నకిలీ యూనివర్శిటీపై వల..అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్

నకిలీ యూనివర్శిటీపై వల..అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్ట్
x
Highlights

అమెరికాలో మరో ట్రైవ్యాలీ వంటి ఉదంతం వెలుగు చూసింది. తెలుగు కుటుంబాల్లో కలకలం రేపింది. అమెరికాలో అనధికారికంగా నివసించేందుకు ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు...

అమెరికాలో మరో ట్రైవ్యాలీ వంటి ఉదంతం వెలుగు చూసింది. తెలుగు కుటుంబాల్లో కలకలం రేపింది. అమెరికాలో అనధికారికంగా నివసించేందుకు ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఏరివేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషంలో ఏర్పాటు చేసిన యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ద్వారా తమ పంజా విసిరారు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ పరిసరాల్లో ఉన్న ఫార్మింగ్టన్ హిల్స్‌లో యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌ను ఏర్పాటు చేసి ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు పాల్పడేవారి కోసం మారువేషాల్లో అధికారులు వలపన్నారు.

2015లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయంలో 2017 ఫిబ్రవరి నుండి అధికారులు స్వయంగా మారువేషాల్లో విశ్వవిద్యాలయ అధికారులు, ఉద్యోగులుగా నటిస్తూ ఇమ్మిగ్రేషన్ అక్రమాలకు పాల్పడేవారి కోసం వలపన్నారు. నిన్న ఉదయం 200మంది తెలుగువారి అరెస్టుతో ఈ యూనివర్శిటీ అంశం సంచలనంగా మారింది. అమెరికాలో తాము పూర్తి స్థాయి విద్యార్థులుగా చెలామణి అయ్యేందుకు, తద్వారా అక్రమంగా పలు ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఈ విశ్వవిద్యాలయం నకిలీ పత్రాలను విద్యార్థులకు అందజేసిందని, వాటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసిన భారతీయ విద్యార్థులు నేడు అరెస్టు కావడం దురదృష్టకరమని ప్రవాసులు పేర్కొంటున్నారు. అసలు ఏ విధమైన బోధనా ప్రణాళిక, ఉపాధ్యాయులు లేని ఈ విశ్వవిద్యాలయంలో అమెరికా నలుమూలల నుండి పెద్దసంఖ్యలో తెలుగువారు విద్యార్థులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

వీరందరినీ నిన్న ఉదయం హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు జరిపిన దాడుల్లో ఖైదు చేసి ఉత్తర కరోలినా, డల్లాస్, న్యూయార్క్ తదితర కరెక్షన్ సెంటర్లలో ఉంచారు. డల్లాస్ కరెక్షన్ సెంటరు నిండిపోగా, ఒక్క ఉత్తర కరోలినా సెంటరులోనే 60మందికి పైగా తెలుగు విద్యార్థులు కారాగారాల్లో మగ్గుతున్నారని తెలుస్తోంది.

అమెరికా అధికారులే ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించి దానిలో జేరిన విద్యార్థులను అరెస్టు చేయడం దురదృష్టకరమని, దీనిపై భారత ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని విద్యార్థులకు తగిన న్యాయం చేసేందుకు కృషి చేయాలని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కాన్సుల్‌కి తానా విజ్ఞప్తి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories