రీల్ లైఫ్ లో విజేతలు.. రియల్ లైఫ్ లో మాత్రం..!

రీల్ లైఫ్ లో విజేతలు.. రియల్ లైఫ్ లో మాత్రం..!
x
Highlights

సిల్క్ స్మిత, దివ్య భారతి, ఉదయ్ కిరణ్...ఇప్పుడు సుశాంత్... అద్భుతమైన నటనతో వెండి తెరపై మెరిశారు. కానీ నిజ జీవితాన్ని మాత్రం మధ్యలోనే ముగించారు. డబ్బు,...

సిల్క్ స్మిత, దివ్య భారతి, ఉదయ్ కిరణ్...ఇప్పుడు సుశాంత్... అద్భుతమైన నటనతో వెండి తెరపై మెరిశారు. కానీ నిజ జీవితాన్ని మాత్రం మధ్యలోనే ముగించారు. డబ్బు, హోదా, స్టార్ డమ్ ఉన్నా...మానసిక వేదనకు గురై తనువు చాలించారు.

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలు..ఇలా అర్థాంతరంగా జీవితాలను ముగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఉన్నా...మానసిక సమస్యలతో కుంగిపోయి తానువు చాలిస్తున్నారు. ఒక్కప్పుడు లవర్‌బాయ్‌గా యువతను ఆకట్టుకున్న కథానాయకుడు ఉదయ్‌ కిరణ్‌. కెరీర్‌ పరంగా సక్సెస్‌ లేకపోవడం.. ఆర్థిక సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి..దీంతో 2014 జనవరి 5న తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం అందర్నీ బాధించింది.

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య దేశంలో పెను సంచలనం సృష్టించింది. 2016 ఏప్రిల్‌ 1న ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇక ప్రేమికుల రోజు చిత్రంతో కథానాయకుడిగా అరంగేట్రం చేసి, పాపులారిటీ సంపాదించుకున్నారు కునాల్‌ సింగ్‌. ఆయన ఛార్మింగ్‌ లుక్స్, హెయిర్‌ స్టైల్‌ అప్పట్లో యువతను ఆకర్షించాయి. ఆపై పలు సినిమాల్లో నటించిన ఆయన.. 2008 ఫిబ్రవరి 7న ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని...33 ఏళ్ల వయసులోనే ప్రాణాలు తీసుకున్నారు.

బాలీవుడ్‌లో నటిగా, గాయనిగా గుర్తింపు పొందిన జియాఖాన్ జీవితం కూడా అర్థాంతరంగా ముగిసిపోయింది. గజిని, నిశ్శబ్ద్‌, హౌస్‌ఫుల్‌ సినిమాల్లో అద్భుతంగా నటించి అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో 2013 జూన్‌ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు ఆరు పేజీల సూసైడ్ నోట్‌ ఆధారంగా కేసు ఇప్పటికీ కొనసాగుతోంది..

ప్రత్యూషది కూడా ఇదే ట్రాజడీ స్టోరీ... రాయుడు సినిమాతో 1998లో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు ప్రత్యూష. ఆ తరువాత శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని తదితర సినిమాలతో గుర్తింపు పొందారు. ప్రత్యూష ఊహించని పరిస్థితుల మధ్య 2002 ఫిబ్రవరి 23న మరణించారు

తెలుగులో బొబ్బిలి రాజా సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన దివ్య భారతి అనుమానాస్పద స్థితి మృతి కూడా అప్పట్లో అందర్నీ తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ సినిమాలతో అలరించారామె. 1992లో హిందీ ప్రేక్షకుల్ని పలకరించారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో దాదాపు 25 సినిమాల్లో నటించారు. 1993లో తన ఫ్లాట్‌లోని నాలుగో అంతస్థులో ఉన్న కిటికీ నుంచి కిందపడి మరణించారు. ఇక సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ కూడా ట్రాజెడీగానే ముగిసింది.. 17 ఏళ్లలో దాదాపు 400లకు సినిమాల్లో నటించారు సిల్క్‌ స్మిత. ప్రధాన పాత్రలతో పాటు ప్రత్యేక గీతాలు, అతిథి పాత్రల్లోనూ అలరించారు. నిర్మాతగా మారి సినిమాలు కూడా తీశారు. కానీ ఆ రంగంలో పరాజయాలు ఎదురవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడం.. ప్రేమ వ్యవహారం దెబ్బతినడంతో.. 1996లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

నాటి సిల్క్‌స్మిత నుంచి నేటి బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ వరకూ వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన వారే..సిల్వర్ స్ర్కీన్ పై సక్సెస్ అయిన వీళ్లంతా రియల్ లైఫ్ లో మాత్రం సమస్యలను అధిగమించలేక అర్థాంతరంగా జీవితాలను ముగించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories