తూర్పు గోదావరి జిల్లా త్రిముఖ పోటీలో గెలిచేదెవరు?

తూర్పు గోదావరి జిల్లా త్రిముఖ పోటీలో గెలిచేదెవరు?
x
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో ఏ రాజకీయ పార్టీ మెజారిటీ స్థానాలు సాధిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నది సెంటిమెంట్. అదేంటో గానీ ప్రతి...

తూర్పు గోదావరి జిల్లాలో ఏ రాజకీయ పార్టీ మెజారిటీ స్థానాలు సాధిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నది సెంటిమెంట్. అదేంటో గానీ ప్రతి ఐదేళ్లకోసారి, ఇది ప్రూవ్‌ అవుతూనే ఉంది. అందుకే తూర్పులో గెలుపు తలుపు తడితే, అధికార మలుపు తమదేనన్న నమ్మకం, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలది. అయితే ఈసారి జనసేన రంగంలోకి దిగడంతో, తూర్పులో సమీకరణాలే మారిపోయాయి. జనసేన ఎన్ని స్థానాలు గెలుస్తుందో, ఏ పార్టీ కొంప ముంచుతోందనన్న భయం, టీడీపీ, వైసీపీలను వణికిస్తోంది. అయితే, జనసేన ఎఫెక్ట్‌ మీకంటే, మీకేనంటూ టీడీపీ, వైసీపీలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. ఇంతకీ తూర్పులో జనసేన తిరుగులేని శక్తిగా అవతరించి, కింగ్‌ మేకర్‌ అవుతుందా...లేదంటే ప్రజారాజ్యం తరహాలోనే తుస్‌మనిపిస్తుందా. తూర్పులో జనసేన ఓట్లను బట్టే, రాష్ట్రంలో ఫలితాలు ఉంటాయా...మరి జనసేన ఎఫెక్ట్‌ ఎవరికి..? తూర్పులో జనసేన పవరెంత?

రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు గల జిల్లా తూర్పు గోదావరి. 19 అసెంబ్లీ స్థానాలున్న తూర్పు గోదావరి జిల్లాలో అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం కూడా తూర్పులోనే తమకు ఎక్కవ స్థానాలు వస్తున్నాయని నియోజకవర్గాల వారీగా బేరీజు వేసుకుంటున్నాయి.సర్వేలు ఎవరికి వారే చేయించుకుంటున్నారు. అందుకే అన్ని పక్షాలు ఎక్కువ దృష్టిని తూర్పు గోదావరిపై పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాన్ ముగ్గురూ కూడా ఎక్కువ సమయం తూర్పు పైనే పెట్టారు. జిల్లాలో త్రిముఖ పోటీ, రసవత్తరంగా సాగింది.

అయితే ఉమ్మడి రాష్ర్టంలో 2009లో మెగాస్టార్‌ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంతో, అప్పట్లోనూ ఇదే త్రిముఖ పోటీ ఏర్పడింది. నాడు కూడా రెండో పర్యాయం ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశం, ప్రజారాజ్యం వల్ల ఓట్లు చీలిపోయి తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో అధికారంలో వున్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ తిరిగి అధికారం దక్కించుకుంది. పదేళ్ల తర్వాత ఇపుడు పవన్‌ కళ్యాణ్‌ పెట్టిన జనసేన వల్ల, ఎవరికి ఓట్ల రూపంలో దెబ్బతగుతుందోనని అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పైకి బాహాటంగా తమ మైనస్‌లు చెప్పుకోకుండా, మనోనిబ్బరంతో తామే గెలుస్తామని ప్రధాన రాజకీయపక్షాలైన తెలుగుదేశం, వైసీపీ అభ్యర్ధులు చెప్పుకుంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన మాత్రం పలు అసెంబ్లీ నియోజకవర్గాలో గట్టిపోటీనిచ్చింది. త్రిముఖ పోటీలో నిలబడింది. జిల్లాలో నాలుగైదు స్థానాలలో నువ్వా నేనా అన్నస్థాయిలో జనసేన పోటీ పడింది. ఇపుడు పవన్‌ పార్టీ, ఎవరి ఓట్లను చీల్చింది అనే అంశం సర్వత్రా చర్చ, ఉత్కంఠను కలిగిస్తోంది. 2014 ఎన్నికల్లో, జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో ఐదు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. తెలుగుదేశం, బిజేపీ, జనసేన పొత్తులో రాజమండ్రి సిటీలో పాగా వేసింది కమలం. జనసేన ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు. తెలుగుదేశం, బిజేపీ తరపున జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎస్‌ విఎస్‌ ఎన్‌ వర్మ ఘనవిజయం సాధించారు. తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు. బిజేపీ, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి తెలుగుదేశం అత్యధికంగా 14 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నట్లయింది.

తర్వాతి రాజకీయ పరిణామాల్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోయారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు నుంచి వరుపు సుబ్బారావు, రంపచోడవరం నుంచి వంత రాజేశ్వరి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి జంప్‌ చేశారు. దీంతో తెలుగుదేశం బలం 17కు చేరింది. అయితే 2009 ఎన్నికలో జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ప్రజారాజ్యం గెల్చుకోగా ఇపుడు, జనసేన ఏ లెవల్లో ఓట్లు, సీట్లను గెలుచుకుంటుందో, ఏ పార్టీ పుట్టి ముంచుతోందన్న విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories