ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభంజనం
x
Highlights

ఆంధ‌్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం ఖాయమని మెజారిటీ జాతీయ ఛానెళ్లు, సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌‌‌ అంచనా వేశాయి....

ఆంధ‌్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం ఖాయమని మెజారిటీ జాతీయ ఛానెళ్లు, సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌‌‌ అంచనా వేశాయి. ఊహించినదానికంటే అత్యధిక స్థానాలు వైసీపీకి రాబోతున్నాయని వెల్లడించాయి. ఏపీకి కాబోయే సీఎం జగన్‌ అంటూ అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌‌ చెప్పాయి. తెలుగుదేశానికి 40 నుంచి 60లోపే స్థానాలొస్తాయని తెలిపాయి. ఇక పొలిటికల్‌ తుపాను సృష్టిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ జనసేన, అసలు సోయిలో లేదన్నాయి సర్వే సంస్థలు. రెండంకెల స్కోర్‌ను కూడా అందుకోలేదని చెప్పాయి. మొత్తానికి చంద్రబాబు భయపడ్డట్టే, జగన్‌ ధీమాకు తగ్గట్టే, పవన్‌ మౌనానికి అనుగుణంగానే మెజారిటీ ఛానెళ్ల ఎగ్జిట్‌పోల్స్ అంచనాలున్నాయి. ఏ ఛానెల్, ఏ సంస్థ ఏపీలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలిచ్చాయి.

45 రోజుల విరామం, రోజురోజుకు పెరుగుతున్న అంచనాలు, నరాలు తెగే ఉత్కంఠ, ఊహాగానాలు, సోషల్ మీడియా సర్వేలు, బెట్టింగ్ ట్రెండ్స్, ఇలా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారోనన్న క్యూరియాసిటీ ఏపీ జనాలను, ముఖ్యంగా పార్టీల నాయకులను కంటి మీద కునుకులేకుండా చేశాయి. వాటిని కాస్తోకూస్తో చల్లార్చే ఎగ్జిట్‌పోల్స్‌ కోసం అందరూ ఎదురుచూశారు. ఆ అంచనాలు రానే వచ్చాయి. ఆంధ‌్రప్రదేశ్‌ అసెంబ్లీ సమరంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విజయఢంకా మోగిస్తుందని, మెజారిటీ సర్వేలు తేల్చాయి.

*ప్రముఖ ఇంగ్లీష్‌ ఛానెల్‌ ఇండియా టుడే, యాక్సిస్ మై నేషన్‌‌ సంస్థతో కలిసి ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సంచలన విజయం సాధిస్తుందని అంచనా వేసింది.

*ఇండియా టుడే- యాక్సిస్‌ మై నేషన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 130 నుంచి 135 సీట్లు వస్తాయి. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కనున్నాయి. జనసేనకు ఒకటిరావొచ్చు.సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌, సీపీఎస్‌ కూడా వైసీపీదే విజయమని చెప్పాయి. వైఎస్సార్‌సీపీకి 130 నుంచి 133 వరకు సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు దక్కే అవకాశముందని తెలిపింది. జనసేన పార్టీకి సున్నా నుంచి ఒక స్థానం రావొచ్చన్నది సర్వే.

* ఇక తెలంగాణలో టీఆర్ఎస్‌దే విజయమని కరెక్టుగా అంచనా వేసిన మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌పోల్‌ కూడా జగన్‌ పార్టీకే ఓటేసింది. అధికారంలో ఉన్న టీడీపీకి 13 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 58 రావచ్చని అంచనా వేసింది. వైసీపీకి 17 ప్లస్ ఆర్ మైనస్‌ అత్యధికంగా 98 స్థానాలొస్తాయని తెలిపింది. అంటే మెజారిటీకి మించి సీట్లు సాధిస్తుందని, ఏపీలో కాబోయే సీఎం జగన్‌గా భావిస్తోంది మిషన్‌ చాణక్య. ఇక జనసేనకు ఏడు సీట్లు రావొచ్చన్నది అంచనా. ఇతరులు ఒకస్థానంలో గెలుస్తారన్నది మిషన్ చాణక్య భావన.

*ఆరా సర్వేలో వైసీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.

*పీపుల్‌ పల్స్‌ సర్వేలోనూ వైసీీపీ ప్రభంజనమే మోగింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 112 సీట్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించవచ్చని సర్వే ద్వారా అంచనా వేసింది. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ 59 స్థానాల్లో గెలుపొందే ఛాన్సుందని భావించింది. పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన 4 స్థానాల్లో విజయం సాధించవచ్చునని తెలిపింది. అలాగే వైసీీపీ 18 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశముందని, టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని తెలిపింది.

* వీడీపీఏ అసోసియేట్స్ కూడా జగన్‌ పార్టీ ప్రభంజనం తప్పదని అంచనా వేసింది. ఆ సంస్థ వివరాలు ప్రకారం, TDP 54-64, YCP 111-121, JSP 4 సీట్లు. ఇలా మెజారిటీ సంస్థల ఎగ్జిట్‌పోల్స్ మొత్తం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అంచనా వేస్తుంటే, లగడపాటి రాజగోపాల్‌ సర్వే మాత్రం, వాటికి పూర్తి విరుద్దంగా ఉంది. మరోసారి ఏపీ జనం చంద్రబాబుకు పట్టంకట్టారని, మళ్లీ టీడీపీ ప్రభుత్వమే రాబోతోందని చెప్పారు లగడపాటి. ఆయన టీం సర్వే ప్రకారం, తెలుగుదేశం పార్టీకి 90 నుంచి 110 సీట్లు రాబోతున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌‌కు 65-79 స్థానాలు మాత్రమే వస్తాయి. జనసేనకు రాకపోతే ఒక్కస్థానమూ రాకపోవచ్చని లేదంటే 2 నుంచి మూడు స్థానాల వరకూ రావొచ్చన్నది లగడపాటి రాజగోపాల్ అంచనా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే పూర్తిగా విఫలమైన నేపథ్యంలో, ఈసారి మాత్రం కచ్చితంగా కరెక్ట్‌ అవుతుందన్న భావనలో ఉన్నారు లగడపాటి.

* ఇక INSS అనే సర్వే సంస్థ కూడా ఏపీలో మరోసారి టీడీపీ సర్కారేనని అంచనా వేసింది. ఈ ఆర్గనైజేషన్ ఎగ్జిట్‌ పోల్‌ ప్రకారం, తెలుగుదేశంకి 118 సీట్లు రాబోతున్నాయి. వైసీపీకి కేవలం 52 స్థానాలు మాత్రమే వస్తాయి. ఇక పవన్‌ కల్యాణ్‌ పార్టీకి వచ్చే స్థానాలు ఐదు మాత్రమే. ఇలా రకరకాల ఛానెల్స్, సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాన్ని అంచనా వేశాయి. మెజారిటీ సంస్థల సర్వే ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో సీఎం సింహాసనాన్ని అధీష్టించబోతున్నారు జగన్‌. అయితే ఇవన్నీ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు మాత్రమే. గతంలో చాలా ఎగ్జిట్‌ పోల్స్ బొక్క బోర్లాపడ్డాయి. ఈనెల 23న రాబోతున్న ఫలితాలే, అసలైన ఫలితాలు. చూడాలి, ఈసారైనా ఎగ్జిట్‌పోల్స్‌, వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయో, దూరంగానే ఉంటాయో.


Show Full Article
Print Article
Next Story
More Stories