ఐటీగ్రిడ్స్‌ కేసు.. అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఐటీగ్రిడ్స్‌ కేసు.. అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురు
x
Highlights

డేటా లీక్ వ్యవహారంలో కేంద్రబిందువుగా మారిన ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరపు అశోక్ కు హైకోర్టులో ఊహించని పరిస్థితి ఎదురైంది. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన...

డేటా లీక్ వ్యవహారంలో కేంద్రబిందువుగా మారిన ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరపు అశోక్ కు హైకోర్టులో ఊహించని పరిస్థితి ఎదురైంది. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వెంటనే సమాధానం చెప్పాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐటీ గ్రిడ్స్ డేటా వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్న అశోక్ తనకు నోటీసులు పంపడంపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ మొదలుపెట్టిన న్యాయస్థానం తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించింది. దాంతో, అశోక్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ తెలంగాణ పోలీసులకు సహకరించడానికి తన క్లయింటు సిద్ధంగా ఉన్నాడని, కానీ పోలీసుల వేధింపుల కారణంగా అతను ఆందోళనకు గురవుతున్నాడని తెలిపారు.

ఐటీ గ్రిడ్స్ భద్రపరిచిన డేటా ఏపీకి సంబంధించినదని, అందువల్ల ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీకి సంబంధించిన వ్యవహారంపై తెలంగాణలో సరైన రీతిలో విచారణ జరుగుతుందని తాము భావించడంలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ స్పందించలేదని, ఐటీ గ్రిడ్స్ డేటా తస్కరణ వ్యవహారంలో ప్రధాన నిందితుడు అశోకేనని పేర్కొన్నారు. పోలీసులు అశోక్ ను విచారించడానికే ప్రయత్నించారు తప్ప అతడ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించలేదని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి డేటా చౌర్యం కేసులో తెలంగాణ పోలీసుల నోటీసులకు అశోక్ సమాధానం చెప్పాలని, విచారణలో సహకరించాలని ఆదేశించారు. కేసు విచారణ కొనసాగించాలని తెలంగాణ పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా తమకు మరింత సమయం కావాలని అశోక్ తరఫు న్యాయవాది కోరినా హైకోర్టు వినిపించుకోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories