తెలంగాణలో వైభవంగా ఉగాది వేడుకలు...ఆసక్తికరంగా పార్టీల పంచాంగ శ్రవణాలు

తెలంగాణలో వైభవంగా ఉగాది వేడుకలు...ఆసక్తికరంగా పార్టీల పంచాంగ శ్రవణాలు
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో వికారినామ సంవత్సరాది వేడుకలు సందడిగా సాగాయి. తెలుగు లోగిళ్లలో ఉగాది సంబరాలు వెల్లివిరిశాయి. ముఖ్యంగా తెలంగాణలో తెలుగు నూతన సంవత్సర...

తెలుగు రాష్ట్రాల్లో వికారినామ సంవత్సరాది వేడుకలు సందడిగా సాగాయి. తెలుగు లోగిళ్లలో ఉగాది సంబరాలు వెల్లివిరిశాయి. ముఖ్యంగా తెలంగాణలో తెలుగు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అయితే ఉగాది సందర్భంగా పొలిటికల్‌ పార్టీలు నిర్వహించే పంచాంగ శ్రవణాలు ఎప్పటిలాగే ఈసారి కూడా హైలేట్‌గా నిలిచాయి.

తెలంగాణ అంతటా ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వం తరపున, అలాగే వివిధ పార్టీల కార్యాలయాల్లో పంచాంగ శ్రవణాలు సందడిగా సాగాయి. అయితే ఎన్నికల కోడ్‌ కారణంగా అధికారిక ఉగాది వేడుకలను ప్రగతిభవన్‌ జనహితలో కాకుండా రవీంద్ర భారతిలో నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలూ సుఖసంతోషాలతో ఉంటారని పంచాంగకర్త అన్నారు.

గాంధీభవన్‌లోనూ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని, రాజకీయ అస్థిరత నెలకొంటుందని, దాంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదని పండితులు శ్రీనివాసమూర్తి చెప్పుకొచ్చారు.

ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఉగాది సెలబ్రేషన్స్‌ సందడిగా సాగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు దత్తాత్రేయ, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాంగం వినిపించిన మాడుగుల శశిభూషణ సోమయాజులుశర్మ బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. తెలుగు సంవత్సరాది రోజున ఉగాదితోపాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకున్నారు బీజేపీ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories