logo

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుకు కేంద్రం కసరత్తు

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుకు కేంద్రం కసరత్తు
Highlights

దక్షిణాన పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు...

దక్షిణాన పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకాలం ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి అభ్యర్థించినా పట్టించుకోని కేంద్రం అన్నీ కుదిరితే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే శాసనసభ స్థానాల బిల్లును గట్టెక్కించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

తెలుగురాష్ట్రాల్లో శాసనసభా స్థానాల పెంపు కోసం కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి కేబినేట్‌ నోట్‌ను ఈసీకి పంపించింది. అయితే కేంద్రం పంపిన నోట్‌ సరిగ్గా లేదంటూ ఎలక్షన్‌ కమిషన్ సవరణలు కోరింది. సరైన సమాచారంతో మరోసారి పంపాలని సూచించింది. దీంతో సీట్ల పెంపు అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో చాలాసార్లు కేంద్రాన్ని కోరాయి. అయితే ఇన్నాళ్లకు దీనిపై కేంద్రం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈసీకి పంపిన నోట్‌లో తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు, ఏపీలో 175 నుంచి 225 స్థానాలకు పెంచాలని కోరింది. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్రం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభన బిల్లును గట్టేంచిందేకు ఓ కమిషన్ కూడ ఏర్పాటు చేయబోతోంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వంపై గురిపెట్టిన కమలం పార్టీ శాసనసభా స్థానాలు పెంచి వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పాగా వేయాలని భావిస్తోంది. రాజకీయంగా బలపడేందుకు సీట్ల పెంపు కూడా దోహదం చేస్తుందనే ఆలోచనలో ఉన్న అధికార పార్టీ ఇటు కశ్మీర్ లో కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. వచ్చే ఆరు నెలల్లో కశ్మీర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా శాసనసభ సీట్ల పెంపుతో లబ్ది పొందాలనుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే అసెంబ్లీ స్థానాల పెంపునకు సబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


లైవ్ టీవి


Share it
Top