వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్...వైసీపీలో చేరుతున్న...

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్...వైసీపీలో చేరుతున్న...
x
Highlights

వైఎస్ జగన్ పరిణతిగా వ్యవహరిస్తున్నారా? గత ఎన్నికల ఓటమి గుణపాఠాలే ఆయనలో మార్పుకు కారణమా? ఎలాంటి బేషజాలకు పోకుండా పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలో...

వైఎస్ జగన్ పరిణతిగా వ్యవహరిస్తున్నారా? గత ఎన్నికల ఓటమి గుణపాఠాలే ఆయనలో మార్పుకు కారణమా? ఎలాంటి బేషజాలకు పోకుండా పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకోవడం దీనికి సంకేతమా? తన తండ్రికి సన్నిహితంగా ఉన్న సీనియర్లను చేరదీయడమే దీనికి నిదర్శనమా?

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఓ వైపు టిడీపీ సిట్టింగు ఎంపీ, ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటూనే ఎన్నికల్లో ప్రభావం చూపే తటస్థులకు చేరువవుతున్నారు. అదే సందర్భంలో ఒకప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత పార్టీకి దూరమైన నేతలకు పార్టీ తలుపులను తెరిచి పెట్టారు. పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ కోసం పని చేసిన పలువురు సీనియర్లు వైసీపీకి రాజీనామా చేసారు. కొందరు ఇతర పార్టీల్లో చేరితే మరి కొందరు రాజకీయాల్లో క్రీయశీలకంగా లేరు. అయితే వారి సేవలను పార్టీలో వినియోగించుకోవాలని భావించిన జగన్ సొంత గూటికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. పార్టీకి ద్రోహం చేసి అధికార టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా పార్టీని వీడిన వారంతా పార్టీలో చేరవచ్చని సంకేతాలిచ్చారు. దీంతో ఒక్కొక్కరుగా నేతలు సొంత గూటికి చేరుతున్నారు.

అనంతపూర్ మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ గా తనను తప్పించడంతో నొచ్చుకుని టీడీపీలో చేరారు. అయితే ఎక్కువ కాలం అక్కడ ఇమడ లేకపోయిన ఆయన తిరిగి వైసీపీలో చేరారు. గత ఎన్నికలో నరసాపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ సీనియర్ గా ఉన్న కనుమూరి రఘురామరాజు బీజేపీలో చేరారు. ఎన్నికల తర్వాత టీడీపీలో పని చేసారు. అయితే ఎన్నికల వేళ ఆయన బలాన్ని, బలగాన్ని వినియోగించుకునేందుకు రఘురామ రాజును తిరిగి పార్టీలో చేర్చుకున్నారు జగన్. అదే కోవలో దాడి వీరభద్రరావు కు సైతం ఆహ్వానం పలికారు. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి కొద్ది కాలం పాటు వైసీపీలో పనిచేసారు. అయితే స్థానిక పరిస్ధితుల కారణంగా దాడి వైసీపీ నుంచి దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికల వేళ దాడిని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సిద్ధ పడ్డారు.

గత ఎన్నికలో పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ఉత్తరాంద్ర, గోదావరి జిల్లాలే కారణమని భావించిన జగన్ ఆ రెండు ప్రాంతాల్లో బలమైన నాయకులుగా ఉన్న రఘురామ రాజు, దాడి వీరభద్రరావు లను చేర్చుకుని అక్కడ ఎంపీలుగా పోటి చేయించడం ద్వారా అధికారాన్ని హస్త గతం చేసుకోవచ్చని నమ్ముతున్నారు. అందుకే పార్టీకి దూరంగా ఉన్నప్పటికి వారిద్దరిని అక్కున చేర్చుకున్నారు. ఇక వైసీపీ వ్యవస్థాపకుడైన శివకుమార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీకి దూరమయ్యారు. పార్టీ విధానానికి విరుద్దంగా ఆయన ప్రజాకూటమిని బలపరచడంతో సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో ఆగ్రహంగా ఉన్న శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. శివకుమార్ ను ప్రత్యేకంగా పిలిపించుకోని తన హోదాను పక్కన పెట్టి ఆయనతో చర్చలు జరిపారు. శివకుమార్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తేసారు. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా ఒప్పించారు. దీంతో పాటు తన తండ్రికి దగ్గరగా ఉన్న సీనియర్లను చేర దీస్తున్నారు. మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే జయసుధ వంటి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు.

ఇలా పార్టీకి దూరమైన నేతలను పెద్ద మనసుతో తిరిగి పార్టీలో చేర్చుకుంటుండంతో జగన్ లో పరిణతి పెరిగిందని పార్టీ సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఈ పరిణతి లోపిండచడం వల్లే పార్టీ ఓటమి చెందిందని ఆ గుణపాఠంతో జగన్ వైఖరిలో మార్పు వచ్చిందని అది ఈ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతలు.


Show Full Article
Print Article
Next Story
More Stories