ఏకకాలంలో అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ .. నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్‌‌

ఏకకాలంలో అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ .. నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్‌‌
x
Highlights

ఏపీ ప్రతిపక్ష వైసీపీ కొత్త రికార్డు స్పష్టించింది. ఏక కాలంలో 175 అసెంబ్లీ, 16 పార్లమెంట్‌ నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించింది. 90 శాతం సిట్టింగ్‌లకు...

ఏపీ ప్రతిపక్ష వైసీపీ కొత్త రికార్డు స్పష్టించింది. ఏక కాలంలో 175 అసెంబ్లీ, 16 పార్లమెంట్‌ నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించింది. 90 శాతం సిట్టింగ్‌లకు మరో అవకాశం కల్పిస్తూ అనుభవానికి ప్రాధాన్యతనిచ్చినట్టు వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్‌ నివాళులు అర్పించిన అనంతరం జగన్ సమక్షంలో అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు.

ఏడాది ముందే సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను సిద్దం చేసిన వైసీపీ అధినేత జగన్‌ పార్టీ అభ్యర్ధుల ఎంపికలోనూ దూకుడు ప్రదర్శించారు. 13 జిల్లాల పరిధిలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలకు ఒకే సారి అభ్యర్ధులను ప్రకటించారు. శనివారం 9 మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన జగన్‌ మిగిలిన 16 మందిని కూడా ప్రకటించారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించిన అనంతరం అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. బాపట్ల పార్లమెంట్ అభ్యర్ధి నందిగాం సురేష్ ఎంపీ అభ్యర్ధులను ప్రకటించారు.

ఇక జిల్లాల వారిగా ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించారు. జగన్ సమక్షంలో బీసీ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్ధులను ప్రకటించారు. కడప, రాజంపేట పార్లమెంట్‌ స్ధానాలు మాత్రమే సిటింగ్‌లకు దక్కాయి. ఒంగోలు నుంచి గతంలో గెలిచిన జగన్ బాబయి వైవీ సుబ్బారెడ్డికి ఈ సారి టికెట్ దక్కలేదు. ఇదే సమయంలో నెల్లూరు ఎంపీగా గతంలో గెలిచిన మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా టికెట్ దక్కలేదు. ఇక తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహించిన వరప్రసాద్‌కు గూడురు టికెట్ కేటాయించారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీలో చేరినా ఫలితం దక్కలేదు. సగానికి పైగా స్ధానాల్లో కొత్త వారికి టికెట్లు కేటాయించారు. శనివారం పార్టీలో చేరిన వారిలో వంగాగీత, బల్లి దుర్గా ప్రసాద్‌, ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డిలకు ఎంపీ సీట్లు దక్కాయి.

ఇక అసెంబ్లీ అభ్యర్ధుల్లో నలుగురికి టికెట్లు దక్కలేదు. నందికొట్కూరు, మదన పల్లి, పూతల పట్టు, మార్కాపురం స్థానాల అభ్యర్ధులను మార్చారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో 41 మంది బీసీలు, 31 మంది కాపులు, 29 మంది ఎస్సీలు, 7గురు ఎస్టీలు, 5గురు ముస్లింలు, 4 బ్రహ్మణులు, ముగ్గురు వైశ్యులకు టికెట్లు దక్కాయి. ఇందులో15 మంది మహిళలు కూడా ఉన్నారు.

అభ్యర్ధుల ఎంపికలో అనుభవం, నమ్మకం, యువతకు, పెద్దపీట వేసినట్టు అధినేత జగన్ ప్రకటించారు. మొత్తం అభ్యర్ధుల్లో 9మంది ఆల్ ఇండియా సర్వీసుల్లో పనిచేసిన వారు ఉండగా 15 మంది డాక్టర్లు ఉన్నారు. 175 మంది అభ్యర్ధుల్లో 45 ఏళ్లలోపు 33 మంది ఉండగా.. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు 98 మంది ఉన్నారు. ఇక 60 ఏళ్లకు పైబడిన వారు 44 మంది ఉన్నారు. మొత్తం 139 మంది గ్రాడ్యుయెట్లు, పోస్టు గ్రాడ్యుయెట్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అభ్యర్ధులను ఎంపిక చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ, ఎస్సీ,ఎస్టీలను పెద్దపీట వేయడం ద్వారా ఆయా వర్గాల్లో నమ్మకం కలిగించామంటున్నారు. అభ్యర్ధులను ప్రకటించిన అనంతరం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories