ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా ఉగాది వేడుకలు...అధికార-ప్రతిపక్ష పంచాంగ శ్రవణాలు హైలేట్‌...

ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా ఉగాది వేడుకలు...అధికార-ప్రతిపక్ష పంచాంగ శ్రవణాలు హైలేట్‌...
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. అయితే ఈసారి అధికార-ప్రతిపక్ష పంచాంగ శ్రవణాలు హైలేట్‌‌గా మారాయి. జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ...

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. అయితే ఈసారి అధికార-ప్రతిపక్ష పంచాంగ శ్రవణాలు హైలేట్‌‌గా మారాయి. జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ పంచాంగకర్త బల్లగుద్దిమరీ చెప్పారు. అయితే కొన్ని ఇబ్బందులున్నప్పటికీ అంతా శుభమే జరుగుతుందని టీడీపీ పంచాంగ శ్రవణంలో వేద పండితులు జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు నూతన సంవత్సరాది వేడుకలు వైభవంగా సాగాయి. తెలుగు లోగిళ్లలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఆయా పార్టీ ప్రధాన కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణాలు హైలేట్‌గా నిలిచాయి.

అమరావతి ప్రజావేదిక హాల్లో జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. నెలరోజులుగా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్నబాబు ఉగాది వేడుకల్లో హుషారుగా కనిపించారు. పంచెకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మనవడు దేవాన్ష్‌తో ముచ్చటిస్తూ గడిపారు. ఇక పంచాంగ శ్రవణం వినిపించిన వేద పండితులు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ సుభిక్షంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కొన్ని ఇబ్బందులున్నప్పటికీ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటంతో అంతా శుభమే జరుగుతుందని తెలిపారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ అధినేత జగన్‌తోపాటు పలువురు వైసీపీ ముఖ‌్యనేతలు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం వినిపించిన ప్రముఖ సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఏపీలో తిరుగులేని మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డేనన్న పంచాంగకర్త జగన్‌‌కు గ్రహబలం బాగుందన్నారు. జగన్‌ విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా, ఆరోగ్యవంతమైన పాలన అందిస్తూ, ప్రత్యేక హోదా సాధిస్తారని జోస్యం చెప్పారు. సకాలంలో వర్షాలుపడి, వ్యవసాయం సమృద్ధిగా సాగుతుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి టీడీపీ, వైసీపీ రెండు పంచాంగ శ్రవణాల్లోనూ రైతులకు మంచి జరుగుతుందని చెప్పడం శుభపరిణామం. అలాగే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ సుభిక్షంగా ఉంటుందని, సకాలంలో వర్షాలు పడతాయని, వ్యవసాయం సమృద్ధి సాగుతుందని వేద పండితులు జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories