యురేనియంపై యుద్ధం కోసం చేయి కలిపిన ఫిలిం ఇండస్ట్రీ..

యురేనియంపై యుద్ధం కోసం చేయి కలిపిన ఫిలిం ఇండస్ట్రీ..
x
Highlights

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. యురేనియం తవ్వకాలు చేపట్టవద్దంటూ నిరసన గళాలు వినిపిస్తున్న వారి సంఖ్య రోజు...

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. యురేనియం తవ్వకాలు చేపట్టవద్దంటూ నిరసన గళాలు వినిపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ ఉంది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, సిని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు గళమెత్తుతున్నారు. సేవ్‌ నల్లమల పేరిట వివిధ మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వన విధ్వంసమే జీవన విధ్వంసమని నల్లమలని రక్షించుకుందామని పిలుపునిస్తున్నారు. యురేనియం తవ్వకాలు వద్దంటూ సాగుతున్న ఉద్యమానికి మద్దతునిస్తున్నారు.

ప్రముఖ హీరోయిన్ సమంత, ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఉద్యమానికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. విజయ్ దేవరకొండ కూడా ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. యురేనియం కొనుక్కోవచ్చు గానీ అడవులను కొనుక్కోలేం కదా అంటూ ట్వీట్‌ చేశాడు. తాజాగా మరో ఇద్దరు హీరోలు ఈ ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించారు. యాక్షన్‌ హీరోలైన అర్జున్‌, గోపీచంద్‌లు యురేనియం ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. చెట్లు బాగుంటే మనం బాగుంటామని వాటిని నాశనం చేస్తే మన జీవితాలను మనమే నాశనం చేసుకున్నట్లని గోపీచంద్ అన్నారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై కేటీఆర్‌ స్పందించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళతానని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ తనకెంతో ధైర్యాన్ని అందించిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనలు, సహకారంతో కేంద్ర ప్రభుత్వంపై మరో ఉద్యమాన్ని మొదలు పెడతామని బాలరాజు అన్నారు. యురేనియం తవ్వకాలకు బీజం వేసిన కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలే దీనికి సమాధానం చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ కూడా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకిస్తున్నారు. ఆమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బ తింటుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమల పరిరక్షణ కోసం జనసేన మద్దతు కొనసాగుతుందని ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ముప్పు తప్పదని పవన్ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాలపై త్వరలోనే ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి పవన్‌ కళ్యాన్‌ ఫోన్‌ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రౌండ్‌ టేబుల్ సమావేశానికి రావలసిందిగా రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం పలికారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories