Top
logo

వైసీపీలోకి చంద్రబాబు దగ్గరి బంధువులు...జూనియర్ ఎన్టీఆర్ సేవలను...

వైసీపీలోకి చంద్రబాబు దగ్గరి బంధువులు...జూనియర్ ఎన్టీఆర్ సేవలను...
X
Highlights

2014 ఎన్నికల నుంచి తెలుసుకున్న గుణపాఠాలతో 2019 ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. బలమైన టీడీపీని...

2014 ఎన్నికల నుంచి తెలుసుకున్న గుణపాఠాలతో 2019 ఎన్నికలకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. బలమైన టీడీపీని దెబ్బకొట్టాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలని భావిస్తున్నారు. ఓ వైపు టీడీపీని ఫిరాయింపులతో బలహీనపరుస్తూనే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సభ‌్యుల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే సమయంలో సొంత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లకు హెచ్చరికలు కూడా జారి చేస్తున్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు నియోజకర్గాలు దాటి రావొద్దంటూ స్టాంగ్ వార్నింగ్‌ కూడా ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆహ్వనిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలకు వైసీపి కండువా కప్పిన ఆయన త్వరలోనే మరికొందరు నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంతనాలు సాగిస్తున్నారు. వైసీపీ బలహీనంగా ఉన్న చోట వలసలను ప్రోత్సహిస్తున్న జగన్‌ టీడీపీ బలహీన పడిందన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేరికలను నిత్యం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ మారిన నేతలంతా జగన్ పాదయత్ర సందర్భంగా చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా వ్యవహరించడం వ్యూహాత్మకంగా సాగుతోంది.

చంద్రబాబు దగ్గరి బంధువులను సైతం పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా 2004 నాటి పరిస్ధితులను స్పష్టిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలు సైలెంట్ గా ఉన్న కో బ్రదర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావును పార్టీలోకి ఆహ్వనించడం ఇందులో వ్యూహమేనంటున్నారు. దగ్గుబాటి కుటుంబానికి పర్చూరు టికెట్ ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు చికాకులు తెప్పించారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడి సన్నిహిత బంధువు, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ రావు ను సైతం వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. నార్నే కోరుతున్న సీటు ఫైనల్ చేశాక జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇలా అధికార పక్షాన్ని బలహీన పరిచే ఎత్తుగడను అమలు చేస్తూనే నియోజకవర్గాల వారిగా ఎప్పటికప్పుడు జగన్‌ మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాలు దాటి రావోద్దని వార్నింగ్ ఇచ్చారట. అధికార పార్టీ ఒత్తిళ్ల నుంచి కార్యకర్తలను కాపాడుకుంటూ భరోసానిచ్చేలా అనునిత్యం టచ్‌లో ఉండాలంటూ సూచించారు. ఓట్ల గల్లంతు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పార్టీ సానుభూతి పరుల ఓట్లు గల్లంతయితే వెను వెంటనే నమోదు చేసేలా బూతుల వారిగా యంత్రాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారట. ఈ వ్యవహరాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం నిత్యం పర్యవేక్షిస్తూ అలసత్వం, ఉదాసీనత ప్రదర్శిస్తే టికెట్ గల్లంతు అవుతుందంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ఫ్యాన్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ వేస్తున్న ఎత్తులు వైసీపీని గెలిపిస్తాయని పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు బలంగా నమ్ముతున్నారు .


Next Story