావు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని తెలిపారు. గతంలో చైనా, ఆఫ్రికా దేశాలకు వెళ్లొచ్చాడని వెల్లడించారు.

పాకిస్తాన్ చెరలో ఉన్న ప్రశాంత్ 2017లో అదృశ్యమైనట్లు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు సైబరాబాద్ సీసీ సజ్జనార్ తెలిపారు. ప్రశాంత్ సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగం చేసేవాడని వివరించారు. అయితే, ప్రశాంత్ ప్రస్తుతం పాక్ అదుపులో ఉండటంతో ఇండియన్ ఎంబసీకి ఎప్పటికప్పుడు వివరాలు అందజేస్తున్నట్లు సైబరాబాద్ సీసీ సజ్జనార్ తెలిపారు.

అయితే, ప్రశాంత్ ఎందుకు సరిహద్దులు దాటి వెళ్లాడు? నిజంగానే పాస్‌పోర్ట్, వీసా లేకుండా పాక్‌లో ప్రవేశించాడా? లేక పాస్‌పోర్ట్, వీసాను పాకిస్తాన్ బలగాలు స్వాధీనం చేసుకుని లేవని చెబుతున్నాయా? ప్రశాంత్ ఇష్యూ భారత్‌-పాక్ మధ్య మరో దౌత్య వివాదంగా మారబోతోందా? ప్రశాంత్, వారిలాల్‌ అరెస్టుపై భారత్ ఏవిధంగా స్పందిస్తుంది? పాక్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతోందో చూడాలి.

రాజస్థాన్ థార్ ఎడారిలో ప్రచండ గాలుల కారణంగా ఇసుక తిన్నెలు ఒక చోట నుంచి మరో చోటికి వెళ్తుంటాయని, దాంతో భారత్-పాక్ సరిహద్దులోని కంచె కొన్నిసార్లు కనిపించదని భారత వర్గాలు చెబుతున్నాయి. అలా, ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్న సమయంలో అనేకసార్లు పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. ప్రశాంత్, వారిలాల్ కూడా అలాగే, పొరపాటున పాక్‌లోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories