కర్ణాటకలో ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాలు

కర్ణాటకలో ఉత్కంఠ రేపుతున్న రాజకీయ పరిణామాలు
x
Highlights

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు జెడీఎస్, కాంగ్రెస్ రెడీ అవుతోంది. అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి...

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు జెడీఎస్, కాంగ్రెస్ రెడీ అవుతోంది. అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. సీఎం కుమారస్వామి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓ వైపు కొనసాగుతున్న బుజ్జగింపు ప్రయత్నాలు.. మరోవైపు బీజేపీ వైపు వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో కాంగ్రెస్ -జేడీఎస్ నేతల మధ్య కీలక భేటీ జరిగింది. కుమారకృప అతిథి గృహంలో జరిగిన ఈ భేటీకి జేడీఎస్ నుంచి సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం సిద్ధ రామయ్యతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రస్తుత పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదురైతే ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చలు జరిపారు.

మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు కొనసాగుతున్నాయి. తొలుత దారికొచ్చినట్లే కనిపించిన ఎమ్మెల్యే ఎంబీటీ నాగరాజు యూటర్న్ తీసుకుని అసంతృప్త ఎమ్మెల్యేల శిబిరంలో చేరేందుకు వెళ్లడంతో వారి ప్రయత్నాలు మళ్లీ మొదటి కొచ్చాయి. బీజేపీ సైతం ఎప్పటికప్పుడు పరిణామాలపై దీటుగా స్పందిస్తోంది. 15 మంది కాంగ్రెస్ -జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పటికీ కుమారస్వామి ఏమాత్రం అర్హుడు కాదని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుజ్జగించి ఎమ్మెల్యేలను దారితెచ్చుకోవడంతో పాటు విశ్వాస పరీక్షను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ -జేడీఎస్ నేతలు సిద్ధమవుతున్నారు.

అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అన్నిరకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది. వారం రోజులుగా బుజ్జగింపుల పర్వం సాగిస్తున్న ఆ పార్టీ.. తేడా వస్తే, వేటు వేసేందుకైనా సిద్ధమేనంటూ స్వరం పెంచింది. సీఎం కుమార స్వామి బలపరీక్షకు సిద్ధమైన నేపథ్యంలో కాంగ్రెస్ పక్షాన అన్నీ తానై రెబల్స్ తో సంప్రదింపులు నడుపుతున్న ట్రబుల్ షూటర్ శివకుమార్ స్పీడు పెంచారు. తమ ఎమ్మెల్యేలందరి మీద నమ్మకం ఉందని.. వారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారని చెప్పారు. కర్ణాటకలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండు చేస్తున్నారు. కుమారస్వామికి ప్రజాస్వామ్యం పట్ల విధేయత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే విశ్వాస పరీక్షకు సిద్ధం కావాలన్నారు మాజీ సీఎం యడ్యూరప్ప. కాంగ్రెస్ , జేడీఎస్ కూటమిలోని 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, ఇద్దరు స్వతంత్రులు కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories