ఏపీలో వెల్లువెత్తిన ఓటర్ చైతన్యం

ఏపీలో వెల్లువెత్తిన ఓటర్ చైతన్యం
x
Highlights

ఏపీలో పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఓటింగ్ శాతంపై అధికారులు స్పష్టతనిచ్చారు. నియోజకవర్గాల వారిగా ఓటింగ్ శాతం విడుదల చేసిన ఈసీ గుంటూరు, విశాఖ...

ఏపీలో పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఓటింగ్ శాతంపై అధికారులు స్పష్టతనిచ్చారు. నియోజకవర్గాల వారిగా ఓటింగ్ శాతం విడుదల చేసిన ఈసీ గుంటూరు, విశాఖ జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల పరిధిలో రీ పోలింగ్ అవకాశం ఉండటంతో ఓటింగ్ శాతం ప్రకటించలేదు. మిగిలిన 172 నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలను ఈసీ విడుదల చేసింది.

వెల్లువెత్తిన ఓటర్ చైతన్యంతో ఏపీలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం 79.05 శాతం మేర పోలింగ్ నమోదైంది. జిల్లాల వారిగా లెక్కలు చూస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85.98 శాతం పోలింగ్ నమోదు కాగా శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 75.43 శాతం ఓటింగ్ నమోదైంది. పది నియోజకవర్గాలు కలిగిన శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధికంగా 84.3 శాతం పోలింగ్ నమోదు కాగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో అత్యల్పంగా 70.1 శాతం నమోదైంది. 2014తో పోలిస్తే జిల్లాలో 0.1శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది.

తొమ్మిది నియోజకవర్గాలున్న విజయ నగరం జిల్లాలో నెల్లిమర్లలో ఓటర్ చైతన్యం వెల్లువెత్తింది. ఇక్కడ 87.79 శాతం పోలింగ్ నమోదు కాగా జిల్లా కేంద్రం విజయనగరంలో అత్యల్పంగా 70.88 శాతం నమోదైంది. ఇక 2014 నాటి లెక్కలతో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా 9 శాతం మేర పోలింగ్ పెరిగింది. ఇక ఉత్తరాంధ్రలోని విశాఖలో గాజువాక, నర్సిపట్నంకు సంబంధించిన వివరాలు రాకపోవడంతో జిల్లాలోని పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించలేదు. మొత్తం 16 నియోజకవర్గాలకు గాను యలమంచిలిలో అత్యధికంగా 84.49 శాతం పోలింగ్ నమోదు కాగా పట్టణ ప్రాంతమైన విశాఖ వెస్ట్‌లో 58.19 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.

ఇక ఏపీలో అధికార పార్టీని నిర్ణయించే తూర్పు గోదావరి జిల్లాలో గతంలో పోల్చుకుంటే అర శాతం మేర పోలింగ్ పెరిగింది. జిల్లాలోని 19 నియోజకవర్గాల పరిధిలో ఈ ఏడాది 80.46 శాతం మేర పోలింగ్ నమోదైంది. అత్యధికంగా రాజానగరంలో 87.47 శాతం నమోదుకాగా రాజమండ్రి సిటీలో అత్యల్పంగా 66.34 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గతంతో పోల్చుకుంటే ఓటింగ్ శాతం అర శాతం మేర తగ్గింది. 2014లో 82.87 శాతం పోలింగ్ నమోదుకాగా ఈ సారి 82.36 శాతానికి పరిమితమైంది. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో నిడదవోలులో అత్యధికంగా 87.13 శాతం పోలింగ్ నమోదుకాగా ఏలూరులో 67.59 శాతం మేర మాత్రమే పోలింగ్ నమోదైంది.

ఇక రాజధాని అమరావతి పరిధిలోని కృష్ణా జిల్లాలో పోలింగ్ శాతం స్పల్పంగా పెరిగింది. జిల్లాలోని 16 నియోజకవర్గాల పరిధిలో 89.64 శాతంతో జగ్గయ్యపేట అగ్రస్ధానంలో నిలవగా 65.76 శాతంతో విజయవాడ సెంట్రల్ అట్టడుగు స్ధానంలో నిలిచింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి వివరాలు వెల్లడికాకపోవడంతో జిల్లాలోని పోలింగ్ శాతం ప్రకటించలేదు. 17 నియోజకవర్గాల పరిధిలో 88.23 శాతంతో పెదకూరపాడు అగ్రస్ధానంలో ఉండగా పట్టణ ప్రాంతమైన గుంటూరు వెస్ట్ 65.98 శాతం చివరి స్ధానంలో నిలిచింది.

మండుతున్న ప్రచండ భానుడిని తట్టుకుని ప్రకాశం జిల్లా ఓటర్ సత్తా చాటాడు. జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలో ఓటర్ చైతన్యం వెల్లివెరిసింది. అన్ని నియోజకవర్గాల్లోని 80 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 85.98 శాతం పోలింగ్ నమోదుకాగా 89.82 శాతంతో అద్దంకి అగ్రస్ధానంలో నిలిచింది. 81.89తో గిద్దలూరు 12వ స్ధానంలో నిలిచింది. ఇక నెల్లూరు జిల్లాలో ఆశించిన స్ధాయిలో పోలింగ్ శాతం నమోదుకాలేదు. జిల్లా వ్యాప్తంగా 76.86 శాతం పోలింగ్ నమోదు కాగా ఆత్మకూరు నియోజకవర్గంలో అత్యధికంగా 82.44 శాతం నమోదైంది. ఇక నెల్లూరు రూరల్ అత్యల్పంగా 65.16 శాతానికే పరిమితమైంది.

రాయలసీమ జిల్లాలోని అనంతపురం, కర్నూలు జిల్లాలో భారీగా ఓటింగ్ నమోదుకాగా చిత్తూరులో ఓ మోస్తరుగా, కడపలో స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. కడప జిల్లా పరిధిలో 2014లో 77.38 శాతం పోలింగ్ కాగా తాజాగా 77.52 శాతానికి చేరుకుంది. రాష్ట్ర స్ధాయిలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జమ్ములమడుగులో ఈ సారి భారీగా పోలింగ్ నమోదైంది. 85.42 శాతం మేర పోలింగ్ నమోదైంది. జల్లా కేంద్రం కడపలో మాత్రం పోలింగ్ 62.14 శాతానికే పరిమితమైంది. ఇక రాయలసీమ ముఖ ద్వారం కర్నూలులో గతంతో పోల్చుకుంటే నాలుగు శాతం మేర పోలింగ్ పెరిగింది. నందికొట్కూరు నియోజకవర్గంలో అత్యధికంగా 86.98 శాతం పోలింగ్ నమోదుకాగా జిల్లా కేంద్రం కర్నూలులో 59.53 శాతానికి పోలింగ్ పరిమితమైంది.

అనంతపురం జిల్లాలోనూ పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2014తో పోల్చుకుంటే 4.01 శాతం మేర పోలింగ్ పెరిగింది. జిల్లాలోని మడకశిరలో అత్యధికంగా 88.37 శాతం పోలింగ్ నమోదు కాగా అనంతపురం అర్బన్‌లో 63.18 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇక చిత్తూరు జిల్లాలో గతంతో పోల్చుకుంటే రెండు శాతం మేర పోలింగ్ పెరిగింది. 2014లో 79.44 శాతంగా ఉన్న పోలింగ్ తాజా ఎన్నికల్లో 81.5 శాతానికి చేరుకుంది. ఫైర్ బ్రాండ్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో అత్యధికంగా 86.22 శాతం పోలింగ్ నమోదు కాగా పట్టణ ప్రాంతం తిరుపతిలో 66.05 శాతానికే పోలింగ్ పరిమితమైంది. ఈసీ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ నమోదైనట్టు భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో పోలింగ్ 60 శాతానికే పరిమితం కావడంతో ప్రధాన పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories