Top
logo

వారసులొస్తున్నారు...జాగ్రత్త!

వారసులొస్తున్నారు...జాగ్రత్త!
Highlights

నవ్యాంధ్రప్రదేశ్ లో నవతరం నాయకుల రాజకీయానికి రంగం సిద్ధమయ్యింది. నిన్నటితరం నాయకుల రిటైర్మెంట్, ఆరోగ్యసమస్యలు, ...

నవ్యాంధ్రప్రదేశ్ లో నవతరం నాయకుల రాజకీయానికి రంగం సిద్ధమయ్యింది. నిన్నటితరం నాయకుల రిటైర్మెంట్, ఆరోగ్యసమస్యలు, మరణం వంటి కారణాలతో వారివారి వారసులు శాసనసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అధికార టీడీపీలో వారసత్వరాజకీయాలు పతకాస్థాయికి చేరాయి. రాజకీయాలలోకి రావాలంటే రాజకీయనాయకులకు వారసులుగా ఉండటమే అతిపెద్ద అర్హతగా మారింది.

డాక్టర్ల కొడుకులు డాక్టర్లు, యాక్టర్ల కొడుకులు యాక్టర్లు కావడం కష్టమేమో కానీ రాజకీయనాయకుల వారసులు మాత్రం ఏమంత కష్టం లేకుండానే రాజకీయవారసులు కాగలరని ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ శాసనసభ ఎన్నికల కోసం ప్రకటించిన జాబితా చెప్పకనే చెబుతోంది.

గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీ ద్వారా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులుగా పనిచేసిన సీనియర్, వెటరన్ నాయకులు వివిధ కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించటమే కాదు తమ వారసులుగా కుమార్తెలు, కుమారులను రంగంలోకి దించుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఆయన రాజకీయవారసుడిగా రంగంలోకి దిగిన జగన్మోహనరెడ్డి గత ఐదేళ్లుగా ప్రతిపక్షనాయకుడుగా ఉంటూ వచ్చారు. అంతేకాదు ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ముఖ్యమంత్రి కావటానికి తహతహలాడుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 స్థానాలకు అధికార టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సీనియర్ నాయకుల వారసుల పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అనారోగ్యం, రిటైర్మెంట్, మరణం లాంటి కారణాలతో వివిధ నాయకుల కుమారులు, కుమార్తెలు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్రలోని పలాస నుంచి రాయలసీమలోని డోన్ నియోజకవర్గం వరకూ కృష్ణాజిల్లా గుడివాడ నుంచి అనంతపురం జిల్లా వరకూ వారసులే నవతరం అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ వారసురాలిగా ఆయన కుమార్తె గౌతు శిరీష పోటీకి దిగుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి 81 ఏళ్ల వయసులో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోడంతో ఆయన కుమారుడు శ్యామ్ డోన్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. మరోవైపు చీపురుపల్లి స్థానంలో మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున బరిలోకి దిగుతున్నారు.

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డికి బదులుగా శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ ను ఎంపిక చేశారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత తన వారసుడుగా కుమారుడు శ్రీరామ్ ను అనంతపురం జిల్లా రాప్తాడు స్థానం నుంచి పోటీకి దించుతున్నారు. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణంతో ఆయన కుమారుడు గాలి భాను ప్రకాశ్ కు నగరి సీటును పార్టీ అధిష్టానం కేటాయించింది.

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ టీడీపీ తరపున తొలిసారిగా పోటీకి దిగుతున్నారు. ఇక విజయనగరంలో కేంద్ర మాజీమంత్రి అశోక గజపతిరాజు వారసురాలిగా ఆయన కుమార్తె ఆదితి గజపతి సమరానికి సై అంటున్నారు. కేంద్రమాజీ మంత్రి యర్రంనాయుడు కుమార్తె భవానీ రాజమండ్రి అర్బన్ నుంచి బరిలో నిలిచారు. అంతేకాదు విజయవాడ వెస్ట్ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాటూమ్ పోటీకి సిద్ధమయ్యారు.

అనంతపురం రాజకీయాలకే మరోపేరుగా నిలిచే జెసీ బ్రదర్స్ ఇద్దరూ తమతమ కుమారులకు సైతం సీట్లు ఇప్పించుకోగలిగారు. జెసీ ప్రభాకర రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డికి అసెంబ్లీ సీటు, ఎంపీ జెసీ దివాకర రెడ్డి తన తనయుడు పవన్ కుమార్ రెడ్డికి లోక్ సభ సీటు ఖాయం చేసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా తన వారసుడు లోకేశ్ ను మంగళగిరి స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించుతున్నారు. మొత్తం మీద ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ తరపునే ఎక్కువమంది రాజకీయనాయకుల వారసులు అరంగేట్రం చేయనుండటం ప్రస్తుత ఎన్నికలకే హైలైట్ గా మిగిలిపోతుంది.


Next Story


లైవ్ టీవి