Top
logo

రాజంపేటలో రాజెవరు...మేడా మల్లిఖార్జున్‌ రెడ్డి...

రాజంపేటలో రాజెవరు...మేడా మల్లిఖార్జున్‌ రెడ్డి...
X
Highlights

ఒకరు బాగా డబ్బూ పరపతి ఉన్న నేత మరొకరు ఎంతో రాజకీయ అనుభవమున్న కింగ్ మేకర్ ఒకరు ఎన్నికల ముందు పార్టీ మారి మరో...

ఒకరు బాగా డబ్బూ పరపతి ఉన్న నేత మరొకరు ఎంతో రాజకీయ అనుభవమున్న కింగ్ మేకర్ ఒకరు ఎన్నికల ముందు పార్టీ మారి మరో పార్టీ టికెట్ దక్కించుకుంటే మరొకరు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి టికెట్ పొందారు ఇలా టికెట్లు దక్కించుకున్న ఇద్దరూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హోరాహోరిగా తలపడ్డారు. అభ్యర్ధులే కాదు పార్టీలు సైతం అంతే మోస్ట్ ప్రెస్టీజియస్‌గా ఆ సెగ్మెంట్‌ను తీసుకున్నాయి. బాబు, జగన్‌లు స్పెషల్ స్ట్రాటజీలకు పదునుపెట్టారు. పోలింగ్ కూడా అంతే ఉత్కంఠగా జరిగింది మరి ఇంతగా పోరాడిన పార్టీలు, ఒకవేళ ఫలితం తారుమారైతే పరిస్థితి ఏంటి ఇంతకీ ఏదా నియోజకవర్గం.

రాజంపేట. కాంగ్రెస్‌కు కంచుకోట. కడప జిల్లాలో దివంగత వైఎస్ఆర్ ఛరిస్మా ఉన్న మరో ముఖ్య నియోజకవర్గం కూడా. అందుకే ఇక్కడ కాంగ్రెస్ వరుస విజయాలు నమోదు చేసింది. అయితే టిడిపి ఆవిర్బావంతో కొంత మార్పు వచ్చినా, తాత్కాలిక అవసరాల కోసం అభ్యర్ధులను మార్చుతుండటంతో పట్టు సాధించలేక చతికిలపడుతోంది టీడీపీ. కానీ గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచినా, ఇక్కడ మాత్రం తెలుగుదేశం గెలుపుతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఐదేళ్లు కూడా దాటకముందే మళ్లీ అవే మార్పులు చేర్పులు ఇటీవల చోటు చేసుకోవడంతో ఈ ఎన్నికల్లోను ఇక్కడి రాజకీయాలు చర్చనీయాంశంగానే మారాయి.

రాజంపేట నియోజకవర్గం అంటేనే అందరికి గుర్తుకు వచ్చేది ఒకటి తాళ్లపాక అన్నమాచార్యుడు. రెండు ఒంటిమిట్ట కోదండరాముడు. అయితే ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగాను చాలానే ప్రాధాన్యతను సంతరించుకుంది రాజంపేట. ఈ నియోజకవర్గంలో రాజంపేటతో పాటు నందలూరు, ఒం.టిమిట్ట, సిద్దవటం, వీరబల్లి, సుండుపల్లె మండలాలు ఉండగా, అత్యధికంగా ఎస్సీ, బలిజలు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లున్నాయి. రాజంపేట సెగ్మెంట్‌ 1955లో ఆవిర్బవించగా, ఇప్పటి వరకు ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 7సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపొందితే, 4 సార్లు టిడిపి, రెండుసార్లు ఇండిపెండెంట్లు, ఒక సారి వైసీపీ గెలుపొందింది.

రాజంపేట నుంచి 2014లో గెలుపొందిన మేడా మల్లికార్జునరెడ్డిని ఆ పార్టీ ప్రభుత్వ విప్ నియమించింది. అనంతరం నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ఆయన తొలి నుంచి తనవంతు ప్రయత్నాలు సాగిస్తునే వచ్చారు. విభజన అనంతరం రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, శ్రీరామ నవమి వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్నది అప్పట్లో వివాదాస్పదం కాగా, మేడా పట్టుబట్టి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి అధికారిక హోదా వచ్చేలా చేసి, మెప్పు పొందారు. అయితే, ప్రభుత్వంలో ఆ రేంజ్‌లో చక్రంతిప్పిన మేడా, కరెక్టుగా ఎన్నికల సమయానికి కండువా మార్చారు. సైకిల్ దిగి ఫ్యాన్‌ చెంతకు చేరారు. దీంతో రాజంపేటలో సమీకరణలు మారాయి. మేడా రాకను అకేపాటి అమర్ నాథరెడ్డి తీవ్రంగానే వ్యతిరేకించారు. అయితే, జగన్‌ స్వయంగా రంగంలోకి దిగి అకేపాటిని శాంతపరిచారు. దీంతో పార్టీలో నేతల్లో ఉన్న అసమ్మతిని మేడా తన చాకచక్యంతో దారికితెచ్చుకున్నారు.

కానీ మేడాకు ఇన్ని అనుకూలతలున్నా, అందరిలాగే పలు ప్రతికూలతలు లేకపోలేదు. వైసీపీలో చేరిన మేడాకు, అందరూ సహకరించినట్లు కనిపిస్తున్నా కిందిస్థాయి క్యాడర్ మాత్రం అంతగా సపోర్ట్ చేయలేదన్నది లోకల్‌ టాక్. అయితే అంతా సవ్యంగా జరిగిందని, ఈ ఎన్నికల్లోను తనదే గెలుపంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు మేడా మల్లికార్జునరెడ్డి.

ఇక తెలుగుదేశం విషయానికి వస్తే, ప్రతి ఎన్నికల్లో ఇక్కడ తాత్కాలిక అవసరం తీరేలా అభ్యర్దులను ఎంపిక చేస్తుండటం పార్టీకి పట్టులేకుండాపోయింది. బలమైన క్యాడర్ ఉండటం వల్లే ఇక్కడ పార్టీ బలంగానే ఉందన్న అబిప్రాయం ఇది వరకు ఎన్నికల్లోనే రుజువయ్యింది. కానీ ఈసారి మాత్రం పార్టీ ఫిరాయించిన మేడా మల్లికార్జునరెడ్డిని ఓడించే లక్ష్యంతో కసితో వ్యూహాలు వేసినా, అంతగా సక్సెస్ అయినట్టు కనిపించడ లేదన్నది స్థానికుల మాట. బలమైన అభ్యర్ధిని రంగంలోకి దింపాలన్న పట్టుదలతో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు టికెట్ ఆశించినా, మాజీ ఎమ్మెల్సీ బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయులును టిడిపి బరిలోకి దించింది. ఈయన రైల్వేకోడూరు నియోజకవర్గంలో కింగ్ మేకర్‌గా చలామణి అయ్యారు. అయితే రాజంపేటలో మాత్రం స్థానికేతరుడిగా ముద్రపడ్డారు. అయితే కేవలం తన సామాజికవర్గం అధిక సంఖ్యలో ఉండటమే చెంగల్రాయుడికి కలిసొచ్చే అంశం.

ఇక జనసేన అభ్యర్ధి పత్తిపాటి కుసుమకుమారి పోటీ చేసినా, ఆమె పోటీ ఇక్కడ నామమాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి టీడీపీ, వైసీపీ మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన రాజంపేటలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అసలైన తీర్పు మాత్రం మే 23నే తేలిపోతుంది. చూడాలి రాజంపేట రాజెవరో?

Next Story