Top
logo

అమరావతి రైతు చావుకు కారణమెవరు?

అమరావతి రైతు చావుకు కారణమెవరు?
Highlights

ఆరుగాలం కష్టపడి సాగు చేసుకుంటున్న పంటను నాశనం చేయవద్దంటూ కోరడమే ఆ రైతు పాలిట శాపమైంది. తన బతుకు తెరువు దెబ్బ...

ఆరుగాలం కష్టపడి సాగు చేసుకుంటున్న పంటను నాశనం చేయవద్దంటూ కోరడమే ఆ రైతు పాలిట శాపమైంది. తన బతుకు తెరువు దెబ్బ తీయవద్దంటూ కోరడమే ఆ అన్నదాత ప్రాణాలను కబలించింది. అధికారం అండతో పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఆ కర్షకుడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెంలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

గ్రామానికి చెందిన పిట్ల కోటయ్య 14 ఎకరాలు కౌలుకు తీసుకుని బొప్పాయి, మునగ, కనకాంబరం సాగు చేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో సోమవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా కోటయ్య భూమిని పోలీసులు వినియోగించుకున్నారు. సీఎం సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యంతో పాటు పోలీసులు ఉండేందుకు టెంట్‌లు వేసుకున్నారు. అయితే చేతికొచ్చిన పంటను ఇష్టానుసారం నాశనం చేస్తున్నారంటూ రైతు కోటయ్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీస సమాచారం ఇవ్వకుండా నష్ట పరిహారం మంజూరు చేయకుండా పోలంకు ఎలా వస్తారంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేందిన పోలీసులు కోటయ్యపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన కోటయ్య అక్కడే స్పహతప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న కుమారుడు, అతని పాలేరు గాయపడిన కోటయ్యను తరలించేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. విషయం వెలుగు చూస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు తామే అక్కడి నుంచి చేతుల మీద ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తనను కొడుతున్నారంటూ కోటయ్య గ్రామంలోని కొందరు పెద్దలకు ఫోన్ చేసినట్టు స్ధానికులు చెబుతున్నారు . పొలం దగ్గర పోలీసులతో జరిగిన గొడవల్లోనే కొటయ్య ప్రాణాలు కోల్పోయాడంటూ చెబుతున్నారు. దీనిపై కోటయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి సెటిల్ చేసుకుంటామంటూ ఆర్‌డీవో, డీఎస్‌పీ తమకు చెప్పారంటూ గ్రామ పెద్దలు అంటున్నారు .

ఈ విషయం ఆనోట ఈ నోట తెలిసి వివాదం కావడం విపక్షాలకు చెందిన నేతలు గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఈ అంశంపై పోలీసులు వివరణ ఇచ్చారు. కుటుంబ కలహాలతోనే పురుగుల మందు తాగి కొటయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోటయ్య కుటుంబ సభ‌్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు ఎవరితో కలహాలు లేవని పోలీసుల వల్లే తాము కుటుంబ పెద్దను కోల్పోయామంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు సైతం పోలీసుల తీరును తప్పుబడుతున్నారు.

ఇదే సమయంలో కోటయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. అయితే రైతు కోటయ్య మృతికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు, వివిధ పక్షాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన పోలీసులు కోటయ్య మృతదేహాన్ని పోస్ట్ ‌మార్టం నిమిత్తం తరలించారు .

మరో వైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నేత జగన్‌తో పాటు వివిధ పార్టీల నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు . చంద్రబాబు సభకోసం అన్నదాత ప్రాణాలను అన్యాయంగా తీసుకున్నారంటూ వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కొండవీడులోని కోటయ్యను కొట్టి అమానుషంగా అక్కడే వదిలేశారని ట్విటర్‌లో ప్రభుత్వంపై విమర‌్శలు గుప్పించారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఏంటి ఈ రాక్షసత్వం అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలతో మరో అన్నదాత ప్రాణాలు కోల్పోయాడంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. 'పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వల్లే ప్రాణాలు కోల్పోయాడంటూ ఆరోపించారు. కేసు విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా ప్రకటిస్తారని కన్నా ప్రశ్నించారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా? అంటూ నిలదీశారు. మీలాంటి దౌర్జన్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం' అంటూ ట్వీట్‌లు చేశారు.


లైవ్ టీవి


Share it
Top