బంగారం కొంటున్నారా?

బంగారం కొంటున్నారా?
x
Highlights

డబ్బు తరువాత మన దేశంలో అందరూ ఎక్కువ మక్కువ చూపేది పసిడిపైనే. ఇంకా చెప్పాలంటే, డబ్బుని బంగారంగా మార్చుకుని దాచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు....

డబ్బు తరువాత మన దేశంలో అందరూ ఎక్కువ మక్కువ చూపేది పసిడిపైనే. ఇంకా చెప్పాలంటే, డబ్బుని బంగారంగా మార్చుకుని దాచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే.. మన దేశంలో బంగారం అమ్మే దుకాణాలు మాల్స్ లా వెలిసి వెలిగిపోతున్నాయి. మా బంగారం మంచిదంటే.. మాది మంచిదని, మా దగ్గర ధర తక్కువంటే.. మాదగ్గర తక్కువని, అంతే కాకుండా డిస్కౌంట్ లు.. మజూరీ లేదు.. తరుగు లేదు.. అంటూ కళ్లు మిరిమిట్లు గొలిపే ప్రకటనలతో ఊదరగొట్టేస్తున్నారు. అసలు బంగారం మంచిదా.. కాదా? ఎలా తెలుసుకోవాలి. ఇంతకీ మంచి బంగారం అంటే ఏమిటి? తరుగు ఎలా చూస్తారు? మజూరీ కథేంటి? ఇలాంటి అంశాల మీద ప్రాథమిక అవగాహన లేకుండా బంగారం కొనడానికి వెళ్లారో ఇక అంతే సంగతులు.. మీ డబ్బులకు రెక్కలొచ్చినట్టే! బంగారం కోసం మీ కష్టార్జితాన్ని దుకాణం మెరుగుల కోసం ధారబోసినట్టే!

బంగారం కొందామని దుకాణానికి వెళ్లి.. కొద్దిసేపు అన్నిటినీ చూసి నచ్చింది తీసుకుని బిల్ వేయమంటే మీరు వస్తువు చూసినపుడు ఉన్న ధరలు వేరు.. బిల్లులో వచ్ఛే మొత్తం వేరుగానూ ఉంటుంది. అసలు బంగారం ధరకు రకరకాల చార్జీలను కలిపి బిల్లు మోతిక్కించేస్తారు. బిల్లు తగ్గించండని బేరం ఆడితే మహా అయితే 2 శాతం తగ్గించి చాలా సేవ చేసినట్టు మొహం పెడతారు.



ప్రశ్నించాలి..

వర్తకులు వేసిన ధరలపై మౌనంగా ఉండకుండా ప్రశ్నించడం మంచిది. వర్తకులు వేసిన చార్జీలను గుడ్డిగా నమ్మొద్దు. నిజానికి బంగారం ఆభరణాల తుది ధరకు ముందు వివిధ రకాల చార్జీలు దానికి కలుపుతుంటారు. ఈ ధరలన్నవి అన్ని షాపుల్లోనూ ఒకే తీరులో ఉండవు. షాపు, షాపునకు మారిపోతుంటాయి. ఎందుకంటే బిల్లింగ్ కు సంబంధించి ఓ ప్రామాణిక విధానం మన దేశంలో ఇప్పటి వరకు లేదు. ఎవరికి తోచినట్టు వారు వేస్తుంటారు. ప్రతీ పట్టణంలోనూ బంగారం వర్తకుల సంఘం అని ఉంటుంది. ఈ సంఘమే ఇతర ప్రముఖ మార్కెట్ల ధరల ఆధారంగా ప్రతి రోజూ ఉదయం స్థానిక ధరల్ని ఖరారు చేస్తుంటుంది.

బంగారం స్వచ్ఛత

బంగారం అంటే అంతా అచ్ఛంగా బంగారమే ఉండదు. దానిలో కొంతశాతం అలాయ్స్, జింక్, కాపర్, క్యాడ్మియం, వెండి వంటి మూలకాలు కలిసి ఉంటాయి. మనం కొనదలుచుకున్న వస్తువులో బంగారం శాతాన్ని తెలిపేదే స్వచ్ఛత అంటారు. దీనికి క్యారెట్ లలో కొలుస్తారు. క్యారట్ ను స్చచ్ఛతకు చిహ్నంగా తీసుకోవచ్చు. 24 క్యారట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనది. అయితే, ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దీంతో చేసిన ఆభరణాలు దృఢంగా ఉండవు. అందుకే 24 క్యారట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగించరు. 22 క్యారట్ల బంగారాన్ని వాడుతుంటారు. అంటే అందులో బంగారం 91.6 శాతం ఉన్నట్టు. అలాయ్స్, జింక్, కాపర్, క్యాడ్మియం, వెండి తదితర రకాలను కలపడం వల్ల ఆభరణాలు మరింత దృఢంగా మన్నికగా ఉంటాయి. ఏ లోహం ఎంత కలిపారన్న దాన్ని బట్టి బంగారు ఆభరణం రంగు ఆధారపడి ఉంటుంది.

ధరల్లో వ్యత్యాసం ఇందుకే!

సాధారణంగా బంగారం ధరలకు ప్రామాణిక విధానం ఉండదు. అందుకే బంగారం ధరను నిర్ణయించే ముందు అందులో ఉన్న బంగారం శాతం, దానికి ఏ లోహం కలిపామన్నది కీలకం అవుతుంది. బంగారం ధరలు ప్రతీ రోజూ మారిపోతుంటాయి. అంతర్జాతీయంగా దీన్ని పెట్టుబడుల సాధనంగానూ ఉపయోగిస్తుంటారు. దీంతో నిత్యం ధరలు మార్పునకు లోనవుతుంటాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం గనుక బంగారం ధరలపై కరెన్సీ మారకం విలువల ప్రభావం ఉంటుంది. మనం బంగారాన్ని డాలర్ల రూపంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తాం. డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. రూపాయి బలపడితే బంగారం ధర తగ్గుతుంది. కొనుగోలుకు, సరఫరాకు మధ్య ఉన్న తేడా తదితర అంశాలు బంగారం ధరపై ప్రభావితం చూపిస్తుంటాయి. పైగా వర్తకులు ఎక్కడ నుంచి బంగారం కొనుగోలు చేశారు, ఎంతకు కొనుగోలు చేశారన్న అంశం కూడా కీలకమే. అందుకే దుకాణం దుకాణానికి ధరలు మారిపోయేది. అయితే, బంగారం ధరల్లో ఇలాంటి వ్యత్యాసం స్వల్పమేనని నిపుణులు చెబుతారు.

స్టడెడ్ జ్యుయెలరీ

కొన్ని ఆభరణాల్లో రాళ్లు పొదిగి ఉంటాయి. అందాన్ని ఇనుమడించేందుకు ఈ విధంగా రాళ్లను ఉపయోగిస్తుంటారు. వీటినే స్టడెడ్ జ్యుయెలరీ అని అంటారు. కొందరు బంగారం వర్తకులు మొత్తం ఆభరణాన్ని తూకం వేసి ఎన్ని గ్రాములు ఉంటే ఆ మేరకు బంగారం ధరను వేస్తారు. అంటే రాళ్ల బరువుకూ బంగారం ధరే పడుతుంది. కానీ, ఇదే ఆభరణాన్ని కొంత కాలం తర్వాత కొన్న వర్తకుడికే ఇచ్చి చూడండి. రాళ్ల తూకాన్ని వేరు చేయడం గమనించొచ్చు. పైగా ఈ రాళ్లకు రూపాయి కూడా చెల్లించరు. కేవలం బంగారానికే రేటు కడతారు. అందుకే ఆభరణంలో ఉన్న నికర బంగారానికే ధరను నిర్ణయించాలని కోరడంలో తప్పులేదు. వజ్రాలు, రత్నాలు ఎంత బరువు ఉంటాయో గుర్తించడం కష్టం. పైగా వాటి నాణ్యత కూడా తెలియదు. దీంతో వర్తకులు కస్టమర్ల నుంచి ఎక్కువ వసూలు చేసేందుకు వీటిని అనుకూలంగా మలుచుకుంటారు. ఇక రాళ్లు పొదిగిన ఆభరణాలకు ఎక్కువ డిజైన్ పని కూడా ఉంటుంది. కాబట్టి అధిక తయారీ చార్జీలు వేస్తుంటారు.


మంజూరీ..

ఏ తరహా ఆభరణం ఎంచుకున్నారన్న అంశంపై మంజూరి (తయారీ ధర) ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతీ ఆభరణానికి డిజైన్ వేరుగా ఉంటుంది. అలాగే, ఆభరణం మెషిన్ పై చేసిందా? లేక మనుషులు తయారు చేసిందా? అన్నది కూడా ధరల్లో మార్పునకు కారణం అవుతుంది. మెషిన్ తో చేసిన జ్యుయెలరీ మనుషులు చేసిన ఆభరణాల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. సాధారణంగా బంగారం ధరపై తయారీ చార్జీలు 6 శాతం నుంచి 25 శాతం వరకు ఉంటాయి. ఆభరణం తయారు చేసిన వారికి చెల్లించే చార్జీలను కస్టమర్ల నుంచి ఇలా రాబట్టుకుంటారు. మెషిన్ పై తయారైన వాటికి, అలాగే చేత్తో చేసిన ఆభరణాలు తక్కువ ఆర్ట్ వర్క్ ఉన్న వాటికి తయారీ చార్జీలు 6-14 శాతం మధ్య ఉంటాయి. ఒకవేళ ఎక్కువ డిజైన్ తో ఉంటే ఈ తయారీ చార్జీలు 25 శాతం వరకూ చెల్లించాల్సి రావచ్చు. తయారీ చార్జీలను బంగారంలో నిర్ణీత శాతం లేదా గ్రాముకు ఇంత చొప్పున వసూలు చేసే రెండు విధానాలు ఆచరణలో ఉన్నాయి. వినియోగదారులు ఈ తయారీ చార్జీలను తగ్గించాలని వర్తకులను కోరొచ్చు. పైగా దుకాణంలో సేల్స్ పర్సన్ వేసిన చార్జీలను తగ్గించాలని అడిగితే మేనేజర్ తగ్గించడం కూడా జరుగుతుంది. అంటే బిల్లింగ్ లో, వేసిన చార్జీల్లో పారదర్శకత లేదనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. బంగారం ధరలు తగ్గుతుంటే తయారీ చార్జీలను నిర్ణీత శాతంగానూ, బంగారం ధర పెరుగుతుంటే గ్రాముకు ఇంత చొప్పున ఫ్లాట్ గా విధించే తయారీ చార్జీల విధానమే మంచిది.

తరుగు

బంగారం ముద్దను ఆభరణంగా మార్చే క్రమంలో కొంత వృధా అవుతుంది. కటింగ్, సోల్డరింగ్, కరిగించే క్రమంలో ఇలా జరుగుతుంది. దీన్ని వేస్టేజ్ లేదా తరుగుగా పేర్కొంటారు. ఆభరణాన్ని బట్టి దీన్ని వర్తకులు నిర్ణయిస్తారు. ఈ వృధా చార్జీలు 3 నుంచి 25 శాతం వరకు ఉంటాయి. ఒకే ఆభరణం ధర రెండు షాపుల్లో వేర్వేరుగా ఉండడానికి ఈ తరుగు, తయారీ చార్జీల్లో వ్యత్యాసం కూడా ఒక కారణం. హాల్ మార్క్ బంగారు ఆభరణంలోని స్వచ్ఛతను హాల్ మార్క్ తెలియజేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆభరణాల్లోని స్వచ్ఛతను పరీక్షించి ఇచ్చే ధ్రువీకరణ ఇది. 22క్యారట్లకు 22కే916, 18క్యారట్లకు 19కే750, 14 క్యారట్ల బంగారం అయితే 14కే585 ఇలా గుర్తులు ఉంటాయి. హాల్ మార్కింగ్, బంగారం స్వచ్ఛత నంబర్, తయారీ సంవత్సరం వివరాలు కూడా ఉంటాయి. హాల్ మార్క్ ఆభరణాల్లో బంగారం నిర్ణీత శాతం మేర కచ్చితంగా ఉంటుందని భావించొచ్చు. కనుక వీటి ధరలు హాల్ మార్కింగ్ లేని ఆభరణాల కంటే ఎక్కువగా ఉంటాయి.హాల్ మార్క్ లేకుండా విక్రయించే ఆభరణాల్లో బంగారం 18 క్యారట్లకు మించి ఉండదని ఓ అంచనా. దీంతో ఈ తరహా ఆభరణాల్లో వర్తకులకు ఎక్కువ లాభం ఉంటుంది. కనుక ధరలు తక్కువగా వేసి కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. బంగారంలో స్వచ్ఛత ఎంత శాతం, పాత ఆభరణాల మార్పిడికి అవకాశం ఉందా?, ఉంటే ఎంత తరుగు తీసి, ఎంత రేటు నిర్ణయిస్తారు? ఆభరణంపై వారంటీ ఏమైనా ఉందా, బిల్లులో పారదర్శకంగా అన్ని చార్జీలను వివరంగా పేర్కొన్నారా? తదితర అంశాలను గమనించాలి. చిన్న వర్తకులు బంగారం ధరను డిస్ ప్లేలో ఉంచడం అరుదు. పెద్ద వర్తకులు బహిరంగంగానే ఆ రోజు బంగారం మార్కెట్ ధరను ప్రదర్శిస్తారు. కొందరు పెద్ద వర్తకులు బంగారు ఆభరణాలపై సున్నా తయారీ చార్జీల పేరుతో ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. అయితే వీరు ఈ చార్జీలను తరుగు లేదా మరో రూపంలో విధించే అవకాశం ఉంటుందని గమనించాలి.

ఇన్ని అంశాలను బేరీజు వేసుకుని వీలైనంత వరకు రెండు మూడు దుకాణాల్లో మీరు కోరుకున్న ఆభరణం ధరను సరిపోల్చుకుని, తరువాత మాత్రమే బంగారాన్ని కొనడం ఉత్తమమైన మార్గం. ఇక మన ఊళ్లలో ఎట్టి పరిస్థితిలోనూ హాల్ మార్క్స్ లేని బంగారాన్ని కొనకపోవడమే శ్రేయస్కరం. ఎందుకంటే ఎవరో చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు.. అలాగే బంగారాన్నీ పదే పదే కోనేపరిస్థితీ ఉండకపోవచ్చు!

Show Full Article
Print Article
Next Story
More Stories