అయోధ్య తీర్పుపై శాంతిమంత్రం

అయోధ్య తీర్పుపై శాంతిమంత్రం
x
Highlights

అత్యంత సున్నితమైన అంశం కావడంతో.. అయోధ్య విషయంలో అంతా శాంతిమంత్రం జపిస్తున్నారు. సుప్రీంతీర్పును అందరూ స్వాగతించాలని.. ఒకరు గెలిచినట్లు.. మరొకరు...

అత్యంత సున్నితమైన అంశం కావడంతో.. అయోధ్య విషయంలో అంతా శాంతిమంత్రం జపిస్తున్నారు. సుప్రీంతీర్పును అందరూ స్వాగతించాలని.. ఒకరు గెలిచినట్లు.. మరొకరు ఓడినట్లు పరిగణించకూడదంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అహింసా పునాదులపై స్వాతంత్య్రాన్ని సాధించుకున్న మనం.. అదే బాటలో నడవాలని సూచిస్తున్నారు. ఇటు తీర్పు ఎలా వచ్చినా.. స్వాగతిద్దామంటూ మతపెద్దలు కూడా పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్న అయోధ్య తీర్పు కాసేపట్లో వెలువడనుంది. దీంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ విధించారు. సున్నితమైన ప్రదేశాల్లో నిషేదాజ్ఞలు అమలుచేస్తున్నారు. అయితే ఈ సమయంలో మనమంతా సంయమనం పాటించాలని.. ప్రధాని మోడీ తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్న ప్రధాని మోడీ.. అయోధ్య అంశంలో సుప్రీం తీర్పు.. ఒకరికి విజయం, మరొకరికి అపజయం కాదన్నారు. ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలంతా శాంతి, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నానని.. న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయని చెప్పారు. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయని గుర్తు చేసిన మోడీ.. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్‌ దేశం అంతా కలసిమెలసి నిలబడదామని పిలుపునిచ్చారు.

అయోధ్య తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఇవాళ భేటీ కానుంది. ఉదయం టెన్‌ జనపథ్‌లో ఈ సమావేశం జరగనుందని పార్టీ ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్‌ కీలక నేతలు సహా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉండగా.. తీర్పుపై కాంగ్రెస్‌ వైఖరి నిర్ణయించుకునేందుకే ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అయోధ్య తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో.. శివసేన కూడా స్పందించింది. సుప్రీం ఎలాంటి తీర్పు వెలువరించినా.. అందరూ స్వాగతించాలని సూచించారు. గతంలో రామాలయం కోసం చట్టం తేవాలని తాము కేంద్రాన్ని కోరినట్లు గుర్తు చేసింది.

ఇక ఇదే అంశంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. తీర్పు నేపథ్యంలో ద్వేషం, అసూయ భావనలు కల్పించొద్దని కోరారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారని వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories