ఫ్యాన్‌ కింద కారు... ఎన్నికల తాయిలాలే వేరు

Wall Clock
x
Wall Clock
Highlights

చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో ఇంటింటికీ వైసీపీలో భాగంగా ప్రతిపక్ష నేతలు గోడ గడియారాలు పంచిపెట్టారు. గత ఏడాది అక్టోబరు నుంచి వైసీపీ నేతలు గోడ గడియారాలు పంపిణీ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో ఇంటింటికీ వైసీపీలో భాగంగా ప్రతిపక్ష నేతలు గోడ గడియారాలు పంచిపెట్టారు. గత ఏడాది అక్టోబరు నుంచి వైసీపీ నేతలు గోడ గడియారాలు పంపిణీ చేస్తున్నారు. వాటిపై వైసీపీ అధినేత జగన్‌, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి, రాజంపేట మాజీ ఎంపీ మిధున్‌ రెడ్డి ఫొటోలు, పార్టీ గుర్తు ముద్రించి ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 40 వేలకు పైగా గడియారాలు పంచిపెట్టారు. ఇష్టం ఉన్న వాళ్లు తీసుకుంటుండగా ఇతర పార్టీల అభిమానులు తిరస్కరిస్తున్నారు.

వైసీపీ పంచిన గోడ గడియారాన్ని తీసుకున్న ఓ వ్యక్తి పైనున్న అద్దాన్ని తొలగించి, వైసీపీ స్టిక్కర్‌ను చించాడు. ఒక్కోముక్క చించేకొద్దీ, కింది నుంచి గులాబీరంగు బయటపడుతూ వచ్చింది. పూర్తిగా చించిన తర్వాత కేసీఆర్ ఫొటోతో పాటు తెలంగాణలోని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ఫొటోలు బయటపడ్డాయి.

గోడ గడియారాల ద్వారా టీఆర్‌ఎస్‌, వైసీపీ పార్టీల మధ్య ముసుగు బయటపడిందని టీడీపీ విమర్శిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పంపిణీ చేయగా మిగిలిపోయిన గడియారాలను పంపిణీ చేసుకోవాలంటూ జగన్‌ పార్టీకి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. గోడ గడియారాలకు అతికించిన స్టిక్కరు తీసేస్తే టీఆర్‌ఎస్‌ నేతల ఫోటోలు బయటకు వస్తున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. ఇలా లోపాయికారిగా రాజకీయాలు చేసే బదులు బహిరంగంగానే పొత్తు పెట్టుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.

గడియారాల తయారీదార్ల పొరపాటువల్లే గోడ గడియారాల్లో వైసీపీ ఫొటో వెనుక టీఆర్‌ఎస్‌ ఫొటోలు వచ్చాయని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ కంపెనీకి 60 వేల వాల్‌ క్లాక్‌లు కావాలని ఆర్డర్‌ చేశామని అంతకుముందు తెలంగాణకు చెందిన నాయకులు ఆర్డర్‌ ఇచ్చినందున, వారివి కొన్ని మిగిలిపోగా వర్కర్లు వాటిపైనే తమ ఫొటోలను అంటించి పంపించారని చెప్పారు. 165 గోడ గడియారాల్లో మాత్రమే ఈ పొరపాటు జరిగిందని వైసీపీ నేతలు తెలిపారు. వెంటనే తయారీదార్లను అప్రమత్తం చేశామని దీంతో వారు మిగిలిన వాల్‌క్లాక్‌లను సక్రమంగానే సరఫరా చేశారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories