పదవుల కోసం టీఆర్ఎస్ తాజా మాజీల ప్రయత్నాలు

పదవుల కోసం టీఆర్ఎస్ తాజా మాజీల ప్రయత్నాలు
x
Highlights

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన గులాబిపార్టీ నేతలు ప‌ద‌వుల కోసం ఆశ‌ప‌డుతున్నారు. ఐదేళ్ల వర‌కు ఖాళీగా ఉండాల్సిందే కాబ‌ట్టి ఏదో ఒక ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన గులాబిపార్టీ నేతలు ప‌ద‌వుల కోసం ఆశ‌ప‌డుతున్నారు. ఐదేళ్ల వర‌కు ఖాళీగా ఉండాల్సిందే కాబ‌ట్టి ఏదో ఒక ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ప‌ద‌వి లేదా ఏదో ఒక నామినేటెడ్ పోస్టు అయినా దొర‌క‌పోతుందా అని అటు కేసీఆర్‌, ఇటు కేటీఆర్ ను క‌లిసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించినా కొంద‌రు నేత‌లు ఓట‌మిని చ‌విచూశారు. ఇందులో న‌లుగురు మంత్రుల‌తో పాటు 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ఓడిపోయిన నేత‌లంతా ఇప్పుడు టిఆర్ఎస్ ముఖ్య నేత‌ల చుట్టూ తిరుగుతున్నారు. కొంద‌రు నేత‌లైతే ఏకంగా ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటు క్యాబినెట్ లో చోటు ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నారు. మ‌రికొందరు క‌నీసం నామినేటేడ్ ప‌దవులు అయిన ద‌క్కించుకుంటే క‌నీసం ప్రోటోకాల్ ఉంటుంద‌న్న భావ‌న‌లో ఉన్నారు.

మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవినిగానీ లేదా చేవెళ్ల ఎంపీ టిక్కెట్ కు గానీ ఆశిస్తున్నారు. ఇందులో ఎమ్మెల్సీ వ‌స్తే, మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి దక్కించుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక మ‌రో మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సైతం ఎమ్మెల్సీ ప‌ద‌వి కోరుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సీనియ‌ర్ నేత కావ‌డంతో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌స్తుంద‌నే చ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది. మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఓడిపోయిన త‌ర్వాత బ‌య‌టికి ఎక్క‌డా క‌నిపించ‌కున్నా సీఎం కేసీఆర్ సాన్నిహిత్యం దృష్ట్యా, ఆయ‌న‌కు కూడా ఏదో ఒక ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆయ‌న అనుచ‌రులు చెప్పుకుంటున్నారు. మరో మాజీ మంత్రి చందూలాల్ కూడా అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ను ప‌దే ప‌దే క‌లుస్తూ త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులు సైతం ఏదో ఒక ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రెండో సారి ముఖ్య‌మంత్రిగా బాద్య‌త‌లు స్వీక‌రించిన కెసీఆర్ ఓడిపోయిన నేత‌లను ప‌ట్టించుకోవాల్సిన బాద్య‌త త‌న‌పై ఉంద‌ని స‌న్నిహితుల వ‌ద్ద చెప్ప‌డంతో, తాజా మాజీల్లో ఆశ‌లు చిగురించాయి. నామినేటేడ్ ప‌ద‌వుల‌నైనా పొందితే, క‌నీస గౌర‌వం ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క్యాబినెట్ తో స‌హా నామినేటేడ్ పోస్టుల భ‌ర్తీ లేదు కాబ‌ట్టి సీరియ‌స్ ప్ర‌యత్నాలు చేసుకుంటే బెట‌ర్ అని నేత‌లు భావిస్తున్నారు.

మొత్తంగా ప‌ద‌వి లేక‌పోతే ఐదేళ్ల పాటు ఖాళీగా ఉండ‌టం క‌ష్టంగా భావిస్తున్నారు నేత‌లు. చిన్న‌దో, పెద్ద‌దో వస్తే చాలు అన్న ఆలోచ‌న‌లో ఉన్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు అధికారం చెలాయిస్తున్నా త‌మ‌కు ఏదో ఒక ప‌ద‌వి ఉంటే, కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇవ్వ‌వ‌చ్చ‌నే విష‌యాన్ని పార్టీ ముఖ్య నేత‌ల‌కు చెబుతున్నారు. ఎర్ర‌వెల్లిలో కైసీఆర్ నిర్వ‌హిస్తోన్న చండీయాగం అనంత‌రం ప‌ద‌వుల భ‌ర్తీ మీద కెసీఆర్ దృష్టిసారిస్తారా అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు నేత‌లు.

Show Full Article
Print Article
Next Story
More Stories