అనంతవిజయాలు సాధించిన టీడీపీ కోటలో వైసీపీ పాగా వేస్తుందా?

అనంతవిజయాలు సాధించిన టీడీపీ కోటలో వైసీపీ పాగా వేస్తుందా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటగా పేరుపొందిన అనంతపురం జిల్లా పార్లమెంట్, లోక్ సభ నియోజకవర్గాలలో రసవత్తరపోరుకు రంగం సిద్ధమయ్యింది. ఓవైపు అధికార...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటగా పేరుపొందిన అనంతపురం జిల్లా పార్లమెంట్, లోక్ సభ నియోజకవర్గాలలో రసవత్తరపోరుకు రంగం సిద్ధమయ్యింది. ఓవైపు అధికార టీడీపీ తన జోరు కొనసాగించాలన్న ధీమాతో ఉంటే మరోవైపు సైకిల్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న పట్టుదలతో వైసీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. అనంతపురం విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా. కరువు రాజ్యమేలుతున్నా గొప్పగొప్ప రాజకీయనాయకులను అందించిన జిల్లా భారత రాష్ట్రపతి హోదాలో ఈ జిల్లాకు నీలం సంజీవరెడ్డి అంతర్జాతీయంగా గుర్తింపు సాధించి పెట్టారు. అంతేకాదు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీరామారావు హిందూపురం నుంచి గెలిచి సీఎం పదవి చేపట్టారు.

కమ్యూనిస్టు యోధులు తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్‌తో పాటు కాంగ్రెస్‌ పాలనలో అరాచకాలు సాగుతున్న కాలంలో బాధితులకు అండగా నిలిచిన అప్పటి మంత్రి పరిటాల రవీంద్ర అనంతపురం నుంచి వచ్చిన యోధులే. టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో సైతం సైకిల్ గుర్తు హవానే కొనసాగింది. ఐదేళ్ల క్రితం ముగిసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలిఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 12 చో ట్ల టీడీపీ అభ్యర్థులే విజయాలు సాధించారు. రెండు సీట్లను మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుచుకోగలిగారు.

ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. మరోసారి మెజారిటీ స్థానాలు తమకే దక్కుతాయన్న ధీమాతో టీడీపీ ఉంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం అత్యధిక సీట్లు నెగ్గి సైకిల్ పరుగుకు బ్రేక్ వేయాలన్న పట్టుదలతో ఉంది.హిందూపురం సిటింగ్ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ మరోసారి సమరానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర సైతం హిందూపురంలోని వివిధ వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాప్తాడు స్థానం నుంచి పరిటాల సునీత స్థానంలో ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీకి దిగుతున్నారు.

అనంతపురం జిల్లా ఓటర్లలో బీసీల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో ఏ నియోజకవర్గంలోనైనా గెలుపుఓటములను నిర్ణయించే శక్తిగా ఎదిగారు. అయితే ప్రస్తుత ఎన్నికల లోక్ సభ బరి నుంచి జెసీ దివాకర్ రెడ్డి, అసెంబ్లీ స్థానం నుంచి జెసీ ప్రభాకర రెడ్డి తప్పుకొని తమ కుమారులకు సీట్లు ఇప్పించుకోగలిగారు. అనంతపురం నుంచి టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి, హిందూపురం పార్లమెంటు స్థానానికి సిట్టింగ్‌ ఎంపీ నిమ్మల కిష్టప్ప పోటీలో ఉన్నారు.

మరోవైపు వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్య, హిందూపురం నుంచి మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌ పోటీకి దిగుతున్నారు. జనసేన తరఫున సీపీఐ అభ్యర్థి జగదీశ్ బరిలో నిలిచారు. జనసేన కేవలం తన ఉనికిని చాటుకోడానికి మాత్రమే పోటీకి దిగడంతో ప్రధానసమరం టీడీపీ, వైసీపీల మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనంతవిజయాలు సాధించిన టీడీపీ కోటలో ప్రతిపక్ష వైసీపీ పాగా వేస్తుందో? లేదో తెలుసుకోవాలంటే కొద్దిరోజులపాటు వేచిచూడక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories