సూపర్‌స్టార్‌లకు మెగాస్టార్‌లకు గురువు ఈయనే!

సూపర్‌స్టార్‌లకు మెగాస్టార్‌లకు గురువు ఈయనే!
x
Highlights

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న దేవదాస్ కనకాల కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దేవదాస్...

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న దేవదాస్ కనకాల కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దేవదాస్ కనకాల వయసు 74 సంవత్సరాలు. 1945 జులై 30న యానాంలో జన్మించిన దేవదాస్ నాటకరంగంలో, సినీ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర పోషించారు. నటుడిగాను, దర్శకుడిగాను రాణించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ స్థాపించి ఎంతోమంది ప్రముఖ నటులకు, స్టార్‌ హీరోలకు నటనలో ఓనమాలు దిద్దించారు.

నాటకరంగంలో, సినీ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర పోషించిన దేవదాస్ కనకాల ప్రతిష్టాత్మక పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్‌. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌‌లో శిక్షణ పొందిన దేవదాస్ కనకాల ఆ తర్వాత హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ స్థాపించి, ఎంతోమంది ప్రముఖ నటులకు, స్టార్‌ హీరోలకు నటనలో ట్రైనింగ్ ఇచ్చారు. చిరంజీవి, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటి దిగ్గజాలకు దేవదాస్ కనకాలే నటనలో ఓనమాలు దిద్దించారు.

దేవదాస్ కనకాల ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రల్లో క్రూరత్వాన్ని అద్భుతంగా పలికించేవారు. ఓ సీత కథ, గ్యాంగ్ లీడర్‌, గోరింటాకు, మల్లీశ్వరి, కాలం మారింది, చెట్టు కింద ప్లీడర్‌, సిరిసిరి మువ్వ, పెదబాబు, కింగ్‌ లాంటి ఎన్నో సూపర్ హిట్‌ సినిమాల్లో నటించిన దేవదాస్ కనకాలకు మహేష్‌బాబు 'భరత్‌ నే నేను' చిత్రం చివరిది. అయితే, టీవీ రంగంలోనూ దేవదాస్ కనకాల నటించి మెప్పించారు. దేవదాస్ కనకాలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇద్దరూ సినీరంగంలో రాణిస్తుండగా దేవదాస్ కనకాల కోడలు సుమ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవలే దేవదాస్‌ కనకాల భార్య లక్ష్మీదేవి మృతి చెందారు.

విశాఖపట్నంలోని ఏవీఎన్‌ కాలేజీలో డిగ్రీ చదివిని దేవదాస్ కనకాల ఆంధ్రా విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. అలాగే అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో, తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. ముఖ్యంగా నట-శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ న‌డిపిన దేవ‌దాస్ క‌న‌కాల ఎంతో మందికి న‌ట‌నలో శిక్ష‌ణ ఇచ్చారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, భానుచందర్‌, అరుణ్‌ పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీరంగంలోనూ ఎందరో నటులు దేవదాస్ కనకాల దగ్గర శిక్షణ పొందినవారే. ఇలా ఎంతోమందిని నటులుగా తీర్చిదిద్ది తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. నాటక సినీ రంగాల్లో నటుడిగా రాణించిన దేవదాస్‌ కనకాల కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. దేవదాస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చ‌లిచీమ‌లు, నాగ‌మ‌ల్లి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories