పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు.? మళ్లీ టీఆర్ఎస్‌లో చేర్చుకుంటారా..?

పార్టీ మారిన ఎమ్మెల్సీలపై వేటు.? మళ్లీ టీఆర్ఎస్‌లో చేర్చుకుంటారా..?
x
Highlights

పార్టీ మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై వేటుకు రంగం సిద్దమైంది. రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ రెడ్డిపై అనర్హత వేటు వేయాలన్న టీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు వాదనలు నిన్నటితో ముగిశాయి.

పార్టీ మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై వేటుకు రంగం సిద్దమైంది. రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ రెడ్డిపై అనర్హత వేటు వేయాలన్న టీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు వాదనలు నిన్నటితో ముగిశాయి. రెండు పక్షాల వాదనలు విన్న మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీలు రాములు నాయ‌క్, భూప‌తిరెడ్డి, యాద‌వ‌రెడ్డిపై చర్యల వ్యవహారం క్లైమాక్స్‌కు వచ్చింది. మొత్తం నలుగురిపై చర్య‌లు తీసుకోవాల‌ని టీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా కొండాముర‌ళి ఎమ్మెల్పీ ప‌ద‌వి వదులు కోవడంతో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, రాములు నాయ‌క్, భూప‌తిరెడ్డి, యాద‌వ‌రెడ్డి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. అనర్హత వేటుకు సంబంధించి మండలి ఛైర్మన్ ముందు వాద‌న‌లు జరిగాయి. ముగ్గురు ఎమ్మెల్సీల తరపున పలువురు న్యాయవాదులు వాదించారు.

ఎమ్మెల్సీలు భూప‌తిరెడ్డి, యాద‌వ‌రెడ్డి మాత్రం తాము పార్టీ మార‌లేద‌ని మండలి చైర్మ‌న్‌కు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌టి సారి రాష్ట్రానికి వచ్చిన యూపీఏ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీకి కృత‌జ్ఞతలు తెలిపేందుకే మేడ్చ‌ల్ స‌భ‌లో కలిసిన‌ట్లు యాద‌వ‌రెడ్డి వివ‌రణ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇక భూప‌తిరెడ్డి మ‌ళ్లీ టీఆర్ఎస్‌లోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని గులాబీ నేతలకు చెప్పారట. అయితే నిజామాద్ జిల్లా నేత‌ల‌ను క‌ల‌వ‌మ‌ని స‌ద‌రు నేత‌లు భూప‌తిరెడ్డికి సూచించారని ప్రచారం జరుగుతోంది.

ముగ్గురు ఎమ్మెల్సీలపై తీసుకోవలసిన చర్యల గురించి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ న్యాయ‌నిపుణుల స‌ల‌హాలు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే యాద‌వ‌రెడ్డి, భూప‌తిరెడ్డిపై అన‌ర్హ‌త వేటు పడడం ఖాయంగా కనిపిస్తుండగా గవర్న‌ర్ కోటాలో నియ‌మితులైన ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ విషయంలో మాత్రం సందిగ్ధ‌త నెలకొంది. ఈనెల 17 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభంకానుండ‌టంతో ఆ లోపే ఇద్ద‌రు ఎమ్మెల్సీలపై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశాలున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories