26 మందితో వైసీపీ ఫస్ట్ లిస్ట్...వైసీపీలో చేరే యోచనలో బైరెడ్డి...

26 మందితో వైసీపీ ఫస్ట్ లిస్ట్...వైసీపీలో చేరే యోచనలో బైరెడ్డి...
x
Highlights

వైసీపీ రేసు గుర్రాలు రెడీ అయ్యియి. కొన్ని స్థానాలు మినహా మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్ధులు ఖరారయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి కొద్దిరోజుల...

వైసీపీ రేసు గుర్రాలు రెడీ అయ్యియి. కొన్ని స్థానాలు మినహా మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్ధులు ఖరారయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి కొద్దిరోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇవాళ్టి నుంచి విడతల వారీగా అభ్యర్ధులను ప్రకటించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. మరోవైపు వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపునకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. ఇవాళ కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను అధినేత జగన్ ప్రకటిస్తారు. మూడు లేదంటే నాలుగు విడతల్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. రోజుకు 25 మంది చొప్పున మూడ్రోజుల్లో 75 మంది అభ్యర్ధులను ప్రకటించాలని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి అత్యంత జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. పాదయాత్ర సమయంలోనే అభ్యర్థుల గెలుపు అవకాశాలపై సర్వే చేయించిన జగన్ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొగల అభ్యర్థులను ఎంచుకొటున్నారు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జల్లాల అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. ఇక వైసీపీకి అత్యంత కీలకమైన రాయలసీమ జాబితా కూడా రెడీ అయ్యింది. ఇక ఉత్తరాంధ్రలో ఆరేడు నియోజకవర్గాల్లో ఇద్దరిద్దరు పేర్లు పరిశీలనలో ఉండడంతో జాబితా వడపోత పోస్తున్నారు. ఇక అత్యంత కీలకమైన ఉభయగోదావరి జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపికపై భారీ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరిలో అభ్యర్ధులు ఖరారైనా తూర్పుగోదావరిలో మాత్రం అత్యధిక స్థానాలు ఇంకా పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

అభ్యర్థుల జాబితా ‌ఖరారు సమయంలోనే వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. కాకినాడ ఎంపీ తోట నర్సింహం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు తాను ఆరోగ్యం లెక్క చేయకుండా పనిచేసినా తనపట్ల కనీసం మానవత్వం చూపించలేదని అందుకే పార్టీ మారుతున్నట్లు తోట నర్సింహం ప్రకటించారు. తోట నర్సింహం సతీమణి వాణి పెద్దాపురం టికెట్ కోరుకుంటున్నారు. ఈ దిశగా జగన్ నుంచి హామీ రావడంతోనే తోట నర్సింహం టీడీపీనీ వీడినట్లు సమాచారం.

మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పీవీపీ కూడా ఇవాళ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరతారు. ఆయన విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనే వైసీపీ తరఫున పీవీపీ విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని భావించినా ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి పీవీపీ విజయవాడ నుంచి బరిలోకి దిగడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే సినీనటుడు రాజా రవీంద్ర కూడా ఇవాళ వైసీపీలో చేరుతున్నారు.

అటు కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీ తరుఫున ఎంపీగా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఇవాళో రేపో బైరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కార్యకర్తల అభిప్రాయం తెలుసుకుంటారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories