పాలెగాళ్ల కోటలో ఎవరిది పైచేయి?

పాలెగాళ్ల కోటలో ఎవరిది పైచేయి?
x
Highlights

పాలెగాళ్ళ పురిటిగడ్డ పత్తికొండపై ఈసారి అన్ని పార్టీల చూపు పడింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న పత్తికొండను, ఈసారైనా చేజిక్కించుకోవాలని వ్యూహాలకు...

పాలెగాళ్ళ పురిటిగడ్డ పత్తికొండపై ఈసారి అన్ని పార్టీల చూపు పడింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న పత్తికొండను, ఈసారైనా చేజిక్కించుకోవాలని వ్యూహాలకు పదునుపెట్టింది ప్రతిపక్షం. మరి కేఈ వారసుడు శ్యాంకు జనం పట్టం కట్టారా. లేదంటే వైసీపీ అభ్యర్థి శ్రీదేవిపై సానుభూతి ఓట్ల వర్షం కురిపించారా? పాలెగాళ్ల కోటలో ఎవరిది పైచేయి? కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గం. ఫ్యాక్షన్‌ రాజకీయాలు నిత్యం భగ్గుమనే సెగ్మెంట్. కొంతకాలం క్రితం జరిగిన వైసీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యే అందుకు నిదర్శనం. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఈ ఫ్యాక్షన్ రాజకీయమే బుసలుకొట్టింది. 1955లో ఏర్పడింది పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం. 1983 వరకు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఒక్కసారి మాత్రం, అంటే 1967లో CPI అభ్యర్థి గెలిచారు. 1985 నుంచి 2014 వరకు, టీడీపీదే హవా. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎస్వీ సుబ్బారెడ్డి హ్యాట్రిక్ కొట్టారు. పత్తికొండలో తిరుగులేని నేతగా ఎదిగారు సుబ్బారెడ్డి.

కేఈ, ఎస్వీ కుటుంబాల మధ్య ప్రచ్చన్న యుద్ధం ఈనాటిది కాదు. 2008 TDP అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌కు తెలుగుదేశం టికెట్ కేటాయించడంతో ఎస్వీ కుటుంబం కాంగ్రెస్‌లోకి వెళ్లింది. 2008 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా కేఈ ప్రభాకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేశారు. అయితే, తెలుగుదేశానికే జనం పట్టంకట్టారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా KE కృష్ణమూర్తి పోటీ చేశారు. YSR అభ్యర్థిగా కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకులపాడు నారాయణరెడ్డి పోటీలోకి దిగారు. ప్రధానంగా మూడు పార్టీల మధ్య త్రిముఖపోటీ జరిగింది. అయితే ఈసారి కూడా కేఈ కుటుంబానిదే పైచేయి అయ్యింది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన చెరుకులపాడు నారాయణరెడ్డికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థులలో అత్యధిక ఓట్లు వచ్చిన రెండవ అభ్యర్థిగా నిలిచారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు చెరుకులపాడు నారాయణరెడ్డి. అయితే, 2017లో కార్యకర్త వివాహానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో, చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు. తరువాత YSR పార్టి పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జిగా చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటీ శ్రీదేవిని ప్రకటించారు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో కేఈ కుటుంబానికి, నారాయణరెడ్డి భార్యకు హోరాహోరీగా పోటీ నడిచింది.

ప్రజాసంకల్ప యాత్ర పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా, పత్తికొండ వైసీపీ అభ్యర్థిగా కంగాటీ శ్రీదేవిని ప్రకటించారు జగన్. రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రకటించిన అభ్యర్థి శ్రీదేవినే. తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి ఆశయాలను నెరవేర్చడం కోసం తనకు అవకాశం ఇవ్వాలంటూ ప్రజల ముందుకు వెళ్లారు శ్రీదేవి. జగన్‌పై అభిమానం, మహిళా ఓటర్ల ఆదరణ, సానుభూతి ఓట్లతో తన విజయం తథ్యమన్న దీమాలో ఉన్నారు శ్రీదేవి.

ఇక టీడీపీ విషయానికి వస్తే పత్తికొండ టికెట్‌ను పట్టుబట్టి తన కొడుకు కేఈ శ్యాంకు ఇప్పించుకోవడంలో చివరి వరకూ పోరాడి సాధించారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. తన రాజకీయ వారసుడిగా శ్యాంను ప్రకటించిన కేఈ, పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా నియమించడంలోనూ చక్రంతిప్పారు. దీంతో కేఈ శ్యాం కుమార్ గ్రామాల్లో తిరుగుతూ సెగ్మెంట్‌లో పట్టు సాధించారు. పత్తికొండ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అత్యధికం. ఇక్కడ ఎక్కువగా బోయ, కురువ, తరువాత ఎస్సీ సామాజికవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎటువైపు ఉంటారో, ఆపార్టీ విజయ అవకాశాలు పుష్కలం. అందుకే రెండు పార్టీలూ బీసీ ఓటర్లపై గురిపెట్టాయి.

పత్తికొండ నియోజకవర్గంలోని మిగిలిన పార్టీల అభ్యర్థులూ రంగంలో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీల మధ్యే. కేఈ శ్యాం కుమార్, కంగాటి శ్రీదేవి మధ్యనే నువ్వానేనా అన్నంత పోరు సాగింది. అయితే, రెండు పార్టీల అభ్యర్థులకూ కొన్ని సవాళ్లున్నాయి. తెలుగుదేశంలో నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. బహిరంగ సభల సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. అటు వైసీపీ అభ్యర్థి శ్రీదేవికి సైతం పార్టీ నుంచి పూర్తి సహకారంలేదు. అయితే, పోటీ మాత్రం వీరిమధ్యే ఉంది. మరి జనం సైకిల్‌కు ఓటేశారో, ఫ్యాన్‌కు తిరుగులేదని మెజారిటీ కట్టబెట్టారో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగక తప్పదు.


Show Full Article
Print Article
Next Story
More Stories