బ్యాక్ టు బ్యాక్ విజయాలకు బాలకృష్ణ, రోజా తహతహ..

బ్యాక్ టు బ్యాక్ విజయాలకు బాలకృష్ణ, రోజా తహతహ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల బరిలో సిటింగ్ ఎమ్మెల్యేలుగా రెండోసారి బరిలోకి దిగిన సినీస్టార్ కమ్ పొలిటీషియన్లు బాలకృష్ణ, రోజాల ఫలితాల కోసం అభిమానులు...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల బరిలో సిటింగ్ ఎమ్మెల్యేలుగా రెండోసారి బరిలోకి దిగిన సినీస్టార్ కమ్ పొలిటీషియన్లు బాలకృష్ణ, రోజాల ఫలితాల కోసం అభిమానులు ఎనలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరునూరైనా విజయం సాధించితీరాలన్న పట్టుదలతో కళ్యాణదుర్గం స్థానం నుంచి పోటీకి దిగారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 స్థానాలకు కొద్దిగంటల క్రితమే పోలింగ్ ముగిసింది. అయితే వివిధ పార్టీల అధినేతలతో పాటు సినీ స్టార్ కమ్ పొలిటీషియన్లు పోటీపడిన నియోజకవర్గాల ఫలితాల కోసం అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినీరంగంతో పాటు ఏపీ రాజకీయాలలో సైతం తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ, వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే రోజా అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి, చిత్తూరు జిల్లా కుప్పం స్థానాల నుంచి బ్యాక్ టు బ్యాక్ విజయాలకు తహతహలాడుతున్నారు.

ఐదేళ్ల క్రితం హిందూపూర్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలవటమే కాదు విజేతగా నిలిచిన బాలకృష్ణ వరుసగా రెండోసారి పోటీకి దిగారు. తన స్థానం నిలుపుకోవాలన్న పట్టుదలతో ప్రచారం నిర్వహించారు. 2014 ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గ పోలింగ్ శాతం 76.23 గా ఉంటే ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం 77.50కి పెరిగింది. దాదాపు ఒక్కశాతానికి పైగా పెరిగిన పోలింగ్ శాతంతో తన గెలుపు ఖాయమని ఇటు టీడీపీ, అటు వైసీపీ అభ్యర్థులు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్ధి బాలకృష్ణ నలుగురు ప్రత్యర్థులతో తలపడుతున్నా ప్రధానపోటీ మాత్రం వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తోనే సాగింది.

మరోవైపు వైసీపీ ఫైర్ బ్రాండ్ అభ్యర్థి, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే రోజా తన స్థానం నిలుపుకోగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నాలుగుపార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులతో రోజా తలపడుతున్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ నుంచే రోజాకు ప్రధానంగా పోటీ ఎదురయ్యింది. 2014 ఎన్నికల్లో స్వల్పతేడాతో నెగ్గిన రోజా..ఈసారి భారీ తేడాతో విజయం ఖాయమని చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 84.73 శాతంగా ఉంటే అదికాస్త ప్రస్తుత ఎన్నికల్లో 86.22 శాతానికి పెరిగింది. దాదాపు రెండు శాతానికి పైగా పెరిగిన పోలింగ్ శాతంతో తమకే లాభమంటే తమకే లాభమని ఇటు వైసీపీ, అటు టీడీపీ చెబుతున్నాయి. నగరి నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు సైతం ఎక్కువగా ఉండటం కూడా జయాపజయాలను నిర్ణయించడంలో కీలకంకానున్నాయి.

ఇదిలాఉంటే రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజల ఉగ్రరూపంలో గల్లంతైన కాంగ్రెస్ ప్రధానంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తన ఉనికిని చాటుకోడానికి తహతహలాడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పొందిన రఘువీరా ప్రస్తుత ఎన్నికల్లో మరో నలుగురు ప్రత్యర్థులతో తలపడుతున్నారు. టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వరనాయుడు, వైసీపీ అభ్యర్థిగా ఉషశ్రీ చరణ్ లతో పాటు జనసేన, బీజెపీ అభ్యర్థులతో పోటీపడుతున్నారు.

గత ఎన్నికల్లో 85. 43 శాతం పోలింగ్ నమోదు కాగా ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం 86. 75కు పెరిగింది. ఒక్కశాతానికి పైగా పెరిగిన ఈ పోలింగ్ శాతం ఎవరికి వరం ఎవరికి శాపం అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని లక్షలాది మంది అభిమానులు మాత్రం బాలకృష్ణ, రోజా పోటీ చేస్తున్న స్థానాల ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories