Top
logo

పాణ్యంలో జెండాలు మార్చారు..మరి ఫలితాన్ని మార్చే నేత ఎవరు?

పాణ్యంలో జెండాలు మార్చారు..మరి ఫలితాన్ని మార్చే నేత ఎవరు?
Highlights

కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం, సెన్సేషన్‌ సెగ్మెంట్ పాణ్యం. పాణ్యాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన...

కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం, సెన్సేషన్‌ సెగ్మెంట్ పాణ్యం. పాణ్యాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పడ్డ శ్రమ అంతాఇంతా కాదు. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఈసారి ఎలాగైనా గెలవాలని పోరాడారు. 2014లో వైసీపీ తరఫున పోటీచేసి విజయం సాధించిన గౌరు కుటుంబం, ఈసారి ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో అధికార పార్టీ నుంచి టికెట్ సంపాదించి బరిలో నిలిచారు. నువ్వా నేనా అన్నట్టుగా టగ్‌ ఆఫ్‌ వార్‌గా సాగిన పాణ్యంలో విజయం ఎవరిది?

రెండు జాతీయ రహదారులను కలుపుకొని, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గంలో, అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జిల్లాలో అత్యధిక ఓటర్లన్న ఈ నియోజకవర్గం, 1967లో ఏర్పడింది. ముందుగా 5 మండలలాతో పాణ్యం నియోజకవర్గం ఆవిర్భవించింది. పాణ్యం, బనగానపల్లె, బేతంచెర్ల, వెల్దుర్తి మండలాలతో పాటు డోన్ నియోజకవర్గంలోని 7 గ్రామాలు ఉండేవి. అయితే నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో పాణ్యం రూపురేఖలు మరిపోయాయి. పాణ్యం, ఓర్వకల్లు, గడివేముల, కల్లూరు మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది.

మారిన మండలాలతో పాటు రాజకీయ సమీకరణలు కూడా మారిపోయాయి.ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. 5 పర్యాయాలు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుపొందారు. పాణ్యం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 1993లో ఉప ఎన్నికలలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కల్లూరు మండలం కీలకం కాబోతోంది. అత్యధిక ఓటర్లున్న ఈ మండలం కర్నూల్ నగర శివార్లలో వుండటమే అందుకు కారణం. అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో ఈ ఓటర్లే కీలకం.

ఇప్పటి వరకు పాణ్యంలో 12 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌ 7 సార్లు, టిడిపి 2 సార్లు, ఇండిపెండెంట్‌, జనతా, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ అసెంబ్లీ పరిధిలో పాణ్యం, కల్లూరు. ఓర్వకల్, గడివేముల మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,88,031. ఇందులో మహిళలు 1,07,176, పురుషులు 1,07,120 ఇతరులు 18. పోలింగ్ శాతం 74.41. 2014 కంటే దాదాపు మూడు శాతం ఓటింగ్ పెరిగింది.

ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కాటసానికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నియోజకవర్గంలో అన్ని మండలాల మీద పట్టు ఉండటం, ప్రజా సమస్యలపై తనదైన శైలితో పోరాటాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండటం, ఎంత కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా క్యాడర్‌కు అండగా ఉండటం, కాటసానికి కలిసొచ్చాయని, ఓట్ల రూపంలో వెల్లువెత్తాయని, ఆయన అనుచరుల ధీమా. దీనికితోడు వైసీపీ అధినేత జగన్‌ నవరత్నాలు కూడా సునాయాస విజయాన్నిస్తాయని నమ్ముతున్నారు.

టిడిపి అభ్యర్థిగా చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న గౌరు చరితారెడ్డి విజయం తమదేనన్న ధీమాను ఎక్కడా తొణకనీయడం లేదు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గౌరు చరితా రెడ్డి, చివరి నిమిషంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో కాటసానికి టికెట్‌ కన్‌ఫామ్‌ కావడంతో, విధిలేక ఆమె సైకిలెక్కారని గౌరు అనుచరుల ఆవేదన. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న గౌరు కుటుంబానికి వైసీపీలో అన్యాయం జరిగిందన్న సానుభూతి, సంక్షేమ పథకాలు, గడివేముల మండలంలో కాటసానికి ఉన్న వ్యతిరేకత కలిసొస్తాయని భావిస్తున్నారు. దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న బైరెడ్డి సహకారం, టిడిపిలో మరో సీనియర్ నేత ఏరాసు ప్రతాపరెడ్డి మద్దతు చరితారెడ్డికి విజయం సమకూర్చుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన ఓటింగ్ కూడా తనకు అనుకూలంగా మారిందని చరిత భావిస్తున్నారు.

గౌరు చరితారెడ్డి ప్రత్యర్థి కానంతవరకు కాటసాని రాంభూపాల్ రెడ్డికి విజయం నల్లేరుపై నడక మాదిరిగానే వుండేది. కానీ గౌరవ కుటుంబం ఊహించని విధంగా చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని టిడిపి తరఫున బరిలోకి దిగడంతో, ఒక్కసారిగా పోటీ రసవత్తరంగా మారింది. గెలుపు నీదా నాదా అంటూ ఇద్దరూ ప్రచారాన్ని హోరెత్తించారు.

Next Story