కొత్త పుంతల్లో తెలుగు సినిమా

కొత్త పుంతల్లో తెలుగు సినిమా
x
Highlights

తెలుగు సినిమా దారి మారుతోంది. మూసకథలు పక్కకి తప్పుకుంటున్నాయి. నవ్యత కోసం నటులు పట్టుపడుతున్నారు. నవతరం దర్శకులు వారికి సై అంటున్నారు. ఒక హీరో.. ఒక...

తెలుగు సినిమా దారి మారుతోంది. మూసకథలు పక్కకి తప్పుకుంటున్నాయి. నవ్యత కోసం నటులు పట్టుపడుతున్నారు. నవతరం దర్శకులు వారికి సై అంటున్నారు. ఒక హీరో.. ఒక హీరోయిన్.. మధ్యలో విలన్.. కథలకు కొత్త హంగులు వచ్చి చేరుతున్నాయి. మానవ సంబంధాల మధ్య భావోద్వేగాలకు వెండితెర వెలుగులద్దుతున్నారు. జీవిత ప్రయాణంలో ఒడిదుడుకుల పాఠాలను సెల్యులాయిడ్ కు సక్సెస్ ఫార్ములాగా మారుస్తున్నారు. ఎదో తీసాం అని కాకుండా.. జనం మెచ్చి తీరాలనే తపన దర్శకులకు ఎక్కువైంది.

నిజానికి కథలు అన్నీ ఒకేరకంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా కథలు. ప్రారంభం.. ఇంటర్వెల్.. ముగింపు.. ఈ మూడింటి మధ్య దాదాపు మూడు గంటల వంటకమే సినిమా. అనగనగా కథలు.. ఆమ్మో అనిపించే కథలు.. హాయినిచ్చే కథలు.. ఇలా వర్గీకరించుకుని సినిమా కోసం కథని తయారు చేసుకుంటారు. అంటే దర్శకుడు తాన్ నిర్మాత లేదా హీరో ఏ తరహా కథలు కావాలనుకుంటాడో దానినే వండి వార్చడానికి సిద్ధమవుతాడు. దశాబ్దాలుగా ఇదే తెలుగు సినిమా ట్రెండ్. ఇపుడు కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. కాకపోతే తను అనుకున్న హీరో కోసం కథ రాసుకుని.. దానిని పట్టాలెక్కించడానికి నిర్మాత, హీరోల సూచనలతో మార్పులు చేసుకుని రంగంలోకి దిగుతున్నారంతే. ఇక్కడే నవ దర్శకులు జాగ్రత్త పడుతున్నారు. తామనుకున్న కథను ఎంత బలంగా చెబుతున్నారో అంతే బలంగా హీరోలను ఒప్పించే ప్రయత్నమూ చేస్తున్నారు. అందుకే తెలుగు సినిమా దారి మారుతోంది.

ఈ వేసవికి వరుసగా సినిమాలు సందడి చేశాయి. చేస్తున్నాయి. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అయితే ఇప్పటికే వచ్చిన అన్ని సినిమాలు జనాంతికంగా నిలవడమే విశేషం. వేసవి బరిలో ముందుగా దిగిన నాగ చైతన్య మజిలీ.. తరువాత నేనున్నానన్న సాయిధర్మ తేజ్ చిత్రలహరి.. నా ప్రయాణమూ ఉందని వచ్సిన నానీ జెర్సీ .. ఈ మధ్యనే పలకరించిన మహేష్ మహర్షి ఇవన్నీ హిట్ పట్టాల మీద నిలిచాయి. అయితే ఈ పట్టాలను కలిపిన సున్నిత దారం మాత్రం ఒకటే కావడం విశేషం. విజయం అనే ఒకే ఒక్క అంశం చుట్టూ అల్లుకున్న కథనాలివి.

ఒక్కో మనిషి ఒక్కోరకంగా విజయాన్ని చూస్తాడు. విజయం అనే దానికి అర్థం మనిషి మనిషికి మారిపోతుంది. సరిగ్గా నాలుగు సినిమాలు అదే అంశం చుట్టూ అల్లుకున్నా.. నాలుగు సినిమాల్లోనూ నాలుగు కోణాల్లో విజయం అనే పదాన్ని నిర్వచించారు. వేటికవే చక్కగా రూపుదిద్దుకోవడం విశేషం. మజిలీ ప్రేమలో విజయం దక్కలేదని అన్నీ వదిలేసిన యువకుని జీవితానికి దర్పణం.. చిత్రలహరి ఓటమి తప్ప జీవితంలో గెలుపు సాధించలేని ఓ యువకుని గెలుపు పోరాటం.. ఇక నానీ విజయ ప్రయాణం జీవితపు పునాదుల మీద సాగించాడు. తాజాగా మహర్షి విజయానికి కామాలే కానీ ఫుల్ స్టాప్ లు ఉండవంటూ వెండి తెర మీద హంగామా చేస్తున్నాడు. ఇలా ఒక్క అంశం చుట్టూ అల్లుకున్న కథలు ఓకే సమయంలో విడుదల కావడం.. అన్నిటినీ ప్రేక్షకులు ఆమోదించటం.. తెలుగు తెరమీద అరుదైన దృశ్యం. ఇంకో సారూప్యత ఏమిటంటే.. ఈ నాలుగు సినిమాల్లోనూ భావోద్వేగాలకు పెద్ద పీట వేయడం. ప్రతి సినిమా భావోద్వేగాల్ని సున్నితంగా ఆవిష్కరించడంలో విజయం సాధించాయి.

దర్శకుల నవ్యమైన ఆలోచనలకూ, కథానాయకుల కొత్త దనపు పరుగులకు ఈ సినిమాలు అడ్డం పట్టాయి. ఇక ప్రేక్షకులు కూడా వీటిని ఆదరించడం ఓ శుభసూచకం. ప్రస్తుతం ఉన్న హీరోల్లో సీనియర్ మహేష్.. తర్వాతి తరం నటులు నాని, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ ఈ పోకడతో నడవడం తెలుగు సినిమాకు కొత్త బాట వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. హిందీలో వచ్చిన త్రీ ఇడియట్స్ ను చూసి మురిసిపోయాం. మనకూ అలాటి సినిమా వస్తే బావుందనుకున్నాం. వచ్చాయి. ఒకటి కాదు నాలుగు.. ఈ సినిమాలు తెలుగు చిత్ర సీమకు మరో దారి చూపుతాయని ఆశించడంలో అత్యాశేమీ కాబోదు.

Show Full Article
Print Article
Next Story
More Stories