టీఆర్‌ఎస్‌లో ఎగ్జిట్ పోల్స్‌ గుబులు...రెండు సీట్లు...

టీఆర్‌ఎస్‌లో ఎగ్జిట్ పోల్స్‌ గుబులు...రెండు సీట్లు...
x
Highlights

ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు టీఆర్‌ఎస్‌ పార్టీలో గుబులు రేపాయి. ఒకరు 10 నుంచి 12 లోక్‌సభ స్థానాలంటే ఇంకొకరు 12 నుంచి 14 వస్తాయన్నారు. దీంతో ఇంతకాలం 16...

ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు టీఆర్‌ఎస్‌ పార్టీలో గుబులు రేపాయి. ఒకరు 10 నుంచి 12 లోక్‌సభ స్థానాలంటే ఇంకొకరు 12 నుంచి 14 వస్తాయన్నారు. దీంతో ఇంతకాలం 16 పక్కా అనుకున్న గులాబీ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ లెక్కలతో ఓడిపోయే ఆ రెండు స్థానాలు ఏంటన్నది ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.

దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఇప్పుడివి తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగడంతో కేవలం లోక్‌సభ స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. దీంతో ఎన్నికల ప్రచారం నాటి నుంచి కారు.. సారూ..16 అన్న నినాదంతో దూసుకెళ్లారు గులాబీ నేతలు. అయితే, ఎగ్జిట్ పోల్స్‌ అందుకు భిన్నంగా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

ప్రధానంగా సీ ఓటర్, న్యూస్ 18, టైమ్స్‌ నౌ, ఇండియా టుడే, ఇండియా టీవీ, సీఎన్‌ ఎక్స్, రిపబ్లిక్ లాంటి మీడియా సంస్థలన్నీ టీఆర్‌ఎస్‌కు రెండు సీట్లు మైనస్ అనే తేల్చాయి. అయితే, టుడే చాణక్య, ఏబీపీ, ఏసీ నిల్సన్ మాత్రం టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు గ్యారెంటీ అని ప్రకటించాయి. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు గులాబీ దళాన్ని కలవరపెడుతోంది.

మెజార్టీ సర్వే సంస్థల నివేదికల ప్రకారం కనీసం 2 సీట్లు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఊహించని విధంగా కాంగ్రెస్, బీజేపీ కొన్నిచోట్ల గట్టి పోటీ ఇచ్చినట్టు పార్టీ ఇంటర్నల్ సర్వేల్లో కూడా తేలింది. ఇందులో చేవెళ్ల, సికింద్రాబాద్, నల్లగొండ, మల్కాజ్‌గిరి, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాలున్నట్టు తెలుస్తోంది. మరి వీటిలో ఓడిపోయే ఆ రెండు స్థానాలేంటన్నదానిపై టీఆర్‌ఎస్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు టీఆర్‌ఎస్ నేతలను డైలమాలో పడేశాయి. మరి 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందా..? లేదా అన్నది తెలియాలంటే 23వ తేదీదాకా ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories