ప్రచారానికి జూనియర్ ఎందుకు రావడం లేదు...పార్టీకే దూరం జరిగాడా?

ప్రచారానికి జూనియర్ ఎందుకు రావడం లేదు...పార్టీకే దూరం జరిగాడా?
x
Highlights

కట్టే కాలేంత వరకు తెలుగుదేశంతోనే ఉంటానన్నాడు. ఊపిరున్నంత వరకూ పసుపు జెండానే తన అజెండా అన్నాడు. తాత స్థాపించిన పార్టీ కోసం ఎందాకైనా వస్తానన్నాడు. మరి...

కట్టే కాలేంత వరకు తెలుగుదేశంతోనే ఉంటానన్నాడు. ఊపిరున్నంత వరకూ పసుపు జెండానే తన అజెండా అన్నాడు. తాత స్థాపించిన పార్టీ కోసం ఎందాకైనా వస్తానన్నాడు. మరి ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరుతున్నా జూనియర్‌ ఎన్టీఆర్‌ మౌనంగా ఎందుకున్నారు స్టార్‌ క్యాంపెయినర్ల కొరత కనిపిస్తున్నా, ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నారు క్యాంపెయిన్‌కే దూరమయ్యారా లేదంటే పార్టీకే దూరం జరిగారా? జూనియర్ ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదు?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ఎప్పుడూ లేనంతగా చావోరేవోగా సాగుతున్నాయి. చతురంగ బలగాలను ప్రధాన పార్టీలు మోహరిస్తున్నాయి. సకల అస్త్రాలనూ సంధిస్తున్నాయి. స్టార్ట్ క్యాంపెయినర్లయిన కుటుంబ సభ్యులను సైతం రంగంలోకి దించుతున్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో జగన్‌ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. షర్మిల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. విజయమ్మ తనదైన శైలిలో కొడుకుకు మద్దతుగా జిల్లాలు తిరుగుతున్నారు. అటు జగన్ భార్య భారతి సైతం పులివెందులలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారు.

తెలుగుదేశంలో స్టార్‌ క్యాంపెయినర్లు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ. బాలయ్యకు స్టేట్‌ మొత్తం క్రేజ్ ఉంది. కానీ ఎందుకనో హిందూపురానికే పరిమితమయ్యారు. సినీ హీరో తార‌క‌ర‌త్న మాత్రం నెల్లూరు జిల్లాలో ప్రచారం చేశారు. 2014 ఎన్నిక‌ల్లో సైతం స్టార్ క్యాంపెయిన‌ర్లు లేకపోయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మోడీ గ్లామ‌ర్ టీడీపీకి అద‌న‌పు బ‌లమైంది. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌ టీడీపీ వ్యతిరేక ప్రచారంలో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి దూసుకురావాల్సిన స్టార్‌ క్యాంపెయినర్లు మాత్రం ముందుకు రావడం లేదు. ముఖ్యంగా మాస్‌ ఫాలోయింగ్ హీరో, తాత పోలికలున్న కథానాయకుడు జూనియర్ ‌ఎన్టీఆర్‌ మాత్రం, ఏపీ ఎన్నికల ప్రచారంవైపు అస్సలు చూడ్డంలేదు. ఇప్పుడదే చర్చనీయాంశంగా మారింది.

2009 ఎన్నిక‌ల స‌మయంలో టీడీపీ త‌ర‌పున జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తాతలా ఖాకీ డ్రస్సు, తలపాగాతో జనాన్ని మైమరపించారు. సమ్మోహన ప్రసంగాలతో అదరగొట్టేశారు. తాత హావభావాలను పలికిస్తూ అదరహో అనిపించారు. కానీ 2014 ఎన్నికల ప్రచారంలో జూనియర్ పాల్గొనలేదు. తాను దూరమయ్యాడో, పార్టీనే దూరం పెట్టిందో తెలీదు కానీ, క్యాంపెయిన్‌కు మాత్రం రాలేదు. అయినా, టీడీపీ అధికారంలోకి వచ్చింది. అదీ వేరే లెక్క. ఎందుకంటే, పవన్‌, స్టార్ క్యాంపెయినర్‌గా తెలుగుదేశానికి ఓట్లు కురిపించారు. కానీ ఇప్పుడు పవన్ దారి వేరు. టీడీపీ మీదే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలాంటి సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా చెలరేగిపోవాల్సిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారన్నది సగటు నందమూరి అభిమానికి, కార్యకర్తలకు బోధపడ్డంలేదు.

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సోద‌రి సుహాసిని ఎన్నిక‌ల్లో నిల‌బ‌డినా కేవ‌లం ఒక లేఖ ద్వారా మాత్రమే మ‌ద్దతు ప్రక‌టించిన జూనియ‌ర్, ప్రచారానికి మాత్రం వెళ్లలేదు. ఇప్పుడు జూనియ‌ర్ తో పాటుగా క‌ళ్యాణ్ రామ్ సైతం ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్దతుగా నిల‌వ‌టం లేదు. దీంతో జూనియ‌ర్ పూర్తిగా టీడీపీకి దూర‌మైనట్లేనా అనే ప్రచారం టీడీపీలో మొద‌లైంది.

గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని అంటే జూనియర్‌కు ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా వారి స్నేహం కొనసాగుతోంది. కనీసం కొడాలికి మద్దతుగా కూడా ట్వీట్ చేయలేదు జూనియర్. ఏ పార్టీలో ఉన్నా, నాని గెలవాలనుకునే జూనియర్, బహిరంగంగా మద్దతు ప్రకటించడం ద్వారా టీడీపీ కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లినట్టవుతుందని భావిస్తూ, సైలెంట్‌గా ఉంటున్నారు. అటు తన మామ నార్నే శ్రీనివాస రావు సైతం, ఈమధ్యనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. అయితే పార్టీ మారడానికి, జూనియర్‌కు ఎలాంటి సంబంధంలేదని, ఈ నిర్ణయం తన వ్యక్తిగతమని నార్నే శ్రీనివాస రావు, చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు.

మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ అధిష్టానం దూరం పెట్టిందా లేదంటే తానే దూరమయ్యాడా అన్న దానిపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. లోకేష్‌కు జూనియ‌ర్ పోటీ కాకూడ‌ద‌న్నది పార్టీ అధినాయ‌క‌త్వ భావ‌న‌గా చాలామంది చెప్పుకుంటున్నారు. అందుకే జూనియర్‌ను పూర్తిగా దూరంపెట్టారన్న ప్రచారం ఉంది. హరికృష్ణ బతికున్న టైంలో, మహానాడు వేదికపై లోకేష్‌ ఫోటో పెట్టడం, జూనియర్‌ ఫోటో పెట్టకపోవడంతో నాడే విభేదాలు బహిర్గతమయ్యాయి. దీనిపై హరికృష్ణ తీవ్రంగా నొచ్చుకున్నారని తెలిసింది. అప్పటి నుంచి తెలుగుదేశం కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ దూరమవుతూ వచ్చారు. ఇప్పుడు హోరాహోరిగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికీ దూరమయ్యారు. కారణాలు ఏవైనా, జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని, సమయం, సందర్భం వచ్చినప్పుడు బహిర్గతం అవుతారన్న చర్చ జరుగుతోంది. అటు లోకేష్‌ను భావి సీఎంగా అభివర్ణించడానికి ఏమాత్రం వెనకాడ్డంలేదు తెలుగుదేశం శ్రేణులు. బహుశా ఇవే పరిణామాల నేపథ్యంలోనే, అటు టీడీపీ అధిష్టానం, ఇటు జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories