తెలుగు సినిమాని యువతరం కుమ్మేస్తోంది!

తెలుగు సినిమాని యువతరం కుమ్మేస్తోంది!
x
Highlights

తెలుగు తెరకు వెలుగొచ్చింది. తెలుగు సినిమా పండగ చేసుకుంటోంది. తెలుగు చలన చిత్ర చక్రాన్ని యువతరం నవ్య బాట పట్టించింది. డబ్బు పోసి కాసుల గలగల కావాలని ...

తెలుగు తెరకు వెలుగొచ్చింది. తెలుగు సినిమా పండగ చేసుకుంటోంది. తెలుగు చలన చిత్ర చక్రాన్ని యువతరం నవ్య బాట పట్టించింది. డబ్బు పోసి కాసుల గలగల కావాలని ప్రేక్షకుల కోసం చూడటం కాదు.. నవ్యతను తెర నిండా నింపి.. ఆ వెన్నెల చూడాలని ప్రేక్షకులు బారులు తీరేలా చేయడమే ఇపుడు చూస్తున్నాం. బాకాలూది.. గోడలకు బొమ్మలెక్కించి.. మా సినిమా చూడండహో అంటూ విజయ యాత్రలు చేసి ఆపసోపాలు పడిపోయే రోజులను మార్చేస్తోందీ తరం. అవును.. తెలుగు సినిమా నవ్యత బాట పట్టింది.

ఒక పక్క వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి భయపడి పెద్ద హీరోల సినిమాలే వాయిదా వేసుకున్న పరిస్థితుల్లో తెలుగు ఇండస్ట్రీని ఆడుకుంటోంది చిన్న సినిమాలుగా చెప్పుకునే సినిమాలే. అవును ఇది నిజం. ప్రతీ వారం ఒక్కో సినిమా.. ఒక్కో బాణీలో.. థియేటర్ల లో సందడి చేస్తోంది.

రియలిస్టిక్ జీవన గాథ నాది అంటూ మల్లేశం చేసిన సందడి గుర్తించే లోపే ..అసలు చిన్న సినిమాకి హిట్టెందుకు రాదో పరిశోధిస్తానంటూ అదే రోజు (జూన్ 21) వచ్చేశాడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. భూతద్దాలు పట్టుకుని సినిమాని ముక్కలు ముక్కలుగా రివ్యూ చేసేయాలని చూసే విమర్శకులు అబ్బా.. అనుకునేలా రెండు సినిమాలూ ప్రేక్షకులకు మంచి విందు భోజనం అందించాయి. ఆ రెండిటి ఘుమ ఘుమలు పూర్తిగా పోకముందే నేను కల్కిని అంటూ హీరో రాజశేఖర్ గొడ్డలి పట్టుకు వచ్చినా.. విషయం ఉందనిపించాడు. నువ్వుండగా నన్ను బ్రోచేవారెవరురా అంటూ వచ్చిన శ్రీ విష్ణు అదే రోజు(జూన్ 28) బెదురుగా వచ్చినా.. చిన్న సినిమాల కంటెంట్ బావుంటే తెలుగు ప్రేక్షకులు బ్రోచుతారని నిరూపించారు.

ఇక జూలై వచ్చిందో లేదో పడుచు ముసలిదానిని నేనంటూ చాదస్తాన్ని తెచ్చినా ఓహ్..బేబీ నువ్వు చాలా స్వీటు అంటూ బ్రహ్మరధం పడుతున్నారు ప్రేక్షకులు.

ఇంతకీ ఈ సినిమాలన్నీ ఎందుకు అంత పెద్ద హిట్ లుగా నిలిచాయో విశ్లేషించే పనిలో పడ్డారు విమర్శకులు.

దీనికి పెద్ద విశ్లేషణతో పనిలేదు. పైన చెప్పిన సినిమాలు ఐదూ ఐదు రకాల జోనర్లు. ఒకదానికి ఒకటి కథ.. కథనం..దేనిలోనూ పొంతన లేదు. ఉన్నదల్లా ఒక్కటే యువ ఆత్మ. అవును. యువతరం ఆలోచనల్లో వస్తున్న మార్పునకు తాజా సంకేతాలీ సినిమాలు. మూస పద్ధతిలో.. హీరో, విలనూ, హీరోయినూ ఇలా కాకుండా.. అయితే చిక్కని కథ (మల్లేశం).. లేకపోతే చక్కని కథనం (బ్రోచేవారెవరురా, ఏజెంట్ ఆత్రేయ).. అంతే కాదు మానవీయ కోణానికి నవ్వుల పువ్వులద్ది.. వాటితోనే పుట్టెడు భావోద్వేగాలతో ప్రేక్షకుడిని ఇంటికి పంపేలా చేసిన మాయ(ఓహ్..బేబీ) వీటి మధ్యలో కొద్దిగా యాక్షన్..ఉండకపోతే ఎలా అన్నట్టుగా వచ్చిన పాత చింతకాయ కథకి యువ రంగులద్దిన కల్కి వేటికవే ప్రత్యేకతను సాధించాయి. ఈ ఐదు సినిమాలూ ఇపుడు తెలుగు సినిమా పరిశ్రమకి చుక్కానిలా నిలబడ్డాయంటే అతిశయోక్తి కాదు.

పెద్ద సినిమాలు వసూళ్లు సాధించినా.. వాటి ఖర్చులు లెక్కేస్తే ఎక్కడిక్కడే సరిపోతుంది. కానీ, చిన్న సినిమాలు హిట్ అయితే.. అలా ఇలా ఉండదు. ఒక పక్క కాసులు వస్తాయన్నది ఎంత నిజమో.. మరోపక్క మరిన్ని సినిమాలు నిర్మించాలనే ఆసక్తి ఒత్సాహికులకు కలుగుతుంది. దాంతో పరిశ్రమలో ఉన్న వారందరికీ ఎవరికీ తగ్గ పని వారికి దొరుకుతుంది. ఇదే ఈ సినిమాలు తెచ్చే అసలు కిక్కు. పరిశ్రమ మూడు పూవులు.. ఆరు కాయల్లా ఉండాలంటే ఇటువంటి సినిమాలు వరుసగా రావాలి.

ఇక్కడ ఇంకో విషయం.. ఇక్కడ చెప్పుకున్న సినిమాలతో పాటూ, మరిన్ని సినిమాలు విడుదల అయ్యాయి. కానీ, అవి బోర్లా పడ్డాయి. (బుర్రకథ, ఓటర్, స్పెషల్,ఫస్ట్ ర్యాంక్ రాజు, విశ్వామిత్ర ఇలా చాలా వచ్చాయి) వాటిలో కొన్ని మంచివీ ఉండొచ్చు. కానీ, బాక్సాఫీసు వద్ద నిలబడలేదు. తీసిన సినిమాలు అన్నీ విజయవంతం కావాలని లేదు. కానీ, సినిమాలో వైవిధ్యాన్ని చూపించాలనే తాపత్రయమే ఇక్కడ ముఖ్యం. ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ద సినిమా ఒక్కటీ లేదు(మహర్షి తరువాత) ఈ సంధి కాలంలో చిన్న సినిమాలే పరిశ్రమను ఆడుకున్నాయి. థియేటర్లు క్రికెట్ దెబ్బను తట్టుకుని మెరుస్తున్నాయంటే కారణం ఇవే.

ఇదంతా యువతరం ప్రతిభ. వారి కష్టం. ఇక్కడ దర్శకుడు.. నిర్మాత.. హీరో ఇలా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ సినిమాలన్నిటి వెనుక.. ముందు.. యువతరమే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రేపటి తెలుగు సినిమా ఎలా ఉండబోతోందో ఈ సినిమాలు చెప్పాయి. నవ్యత కోసం అందరూ పోటీ పడేలా మార్పును తేస్తాయనడంలో సందేహం లేదు.

యువతరానికి జేజేలు! మరిన్ని మంచి సినిమాలు వీరి నుంచి తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories