ఈరోజుతో ముగియనున్న వైఎస్‌ జగన్ పాదయాత్ర...ముగింపు సభలో కీలక ప్రకటన...

PrajaSankalpaYatra
x
PrajaSankalpaYatra
Highlights

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటితో ముగియనుంది. 2017 నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజాసంకల్ప యాత్ర ఇవాళ ఇచ్ఛాపురంలో ముగించనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటితో ముగియనుంది. 2017 నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజాసంకల్ప యాత్ర ఇవాళ ఇచ్ఛాపురంలో ముగించనున్నారు. యాత్ర చిరకాలం గుర్తుండిపోయేలా భారీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఇక పాదయాత్ర ముగింపు సభలో జగన్ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.

వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల పాదయాత్రకు ఇచ్చాపురం కేరాఫ్ అడ్రస్ గా మారింది. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత షర్మిల నేడు జగన్ పాదయాత్ర ముగింపుతో ఇచ్చాపురంలో పాదయాత్ర పైలాన్ ల సంఖ్య మూడుకు చేరుకుంది.

2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. 341 రోజుల పాటు 3,648 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో మొత్తం 134 నియోజ‌క వ‌ర్గాలు క‌వ‌ర్ చేసారు. 2,516 గ్రామాలు, 231 మండలాలు, 54 మున్సిపాల్టీలు, 8 కార్పోరేష‌న్ల మీదుగా ఈ యాత్ర సాగించారు. మొత్తం 124 బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌సంగించారు. 55 ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర కొనసాగించారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర గుర్తుండి పోయే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. యాత్రసంకల్పాన్ని చాటుతూ ఓ భారీ పైలాన్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంనుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న మార్గంలో జాతీయ రహదారికి ఆనుకుని ఎడమవైపున, బరంపురం నుంచి వస్తున్నప్పుడు కుడివైపున బహుదానది తీరాన ఈ పైలాన్ రూపుదిద్దుకుంది. ఇచ్ఛాపురం టౌన్‌కు 2 కిలో మీటర్ల ముందే ఈ స్థూపం కనిపిస్తుంది.

మూడు అంతస్తుల లెక్కన, పునాది నుంచి 88 అడుగుల ఎత్తులో స్థూపం ఉంటుంది. పునాది నుంచి స్థూపం బేస్‌ వరకూ 13 జిల్లాలను సూచిస్తూ 13 మెట్లు నిర్మించారు. నాలుగు పిల్లర్లపై 3 అంతస్తుల్లో స్థూపం ఉంటుంది. మొదటి అంతస్తులో జగన్‌ పాదయాత్ర ఫొటోలు ఉంటాయి. రెండో అంతస్తులో వైయస్సార్‌ ఫొటోలు ఉంటాయి. స్థూపం పైఅంతస్తు డోమ్‌ నుంచి 15 అడుగుల ఎత్తులో పార్టీ పతాకం ఎగురుతుంది.

ఇప్పటికే వైయస్సార్ ప్ర‌జా ప్ర‌స్థానం యాత్రకు గుర్తుగా ప్రజాప్రస్థాన ప్రాంగణాన్ని నిర్మించారు. ఆతర్వాత వైయస్‌ షర్మిళ నిర్వ‌హించిన మ‌రో ప్రజాప్రస్థానానికి గుర్తుగా మరో స్థూపాన్ని కట్టారు. ఇప్పుడు జ‌గ‌న్ ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఈ స్థూపం నిర్మించారు. పాదయాత్ర ముగింపు సందర్బంగా జగన్‌ ఈ స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. ఇచ్చాపురం సభ ద్వారా జగన్ కీలక ప్రకటన చేస్తారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమరశంఖం పూరిస్తారని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories