Top
logo

ప్రతి పిల్లవాడికి ఏడాదికి రూ. 15 వేలు సాయం: జగన్‌

ప్రతి పిల్లవాడికి ఏడాదికి రూ. 15 వేలు సాయం: జగన్‌
X
Highlights

ఈ నెలాఖరులోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. కడపలో జరిగిన...

ఈ నెలాఖరులోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. కడపలో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారని, దిగజారుడు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే రోజుకో స్కీం ప్రకటిస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించినవారు లేరన్నారు. ఎన్నికలు వస్తుండడంతో చంద్రబాబు డబ్బు పంపిణీ చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

వైసీపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని జగన్‌ ప్రకటించారు. అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే ప్రతి పిల్లవాడికి ఏడాదికి 15 వేలు సాయం అందిస్తామన్నారు. ప్రతి మే నెలలో రైతులకు 12వేల 500 ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

గ్రామాల్లో ఓటర్‌ లిస్టు నుంచి వైసీపీ సానుభూతిపరుల పేర్లను పేర్లు తొలగిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. ఓటర్‌ లిస్ట్‌లో పేరు లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పదేళ్లుగా ఎన్ని కష్టాలు పడ్డారో తనకు తెలుసని వైసీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతాయని జగన్‌ హామీ ఇచ్చారు.

చంద్రబాబు ప్రజలకు మూడు సినిమాలు చూపించారని విమర్శించారు. 5 వేల కోట్లు అంటూ రైతుల చెవిలో పువ్వులు పెట్టారన్నారు. రాజధాని పేరుతో భూములను తీసుకున్నారని చెప్పారు. రాజధాని ఎక్కడా అంటే బాహుబలి సినిమా చూపిస్తారని జగన్ ఎద్దేవా చేశారు.

Next Story